Begin typing your search above and press return to search.

'ప్రత్యేక హోదా' నినాదం ఎవరికి లాభం..?

By:  Tupaki Desk   |   15 Feb 2019 4:46 AM GMT
ప్రత్యేక హోదా నినాదం ఎవరికి లాభం..?
X
ప్రత్యేక హోదా కేంద్రంగా ఏపీ నేతలు ఢిల్లీలో ఎంత రచ్చ చేశారో మనం చూశాం.. ఈ పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి అందరి కంటే ముందు వరుసలో ఉన్నారు కేవీపీ. వైఎస్‌ ఆత్మగా పిలువబడే ఈయన రాజ్యసభలో ప్రత్యేక హోదాపై నిత్యం నిరసన తెలుపుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీ సైతం ప్రత్యేక హోదా కావాలని ధర్మపోరాట దీక్షలకు పూనుకొని ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీలో జాతీయ నాయకులతో కలిసి ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు ధర్నా చేశారు.

ఈ కార్యక్రమానికి జాతీయ పార్టీ కాంగ్రెస్‌ కూడా కలిసి వచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు సీనియర్‌ నేతలు మన్మోహన్‌ సింగ్‌, అహ్మద్‌ పటేల్‌, జైరాం రమేశ్‌, కమల్‌నాథ్‌ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ముందుగా ఏపీకి ప్రత్యేక హోదా ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో కేవీపీ మాత్రం కనిపించలేదు.

అంతేకాకుండా ఇన్నిరోజుల నుంచి ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడలేదని కేవీపీ తాజాగా బాబును విమర్శించారు. ఈ విషయంపై చంద్రబాబును అడుగగా 'కాంగ్రెస్‌ లోని జాతీయస్థాయి నేతలంతా తమతో కలిసి వస్తున్నారు. నిజంగా ప్రత్యేక హోదా కావాలని ఉంటే తమతో కలిసి రావాలి. ఆసలు ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారా..? లేక ఇతర పార్టీలో ఉన్నారా..? అనేది ఆయనే నిర్ణయించుకోవాలి.' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలకు కేవీపీ స్పందించారు. 'ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ మొదటి నుంచి పోరాటం చేస్తోంది. కాంగ్రెస్‌ పోరాటంలో టీడీపీ కలిసింది గానీ.. టీడీపీతో కాంగ్రెస్‌ కలిసి వెళ్లడం లేదు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిది ఓవరాక్షన్‌ తప్ప చేసేదేమీ లేదు' అంటూ ఘాటుగా విమర్శించారు. జాతీయ స్థాయిలో టీడీపీ-కాంగ్రెస్ దోస్తానా తర్వాత ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ నాయకులు బాబుపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. కానీ కేవీపీ మాత్రం బాబునే టార్గెట్‌ చేయడం కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

ఈ విమర్శల వెనక పెద్ద కారణమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎప్పటికైనా ఏపీకి కాంగ్రెస్‌ ప్రభుత్వమే హోదా ఇవ్వాలి. అలాంటప్పుడు కాంగ్రెస్‌ తో కలిసి ప్రత్యేక హోదాపై పోరాటం చేయడంతో ఇటు ప్రజల్లోనూ అటు జాతీయ పార్టీతో సత్సంబంధాలు మెరుగుపరుచుకొని అనుకున్నది సాధించవచ్చని బాబు ప్లాన్‌. అయితే మొదటినుంచి హోదా విషయంలో కాంగ్రెస్‌ పోరాడుతుందని కనుక ఈ క్రెడిట్‌ టీడీపీకి దక్కకూడదని కేవీపీ ఆలోచన అన్నట్లు తెలుస్తోంది.

కానీ ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్‌ ఒంటరిగా హోదా పేరుతో అధికారంలోకి రావడం కల్లే.. టీడీపీతో కలిసి నడవడం తప్పితే కాంగ్రెస్ కు మరో గత్యంతరం లేదు. అదే సమయంలో రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలని పోరాడుతున్న వైసీపీకి కాంగ్రెస్-టీడీపీ మిత్ర భేదం వల్ల లాభం చేకూరే అవకాశాలున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ అసంతృప్తులు టీడీపీకి సపోర్టుగా నిలవకుండా అంతర్గతం వైసీపీకి మద్దతుగా నిలబడే చాన్స్ ఉందంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ , కాంగ్రెస్ పైకి కలిసిపోయినా ఆ నేతల్లో మాత్రం టీడీపీపై ఒకింత ఏహ్య భావమే ఉంది.