డొక్కు స్కూటర్ కి కోట్లలో ఆఫర్లు

Update: 2016-05-26 05:50 GMT
ఓ పాతికేళ్ల పాతదైన స్కూటర్ ఇంట్లో ఉంటే ఏం చేస్తాం? కాటాకి వేసేయడమో.. అయినకాడికి అమ్మేయడమో చేయాలి. కానీ అలాంటి ఓ స్కూటర్ కి ఇప్పుడు కోట్ల రూపాయల ఆఫర్లు వస్తున్నాయి. అయినా సరే దాని ఓనర్ మాత్రం.. ఆ స్కూటర్ ని అమ్మడానికి ఇష్టపడ్డంలేదు. ఎన్ని కోట్లిచ్చినా అది నాకే.. ఎవరికీ ఇవ్వనంటున్నాడు ఓ కోల్కతా పౌరుడు.

సుజిత్ నారాయణ్ సుర్ కోల్కతాలో సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారి. ఇతగాడి దగ్గర ఉన్న ఓ డొక్కు స్కూటర్ ను అమితాబ్ బచ్చన్ నటించిన తీన్ మూవీ కోసం ఉపయోగించారు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ లో అమితాబ్ నడిపిన బ్లూ కలర్ స్కూటర్ ఇదే. సినిమా కోసం అమితాబ్ డ్రైవ్ చేసేందుకు వీలుగా కొన్ని మార్పులు చేసి ఇచ్చాడు సుజిత్. షూటింగ్ పూర్తయిపోయాక.. ఈ స్కూటర్ ఒరిజినల్ ఓనర్ దగ్గరకు చేరిపోయింది.

ఏకంగా బిగ్ బీ నడిపిన స్కూటర్ కావడంతో.. ఇప్పుడు దీనికి కోట్ల రూపాయల ఆఫర్స్ వస్తున్నాయి. అయినా సరే సుజిత్ మాత్రం దీన్ని అమ్మబోనని తేల్చేస్తున్నాడు. 'బిగ్ బీ నడిపిన స్కూటర్ కు ఎంతిచ్చినా తక్కువే. దానికి రేటు కట్టలేం. అందుకే దాన్ని ఇంట్లోనే దాచుకుంటా. ఆ స్కూటర్ పక్కన అమితాబ్ ఫోటో ఒకటి పెద్దది చేయించుకుని పదిలంగా దాచుకుంటా' అంటున్నాడు సుజిత్.
Tags:    

Similar News