మిస్సింగ్ సూప‌ర్‌స్టార్‌ని 25ఏళ్లుగా వెతుకుతూనే

అయితే అంత పెద్ద సూప‌ర్‌స్టార్ అనూహ్యంగా చిత్ర‌ప‌రిశ్ర‌మ నుంచి నిష్కృమించాడు. ఆ త‌ర్వాత అత‌డు ఎక్క‌డ ఉన్నాడో ఎంత వెతికినా ఆచూకీ కూడా దొర‌క‌లేదు.;

Update: 2025-07-28 04:36 GMT

అత‌డు రిషీ క‌పూర్, అమితాబ్, ధ‌ర్మేంధ్ర వంటి స్టార్ల‌కు స‌వాల్ విసిరిన న‌టుడు. కెరీర్ లో దాదాపు 100 పైగా చిత్రాల్లో న‌టించిన ఫేమ‌స్ ప‌ర్స‌నాలిటీ. సూప‌ర్ స్టార్‌గా చ‌రిత్ర‌కెక్కాడు. యువ‌త‌రం ఫాలోయింగ్, మ‌హిళా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న మేటి న‌టుడు. అయితే అంత పెద్ద సూప‌ర్‌స్టార్ అనూహ్యంగా చిత్ర‌ప‌రిశ్ర‌మ నుంచి నిష్కృమించాడు. ఆ త‌ర్వాత అత‌డు ఎక్క‌డ ఉన్నాడో ఎంత వెతికినా ఆచూకీ కూడా దొర‌క‌లేదు.

కెరీర్ డిస్ట్ర‌బ్ అయ్యి, ఫ్లాపులు ఎదుర్కొన్న క్ర‌మంలో అత‌డు పూర్తిగా డిప్రెష‌న్ లోకి వెళ్లాడ‌ని, ఆ త‌ర్వాత ఓ మాన‌సిక చికిత్సాల‌యంలో చేరాడ‌ని కూడా పుకార్లు షికార్ చేసాయి. కుటుంబంలో అత‌డికి కొన్ని స‌వాళ్లు ఎదుర‌వ్వ‌డం వ‌ల్ల కూడా మాన‌సికంగా తీవ్ర ఒత్తిడికి గుర‌య్యాడ‌ని ప్ర‌చారం సాగింది. కానీ వేటికీ అధికారిక ధృవీక‌ర‌ణ‌లు లేవు. అత‌డు అట్లాంటాలో ఏదో ఒక చోట ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవించేస్తున్నాడ‌ని, ఎవ‌రికీ క‌న‌ప‌డ‌కుండా ఉండేందుకే అత‌డు అలా వెళ్లిపోయాడ‌ని కూడా ప్ర‌చారం సాగింది. అత‌డు క్యాబ్ డ్రైవ‌ర్ గా ప‌ని చేసాడ‌ని కూడా పుకార్లు ఉన్నాయి.

పాతికేళ్లుగా అత‌డి ఆచూకీ కోసం అత‌డి కుటుంబం వెతుకుతూనే ఉంది. కానీ అత‌డు ఎక్క‌డ ఉన్నాడో దొర‌క‌డం లేదు. ఇంత‌కీ ఈ న‌టుడు ఎవ‌రో తెలుసుకోవాల‌ని ఉందా? అర్థ్, కర్జ్, మజ్దూర్, ఘర్ ఏక్ మందిర్, ఆజ్ కా దౌర్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించిన రాజ్ కిర‌ణ్ గురించే ఇదంతా. ధ‌ర్మేంద్ర స‌హా ఎంద‌రో దిగ్గ‌జ హీరోల కంటే అంద‌గాడు రాజ్ కిర‌ణ్. భారీగా ఫీమేల్ ఫాలోయింగ్ ఉన్న న‌టుడు. కానీ అత‌డి అదృశ్యం వింతైన‌ది. ఎవ‌రికీ క‌నిపించ‌కుండా వెళ్లిపోవాల‌నే అత‌డి నిర్ణ‌యం వెన‌క ఎంత‌టి మాన‌సిక అప్ర‌శాంత‌త ఉందో కూడా అర్థం చేసుకోవ‌చ్చు. రాజ్ కిర‌ణ్‌ బొంబాయిలో సింధీ హిందూ కుటుంబంలో జన్మించాడు. అత‌డి న‌ట‌న‌ను, పాత్రలను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడి, పరిశ్రమలో ఇతర పెద్ద తారల కంటే గొప్ప‌వాడిగా నిల‌బెట్టాయి. అద్భుతమైన నటన, తెలివితేటలు- స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సు అత‌డిని గొప్ప‌వాడిని చేసాయి.

అయితే రాజ్ కిర‌ణ్ క‌నిపించ‌క‌పోయేస‌రికి ధ‌ర్మేంద్ర ఆరాలు తీసారు. త‌న స‌హ‌న‌టుడి గురించి క‌ల‌త చెందాన‌ని చెప్పారు. రాజ్ కిర‌ణ్ అన్న గోవింద్ మెహ‌తాని వెతికి ప‌ట్టుకుని రాజ్ గురించి ఆరాలు తీసాన‌ని తెలిపారు. చివ‌రికి రాజ్ బతికే ఉన్నాడని నాకు చెప్పినప్పుడు నాకు చాలా ఉపశమనం కలిగింది. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా అతను అట్లాంటాలోని ఒక సంస్థలో ప‌ని చేస్తున్నాడ‌ని చెప్పిన‌ట్టు గుర్తు చేసుకున్నాడు. మానిసిక వ్యాధికి రాజ్ చికిత్స తీసుకుంటున్నాడని చెప్ప‌గానే ఒక గొప్ప న‌టుడికి ఇది ధీన స్థితి అని భావించిన‌ట్టు ధ‌ర్మేంద్ర చెప్పుకొచ్చారు. భారతీయ అమెరికన్ నటి దీప్తి నావల్ .. రాజ్ కిరణ్ ఎక్కడ ఉన్నారో వెతకడానికి ప్రయత్నించింది. అత‌డు చివరిగా న్యూయార్క్ నగరంలో క్యాబ్ నడుపుతున్నాడని విన్నాను అని కూడా చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

2018లో రాజ్ కిరణ్ అదృశ్యం గురించి మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. రాజ్ కిరణ్ కుమార్తె రిషిక అట్లాంటాలో రాజ్ కిరణ్ దొరికాడనే వార్తలకు స్పందిస్తూ ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసారు. తండ్రి ఆచూకీ కోసం తమ కుటుంబం నిరంతరం వెతుకులాటలో ఉందని.. న్యూయార్క్ పోలీసులు, ప్రైవేట్ డిటెక్టివ్‌ల‌ సహాయంతో ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఎక్కడా కనిపించలేదని రిషిక‌ తెలిపారు.

Tags:    

Similar News