27 జిల్లాలు ఒక ఎత్తు.. అల్లూరి జిల్లా ఇంకొక ఎత్తు! ఓటమిపై చంద్రబాబు హాట్ కామెంట్స్
అల్లూరి జిల్లాలో కూటమి ఓటమికి గల కారణాలపై అధ్యయనం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మత మార్పిడులు కూడా ఓటమికి కారణమని కొందరు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాలోని 11 జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ 7, టీడీపీ 3, సీపీఎం ఒకటి గెలుచుకున్నాయి. ప్రభుత్వ విధానాలు, స్థానిక సమస్యల ప్రభావాన్ని కూడా సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు.
By: Tupaki Political Desk | 10 Nov 2026 12:40 AM ISTఏజెన్సీలో ప్రతికూల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉండగా, ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి జిల్లాలో కూటమికి ఎదురు గాలి వీయడానికి కారణాలపై అధ్యయనం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో వ్యతిరేక ఫలితాలు రావడంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి ఊహించని విధంగా సమాధానమిచ్చారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని తాను తొలి నుంచి చెబుతున్నానని, ఇప్పుడు ఎదురైన ఓటమికి అదే కారణమని కొందరు చెబుతున్నారని సీఎం చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి.
అల్లూరి జిల్లాలో ఎదురైన ఓటమికి మత మార్పిడులే కారణం అన్న భావన కూటమి పార్టీల్లో నెలకుందని సీఎం తాజా వ్యాఖ్యల బట్టి అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయంలో పెద్దగా కసరత్తు చేయని కూటమి నేతలు, తాజా ఫలితాలను చూసిన తర్వాత వ్యూహం మార్చే ఆలోచన చేస్తున్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోడానికి అధ్యయనం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. ఈ ప్రాంతంలో ఏయే అంశాలు ఓటింగును ప్రభావితం చేస్తున్నాయి? ప్రభుత్వ విధానాలు, స్థానిక సమస్యలు, ఇతర సామాజిక అంశాలపై సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు.
అల్లూరి జిల్లా పరిషత్ పీఠం విపక్షం వైసీపీ ఖాతాలో పడింది. ఈ నేపథ్యంలో అక్కడి ఓటమికి మతమార్పిడులే కారణమా? అన్న అనుమానం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అల్లూరి జిల్లాలో మొత్తం 11 స్థానాలు ఉండగా, విపక్షం వైసీపీ 7, టీడీపీ 3, సీపీఎం ఒక స్థానంలో గెలిచాయి. మెజార్టీ స్థానాలు గెలుచుకున్న వైసీపీ జడ్పీ పీఠం కైవసం చేసుకుంది. రాష్ట్రంలో 28 జిల్లాలు ఉండగా, 27 చోట్ల కూటమి గెలిచింది. కానీ, అల్లూరి జిల్లాలో గెలిచి విపక్షం పరువు నిలుపుకుంది. అయితే ఈ స్థానం కూడా కోల్పోవడాన్ని కూటమి పార్టీలు తేలిగ్గా తీసుకోలేకపోతున్నాయి. ఈ ప్రాంతంలో ఒక మత ప్రభావం వల్లే తాము గెలవలేకపోయామని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు సైతం ఇదే ఆలోచనను బయటపెట్టడంతో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యూహం సిద్ధం అవుతూందని పరిశీలకులు భావిస్తున్నారు.
నిజానికి అల్లూరి జిల్లాలో విపక్షం వైసీపీ బలంగా ఉంది. అదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేనట్లు కమ్యూనిస్టులు ఈ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతున్నారు. దీంతో ఓట్లు చీలిపోతున్నాయని, ఇది ఎక్కువగా వైసీపీకి లాభిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లా పరిధిలో ఉన్న రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తుడిచి పెట్టుకుపోయినప్పటికీ అల్లూరి జిల్లాలో మాత్రం వైసీపీ తన బలాన్ని నిరూపించుకుందని అంటున్నారు. ఇప్పుడు అదే బలం కాపాడిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో వైసీపీ బలంగా ఉండటానికి ఒక మతమే కారణమని టీడీపీ భావిస్తోందని సీఎం మాటలు బట్టి అర్థమవుతోందని అంటున్నారు. ఇన్నాళ్లు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్న టీడీపీ అధిష్టానం ఇప్పుడు ప్రత్యేక ఫోకస్ చేసిందని చెబుతున్నారు.
