మరో వెడ్డింగ్ బెల్స్: ఆ జోడీకి ముహూర్తం ఖరారు?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తోంది.;
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా పెళ్లిళ్ల సందడే కనిపిస్తోంది. ఇటీవలే పలువురు స్టార్ జంటలు ఒకటవ్వగా తాజాగా మరో జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోందనే వార్త బి-టౌన్‌లో వినిపిస్తోంది. నటి ఆకాంక్ష రంజన్ కపూర్ - దర్శకుడు శరణ్ శర్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న జంట తమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూలై లో వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆకాంక్ష రంజన్- శరణ్ శర్మ గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నా? వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచారు. అయితే ఇటీవల జరిగిన పలు సినీ వేడుకల్లో జంటగా కనిపించడంతో ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే విషయం అర్థమైంది. ఇప్పుడు ఏకంగా జూలైలో వివాహం అనే వార్త బయటకు రావడంతో అభిమానులు వారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆకాంక్ష రంజన్ కపూర్- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌కు అత్యంత సన్నిహితురాలు అన్న సంగతి తెలిసిందే. ఆలియా పెళ్లిలో ఆకాంక్ష సందడి అందరికీ గుర్తే.
తాజాగా ఆకాంక్ష పెళ్లి కావడంతో? ఆలియా భట్ - రణబీర్ కపూర్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. సన్నిహితుల సమాచారం ప్రకారం ఈ పెళ్లి వేడుక గ్రాండ్‌గా బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ఆలియా స్వయంగా స్నేహితురాలి పెళ్లి పనులను పర్యవేక్షించే అవకాశం కనిపిస్తుంది. వరుడు శరణ్ శర్మ విషయానికి వస్తే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న దర్శకుడు. జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటారు. అటుపై రాజ్‌కుమార్ రావు, జాన్వీ కపూర్ జంటగా రిలీజ్ అయిన `మిస్టర్ అండ్ మిసెస్ మాహి` చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.
వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉన్నా?శరణ్ వ్యక్తిగత జీవితానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ఆకాంక్షతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ వివాహానికి సంబంధించి ఈ జంట నుంచి కానీ , వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ముంబైలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో వివాహ వేడుకలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు బి-టౌన్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. జూలైలో వర్షాకాలం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇండోర్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆకాంక్ష రంజన్ తన వెడ్డింగ్ లెహంగా కోసం ఇప్పటికే ప్రముఖ డిజైనర్లను సంప్రదించినట్లు సమాచారం.