వారసత్వం కాదు.. సొంత గుర్తింపే అసలు పరీక్ష!

ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ప్రతి హీరో తన కెరీర్‌కు వేర్వేరు మార్గాలను ఎంచుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తోంది.

Update: 2026-09-07 06:30 GMT

సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ ఫ్యామిలీ నుంచి రావడం మొద‌ట్లో ఎంట్రీని ఈజీ చేయొచ్చు. కానీ అదే కుటుంబ పేరు వెనుక దాక్కుని కెరీర్‌ను ఎక్కువకాలం కొనసాగించడం మాత్రం సాధ్యం కాదు. ప్రేక్షకులు ఇప్పుడు ప్రతి కొత్త తరాన్ని తమ కుటుంబ వారసత్వంతో పోల్చడమే కాదు.. వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందా లేదా అన్నదానిపైనా తీర్పు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబానికి చెందిన హీరోల కెరీర్ ప్రయాణాలు ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నాయి.

ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ప్రతి హీరో తన కెరీర్‌కు వేర్వేరు మార్గాలను ఎంచుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తోంది. కమర్షియల్ సినిమాలపై నమ్మకం పెట్టుకునేవారు ఒకవైపు ఉంటే, కథకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలతో ముందుకు వెళ్లేవారు మరోవైపు ఉన్నారు. ప్రయోగాత్మక పాత్రలు, విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను నిర్మించుకునే ప్రయత్నం చేసేవారూ ఉన్నారు. అక్కినేని హీరోల్లో ఎవరి కెరీర్ స్ట్రాటజీ ఎక్కువకాలం సక్సెస్ అవుతుందనే ప్ర‌శ్న మొద‌లైంది.

ఇప్పటి టాలీవుడ్ పరిస్థితుల్లో ఒక హీరో కెరీర్‌ను ఒక్క సక్సెస్ ఎంతవరకు మార్చగలదన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చే ఒక భారీ హిట్ మార్కెట్‌ను మార్చగలదు. నిర్మాతల నమ్మకాన్ని పెంచగలదు. డైరెక్ట‌ర్ల నుంచి వచ్చే కథల స్వభావాన్ని కూడా మార్చగలదు. కానీ ఆ ఒక్క హిట్‌ను నిలబెట్టుకోవడం కోసం తర్వాత తీసుకునే డెసిష‌న్సే అసలు కెరీర్‌కు పరీక్షగా మారుతాయి.

అందుకే ఇప్పుడు కేవలం సెకండ్ ఇన్నింగ్స్ అనే పదం కంటే రీ ఇన్వెన్షన్ మరింత ముఖ్యమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పాత ఇమేజ్‌ను వదిలి కొత్త పాత్రలు చేయడం, జానర్లు మార్చడం, ఆడియ‌న్స్ టేస్ట్ కు తగ్గట్టుగా తమను తాము మార్చుకోవడం హీరోలకు తప్పనిసరిగా మారుతోంది. ఇదే సమయంలో ఇటీవల ఒక వేదికపై సుమంత్ సరదాగా అయ్యగారు ట్యాగ్ తనదేనని వ్యాఖ్యానించడం కూడా విశేషం. ఫ్యాన్స్ అంద‌రూ అఖిల్ ను అయ్య‌గారు అంటార‌ని, కానీ అక్కినేని ఇంట్లో పెద్ద మ‌న‌వ‌డిని తానేన‌ని, అస‌లు అయ్య‌గారు అనే ట్యాగ్ త‌న‌కే ఇవ్వాల‌ని స‌ర‌దాగా అన్నారు. కానీ స్టార్ ఫ్యామిలీల్లో ట్యాగ్‌లు, వారసత్వం ఎంత ఉన్నా చివరికి ఆడియ‌న్స్ కోరుకునేది మాత్రం ఒక్కటే ప్రతి హీరోకు తనదైన గుర్తింపు ద‌క్కాల‌నే. పేరును వారసత్వంగా పొందవచ్చు. అవకాశాన్ని ఫ్యామిలీ ఇవ్వొచ్చు. కానీ స్టార్‌డమ్‌ను మాత్రం ప్రతి తరం కొత్తగా సంపాదించుకోవాల్సిందే. అదే స్టార్ ఫ్యామిలీల కొత్త తరం ముందున్న అసలైన ఛాలెంజ్.

Tags:    

Similar News