వంద‌ల కోట్లు ఎందుకు దండ‌గ‌? AI 'రామాయ‌ణం'తో క‌న్నుల పండగ!

నితీష్ తివారీ లాంటి దర్శకులు 'రామాయణం' ప్రాజెక్ట్ కోసం ఏళ్ల త‌ర‌బ‌డి కష్టపడుతుంటే.. ఈ AI క్రియేటర్లు కేవలం కొన్ని గంట‌లు లేదా రోజుల్లోనే అత్యంత అద్భుతమైన విజువల్ గ్రాండియర్ దృశ్యాన్ని ఆవిష్కరించి బ్రిలియెన్సీని చాటుకున్నారు.

Update: 2026-08-30 12:47 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత సినీ ప్రపంచంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తోంది. భారీ బడ్జెట్‌లతో ఏళ్ల తరబడి సినిమాలు తీసే విధానానికి ప్రత్యామ్నాయంగా AI సాయంతో రూపొందించిన ఫ్యాన్ మేడ్ విజువ‌ల్స్‌, సినిమాలు అద్భుతం అంటూ ప్ర‌శంస‌లు అందుకుంటున్నాయి. ఇప్పుడు ఏకంగా 'రామాయణం' కాన్సెప్ట్ మూవీని తీర్చిదిద్దిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో విప‌రీతంగా ఆకట్టుకుంటోంది. ''వందల కోట్లు ఎందుకు దండగ'' అనేలా రూపుదిద్దుకున్న ఈ విజువల్స్ సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తున్నాయి. నితీష్ తివారీ లాంటి దర్శకులు 'రామాయణం' ప్రాజెక్ట్ కోసం ఏళ్ల త‌ర‌బ‌డి కష్టపడుతుంటే.. ఈ AI క్రియేటర్లు కేవలం కొన్ని గంట‌లు లేదా రోజుల్లోనే అత్యంత అద్భుతమైన విజువల్ గ్రాండియర్ దృశ్యాన్ని ఆవిష్కరించి బ్రిలియెన్సీని చాటుకున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు అంటూ వంద‌ల మందికి పేమెంట్లు ఇచ్చే ప‌ని లేకుండా ప‌నైపోతోంది.

రామాయ‌ణం ఏఐ టీజర్‌లో ముఖ్యంగా టాలీవుడ్ దిగ్గజ స్టార్ కాస్టింగ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సినిమా ఆద్యంతం ప్రిన్స్ మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కాంతివంతమైన-దివ్యమైన లుక్‌తో కనిపిస్తే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లక్ష్మణుడి పాత్రలో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఇక లంకాధిపతి రావణాసురుడిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ని చూపించిన తీరు మెస్మ‌రైజ్ చేస్తోంది. భయానక మాయావి అయిన రాక్ష‌సుడిగా అత‌డి అభిన‌యం, వైఖరి - గంభీరమైన స్ఫుర‌ద్రూపం ఈ టీజర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నితీష్ రామాయ‌ణం టీజ‌ర్‌తో య‌ష్ కి వ‌చ్చినంత పేరు ఇక్క‌డ ఎన్టీఆర్‌కి వచ్చింది.

వీరితో పాటు సీతాదేవిగా కీర్తి సురేష్, ఊర్మిళగా శ్రీలీల, మండోదరిగా జాన్వీ కపూర్ తమ ప్రశాంతమైన, సౌందర్యవంతమైన రూపాలతో అలరించారు. ఇక దశరథ మహారాజు పాత్రలో నందమూరి బాలకృష్ణ రాజసంతో కూడిన గంభీరమైన లుక్‌లో కనిపించి టీజర్‌కు మరింత మైలేజ్ తెచ్చారు. ఈ నటీనటులందరినీ ఏఐ సాయంతో పర్ఫెక్ట్ రామాయణ పాత్రలుగా మలచిన తీరు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.

ఈ కాన్సెప్ట్ టీజర్‌లో భావోద్వేగాలు, యుద్ధ సన్నివేశాలను ఎంతో గ్రాండ్‌గా డిజైన్ చేశారు. తండ్రి దశరథుడి వద్ద శ్రీరాముడు విడ్కోలు తీసుకునే సన్నివేశాలు... వనవాసానికి ప్రయాణమయ్యే దృశ్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. అలాగే లంకలో రావణాసురుడి సన్నివేశాలతో పాటు వానర సేన, రాక్షస సేనల మధ్య సాగే భారీ యుద్ధ ఘట్టాలు, రామ్-లక్ష్మణుల వీరోచిత బాణప్రయోగాలు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో డిజైన్ చేయబడ్డాయి.

ఏలాంటి డైలాగులతో ప‌ని లేకుండా.. కేవలం ఒక శక్తివంతమైన థీమ్ మ్యూజిక్‌ను మాత్రమే ఉపయోగిస్తూ కథను నడిపించిన తీరు టీజర్ స్థాయిని పెంచింది. మాటలవసరం లేకుండా విజువల్స్, నేపథ్య సంగీతంతోనే రామాయణ కావ్యంలోని పవిత్రతను, ఘనతను ఆవిష్కరించడం విశేషం. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమా రంగాన్ని ఎంతటి అద్భుతమైన మలుపులు తిప్పబోతోందో చెప్పడానికి ఈ ఫ్యాన్ మేడ్ `రామాయణ` టీజర్ ఒక ఉదాహరణగా నిలిచింది.

సినిమా నిర్మాణంలో సరికొత్త శకానికి నాంది:

సినిమా నిర్మాణం అంటేనే భారీ బడ్జెట్లు, ఎండ్-లెస్ లొకేషన్ల వేట, కాస్ట్యూమ్స్, మేకప్, కారవాన్ల హడావుడి, స్టార్ ఆర్టిస్టుల కాల్షీట్ల సమస్యలు, ఖరీదైన టెక్నీషియన్లు , కెమెరా డిపార్ట్‌మెంట్లతో కూడిన సుదీర్ఘమైన షెడ్యూళ్లు. రోజులు తరబడి నటీనటుల కోసం ఎదురుచూడటం.. కోట్లాది రూపాయల ఖర్చుతో సెట్స్ వేయడం వంటివన్నీ సాంప్రదాయ సినిమా మేకింగ్‌లో భాగం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చాక ఈ శ్రమ, సమయం , ఖర్చులన్నీ ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఎటువంటి లైవ్ సెట్స్... హడావుడి లేకుండా కేవలం కంప్యూటర్ స్క్రీన్ ముందే అనుకున్న కాన్సెప్ట్‌ను అత్యున్నత దృశ్యకావ్యంగా మలచడం సాధ్యమవుతోంది.

ప్రస్తుతం ఏఐ ప్రారంభ దశలోనే విజువల్స్.. నటీనటుల రూపాలు.. యుద్ధ ఘట్టాలను ఇంత అద్భుతంగా, సులువుగా ఆవిష్కరిస్తూ గొప్ప మ్యాజిక్ చేస్తోంది. కాన్సెప్ట్ టీజర్లు - గ్రాఫిక్స్ విషయంలో ఏఐ సాధిస్తున్న ఈ పురోగతిని చూస్తుంటే మునుముందు `ఆర్గానిక్ ఇంటెలిజెన్స్` (OI) లేదా మరింత అధునాతన ఏఐ సాంకేతికత వస్తే చలనచిత్ర రంగం ఏ స్థాయికి చేరుకుంటుందో ఊహించడం కూడా కష్టమే. భవిష్యత్తులో సాంకేతికత మరింత పరిణతి చెందితే.. భారీ బడ్జెట్ల అవసరం లేకుండా ప్రతీ ఒక్కరి ఆలోచనలు అత్యుత్తమ దృశ్యరూపాలుగా మారి సినిమా నిర్మాణంలో సరికొత్త శకానికి నాంది పలకడం ఖాయం. ఏఐ సినిమాలు చూడ‌లేం అంటూనే గంట‌ల త‌ర‌బ‌డి ఇప్పుడు కంప్యూట‌ర్లలో యూత్ వాటిని వీక్షిస్తూనే ఉండ‌టాన్ని గ‌మ‌నించాల్సి ఉంది.


Full View


Tags:    

Similar News