అల్లు అర్జున్.. ది న్యూ కింగ్

Update: 2016-04-28 11:30 GMT
దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్ ను ఏలాడు మెగాస్టార్ చిరంజీవి. మాస్.. క్లాస్ .. అని తేడా లేకుండా అన్ని వర్గాల అభిమానుల్నీ అలరించి సిసలైన నెంబర్ వన్ గా కొనసాగాడు. ఐతే ఆయన వెళ్లిపోయాక నెంబర్ వన్ ఎవరో తేల్చడం కష్టమైపోయింది. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబుల మధ్య ప్రధానంగా పోటీ నడిచింది కానీ.. వీరిలో ఎవ్వరూ స్పష్టమైన ఆధిపత్యం చలాయించలేకపోయారు. ఐతే ఈ నెంబర్ల సంగతి పక్కనబెట్టేస్తే ప్రస్తుతం చిరంజీవిలా ఆల్ రౌండర్ అనిపించుకున్న హీరోలు తక్కువ మందే.

పవన్ కళ్యాణ్ విషయానికే వస్తే అతను డ్యాన్సుల్లో వీక్. ప్యూర్ మాస్ మసాలా సినిమాల్లో క్లిక్ కాలేడన్న విమర్శ ఉంది. మహేష్ బాబుకున్న ఇబ్బందీ ఇదే. పోకిరి.. దూకుడు లాంటి మాస్ సినిమాలు చేసినా అతడిపై క్లాస్ ముద్రే ఉంది. మాస్ హీరోలకు బ్రహ్మరథం పట్టే సీడెడ్ లో మహేష్ కు మిగతా వాళ్లతో పోలిస్తే ఆదరణ తక్కువే. ఇక రామ్ చరణ్ సంగతి చూస్తే అతడికి మాస్ లో మంచి ఫాలోయింగే ఉంది కానీ.. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్.. క్లాస్ ప్రేక్షకుల్లో ఆదరణ పెంచుకోవాల్సి ఉంది. ఎన్టీఆర్ మాస్ ముద్ర నుంచి బయటికి వచ్చి క్లాస్ ఆడియన్స్ లోనూ ఆదరణ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. రెంటికి మధ్య సమతూకం సాధించడానికి కష్టపడుతున్నాడు. ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ఎక్కడికో వెళ్లిపోయాడు కానీ.. ఈ సినిమా కోణంలో చూసి అతణ్ని అంచనా వేయలేం. బాహుబలి ముద్ర నుంచి బయటికి వస్తే కానీ.. అతడి అసలు సత్తా ఏంటో చెప్పలేం.

వీళ్లందరితో పోల్చి చూస్తే అల్లు అర్జునే ప్రస్తుతం అసలైన ఆల్ రౌండర్ లాగా కనిపిస్తున్నాడు. గత కొన్నేళ్లలో తన ఫాలోయింగ్ భారీగా పెంచుకుని.. ఇప్పుడు ‘సరైనోడు’తో శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయాడు బన్నీ. క్లాస్ లో ఇప్పటికే అతడి ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఐతే గత ఏడాది రుద్రమదేవి.. ప్రస్తుతం సరైనోడు సినిమాలతో మాస్ లోనూ మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బన్నీ. అల్లు అర్జున్ కు ఏదైతే బలహీనతగా అనుకున్నారో ఇప్పుడు ఆ ఏరియాలోనూ బలం పుంజుకున్నాడు. డ్యాన్సుల్లో.. ఫైట్లల్లో అతడి ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. క్లాస్.. మాస్.. ఫ్యామిలీస్.. కిడ్స్.. అని తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ ఆదరణ పెంచుకున్నాడు బన్నీ. క్రేజ్ పరంగా.. అంకెల లెక్కల్లో చూస్తే పవన్-మహేష్ వెనకే ఉంటాడు కానీ.. ఆల్ రౌండర్ అన్న కోణంలో చూస్తే బన్నీకి చిరుతో పోలిక పెట్టే పరిస్థితి కనిపిస్తోందిప్పుడు.
Tags:    

Similar News