Begin typing your search above and press return to search.

విదేశం నుంచి చంద్రబాబు రిటర్న్స్.. సమస్యలే స్వాగతం!

By:  Tupaki Desk   |   25 Jun 2019 7:32 AM GMT
విదేశం నుంచి చంద్రబాబు రిటర్న్స్.. సమస్యలే స్వాగతం!
X
ఎన్నికల ప్రచార సమయం నుంచి చంద్రబాబు నాయుడు ఒకే రకమైన ఒత్తిడిలో ఉంటూ వచ్చారు. అది అన్ని రాజకీయ పార్టీల నేతలనూ అనుభవించిన ఒత్తిడే. ఎన్నికలకు ముందు నెలన్నర పాటు చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఒత్తిడి అనుభవించారు. ప్రచార పర్వానికి ముందు నుంచినే చంద్రబాబు నాయుడు వరసగా ఢిల్లీ పర్యటనలు చేపట్టడం.. బీజేపీ వ్యతిరక ఫ్రంట్ అంటూ హడావుడి చేస్తూ వచ్చారు.

ఇక ఎన్నికల ప్రచార పర్వం సరేసరి. ఏపీలో పోలింగ్ తొలి విడతలోనే పూర్తి అయ్యింది. అయితే అప్పటికీ చంద్రబాబు నాయుడుకు ప్రశాంతత లభించలేదు. ఏపీలో పోలింగ్ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో సహా అక్కడి నేతలు రిలాక్సింగ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. అయితే చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగారు! ఏదేదో మాట్లాడారు. మోడీని గద్దెదించడమే లక్ష్యమన్నారు. అన్ని పార్టీల వాళ్లతోనూ కలిశారు. అలా ప్రశాంతత లేకుండా తిరిగినా ఎలాంటి ప్రయోజనం అయితే దక్కలేదు. చంద్రబాబు నాయుడు చేతిలోని సీఎం పీఠం చేజారింది. కలలు కన్న ప్రధాని పీఠం దక్కలేదు.

అలా విరామం లేకుండా కొన్ని నెలలు గడిపి..గత వారంలో చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇలా అయినా చంద్రబాబుకు రిలాక్సేషన్ లభిస్తుంది అనుకుంటే.. ఆ అవకాశమే లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు విదేశానికి వెళ్లినా అక్కడ నుంచి మళ్లీ టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహించాల్సి వచ్చింది. ఆయన అలా కుటుంబంతో విదేశానికి వెళ్లగానే ఇటువైపు నలుగురు రాజ్యసభ ఎంపీలు జంప్ చేశారు. వారు చంద్రబాబు సూచనల మేరకే వెళ్లి ఉండొచ్చు గాక.. అయితే పార్టీ శ్రేణులకు అలా చెప్పలేరు కదా! వారిని సముదాయించాల్సి వచ్చింది. వారికి ధైర్యం చెప్పాల్సి వచ్చింది. అందుకే విదేశం నుంచి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

కొన్ని నెలల పాటు కష్టపడ్డాకా విరామం తీసుకున్నా చంద్రబాబు నాయుడుకు అక్కడ ప్రశాంతత లేకుండా పోయినట్టుంది. ఇక విదేశం నుంచి చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా మంగళవారం రిటర్న్ అయ్యారు. ఆయనకు ఇప్పుడు స్వాగతం పలుకుతున్నది సమస్యలే!

అధికారం చేజారడం వల్ల వచ్చిన సమస్యలు. పార్టీలో లుకలుకలు. ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తూ ఉన్నారనే మాటలు. ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా పక్కచూపులు చూస్తున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓడిన వారు కూడా తమను తాము రక్షించుకునే పనిలో బీజేపీ వైపు చూస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇక చంద్రబాబుకు అప్పుడే అయిపోలేదు. చంద్రబాబు హయాంలోని అవినీతి వ్యవహారాలన్నింటినీ తవ్వి తీయబోతున్నట్టుగా ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ఏవీ దొరకవని అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారట. అయితే చంద్రబాబు, లోకేష్ లను పట్టుకోవడానికి 'నీరు-చెట్టు' ఒక్కటీ చాలు అని పరిశీలకులు అంటున్నారు.

చంద్రబాబు పాలనలోని కొన్ని వ్యవహారాలను అయినా ప్రజల ముందు ఉంచడానికి జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని ఉంటారు. మరోవైపు తెలుగుదేశాన్ని తొక్కేస్తే ఏపీలో తామే ప్రత్యామ్నాయం అవుతామనే లెక్కలతో ఉంది బీజేపీ. ఇంకోవైపు కేసీఆర్ తో కూడా చంద్రబాబు నాయుడు సున్నం పెట్టుకుని ఉన్నారు. ఇలా ఇంటా బయట చంద్రబాబుకు చుక్కలు కనిపించేలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడే అసలైన పొలిటికల్ గేమ్ మొదలైందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.