Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: సింగం - 3

By:  Tupaki Desk   |   9 Feb 2017 11:22 AM GMT
మూవీ రివ్యూ: సింగం - 3
X
చిత్రం: ‘సింగం - 3 (ఎస్-3)’

నటీనటులు: సూర్య - అనుష్క - శ్రుతి హాసన్ - అనూప్ సింగ్ ఠాకూర్ - సుమన్ - శరత్ కుమార్ - శరత్ సక్సేనా - జయప్రకాష్ - రాధిక - నాజర్ - సూరి - విజయ్ కుమార్ తదితరులు
సంగీతం: హారిస్ జైరాజ్
ఛాయాగ్రహణం: ప్రియన్
నిర్మాత: మాల్కాపురం శివకుమార్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: హరి

సౌత్ ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ పని చేసిన దాఖలాలు అరుదు. ఐతే వాటిలో ‘సింగం’ సిరీస్ మినహాయింపు. ఏడేళ్ల కిందటి ‘సింగం’ తరహాలోనే మూడేళ్ల కిందటి సింగం-2 కూడా మెప్పించింది. సింగం-2 తర్వాత తనదైన శైలిలో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసిన సూర్య.. మళ్లీ ఇప్పుడు ‘సింగం’ అవతారం ఎత్తాడు. కొన్ని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడ్డ ‘ఎస్-3’ ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి మూడో సింగం ఎలా గర్జించిందో చూద్దాం పదండి.

కథ:

ఆంధ్రప్రదేశ్ లో డీసీపీగా పని చేస్తున్న నరసింహం (సూర్య) డిప్యుటేషన్ మీద కర్ణాటకలోని మంగళూరుకు వెళ్తారు. అక్కడ కిరాతకంగా హత్య చేయబడ్డ కమిషనర్ (జయప్రకాష్) కేసును నరసింహం డీల్ చేయాల్సి వస్తుంది. ముందు ఈ కేసులో నిందితుడైన రెడ్డి (శరత్ సక్సేనా)కు నమ్మిన బంటులా నటిస్తూ నెమ్మదిగా కేసు కూపీ లాగడం మొదలుపెడతాడు నరసింహం. ఈ క్రమంలో అతడికి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. కమిషనర్ హత్య వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అర్థమవుతుంది. ఆస్ట్రేలియాలో ఉంటూ వ్యాపారం చేసే కేంద్ర మంత్రి కొడుకు విఠల్ (అనూప్ సింగ్ ఠాకూర్) ఈ కుట్ర వెనుక ప్రధాన పాత్రధారి అని అర్థమవుతుంది. ఇంతకీ కమిషనర్ హత్యకు.. విఠల్ కు ఏంటి సంబంధం.. ఈ కేసును నరసింహం ఛేదించి విఠల్ ఆట ఎలా కట్టించాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

సింగం-3 క్లైమాక్సులో హీరో విలన్ని పట్టుకోవడానికి ఎయిర్ పోర్టుకు పరుగు పరుగున వెళ్తాడు. కానీ విలన్ అతడికి దొరక్కకుండా ఫ్లైట్ ఎక్కేస్తాడు. హీరో అతణ్ని వెంబడిస్తుంటే పోలీసులు అడ్డుకుంటారు. అతణ్ని వెనక్కి పంపించేస్తారు. అలాగని హీరో ఊరుకుంటాడా..? ఎయిర్ పోర్టు బయట ఉన్న ఒక కారు తీసుకుని ఇంకో వైపు నుంచి పెద్ద గేటును బద్దలు కొట్టేసి ఎయిర్ పోర్టులోకి దూసుకెళ్లిపోతాడు. రన్ వే మీదికి వెళ్లిపోయి టేకాఫ్ అవుతున్న విమానానికి అడ్డంగా వెళ్లిపోతాడు. దాన్ని ఆపించేసి విలన్ని పట్టేస్తాడు. ఈ సన్నివేశం చూస్తే కొందరికి సిల్లీగా అనిపించొచ్చు. కొందరికి రోమాలు నిక్కబొడుచుకోవచ్చు. మాస్ సినిమాలు.. అందులోనూ సింగం సిరీస్ సినిమాలంటే ఇలా ఉంటాయని ప్రిపేర్ అయిపోయి ఎంజాయ్ చేయగలిగితే ‘సింగం-3’ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. రెండున్నర గంటల పాటు ఊర మాస్ వినోదాన్ని ఆస్వాదించి బయటికి రావచ్చు.

ఈ మధ్య తమిళం.. తెలుగు అని తేడా లేకుండా మాస్ మసాలా సినిమాల జోరు తగ్గిపోయింది. స్టార్ హీరోలు సైతం క్లాస్ టచ్ ఉన్న.. వైవిధ్యమైన సినిమాలే ఎక్కువగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్ ప్రేక్షకులు తమ అభిరుచికి తగ్గ వినోదాన్ని మిస్సయిపోతున్నారు. అలాంటి వాళ్లందరికీ ‘సింగం-3’ పర్ఫెక్ట్ ఛాయిస్. మామూలుగా ప్రశాంతంగా సాగిపోయే క్లాస్ సినిమాల్నే ఇష్టపడే వాళ్లు కూడా కొంచెం మాస్ మసాలాను రుచి చూడాలనుకుంటే ‘సింగం-3’ మంచి ఆప్షనే. ‘సింగం’ సిరీస్ లో గత రెండు సినిమాలు చూసిన అనుభవంతో ‘సింగం-3’ ఎలా ఉంటుందని ఆశిస్తామో సరిగ్గా అలాగే ఉంటుందీ సినిమా. ప్రేక్షకులు దేనికైతే ప్రిపేరై వచ్చారో ఆ తరహా వినోదాన్నే అందిస్తాడు హరి. విలన్ ఎంతటి వాడైనా ఎదురే లేకుండా దూసుకెళ్లిపోయే నరసింహం.. ఆరంభం నుంచి చివరి దాకా తనదైన శైలిలో చెలరేగిపోతూ గూస్ బంప్స్ మూమెంట్స్ ఉర్రూతలూగిస్తూనే ఉంటాడు. కథలో కొత్తదనం ఆశించినా.. ఆఫ్ట్రాల్ వేరే రాష్ట్రాల్లోకి.. దేశాల్లోకి వెళ్లిపోయి ఇంతగా రెచ్చిపోతున్నాడేంటి.. మరీ ఈ స్థాయిలో హీరోయిజం ఏంటి అని లాజిక్స్ తీసినా ‘సింగం-3’ మీ కప్ ఆఫ్ టీ ఎంతమాత్రం కాదు.

సింగం-1.. సింగం-2 తరహాలోనే ఫాస్ట్ ఫార్వార్డ్ లో మోడ్ లో సినిమా చూస్తున్న ఫీలింగే కలిగిస్తుంది ‘సింగం-3’ కూడా. రెండు గంటల 36 నిమిషాల నిడివి ఉన్న సినిమాలో ఆరంభంలో ఓ పావుగంట మినహాయిస్తే ఎక్కడా కెమెరా కుదురుగా ఉండదు. ముందుకు వెనక్కి పరుగులు పెట్టేస్తూ.. ప్రేక్షకుడు ఎక్కడా చిన్న బ్రేక్ కూడా ఇవ్వకుండా.. దేని గురించీ ఆలోచించే అవకాశమే లేకుండా జెట్ స్పీడుతో వెళ్లిపోతుంటాయి సన్నివేశాలు. ఎప్పట్లాగే నరసింహం మొదట్లో కొంచెం నెమ్మదిగా ఉంటాడు. పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనిస్తూ.. తనదైన శైలిలో గుంభనంగా విచారణ సాగిస్తూ తన లక్ష్యం దిశగా అడుగులేస్తుంటాడు. ఒక్కసారి పరిస్థితులు తన కంట్రోల్లోకి రాగానే ఇక చెలరేగిపోతాడు. ఇక అతడి దూకుడు మామూలుగా ఉండదు. ఆ దూకుడు చూసి మాస్ ప్రేక్షకులు కుదురుగా కూర్చోలేరు. వాళ్లకు రోమాలు నిక్కబొడుచుకునేలా హీరోయిజాన్ని ఓ రేంజిలో పండించేశాడు హరి. రొటీన్ గా అనిపిస్తూనే.. ఆసక్తికరంగా సాగిపోయే సన్నివేశాలతో కథనం పరుగులు పెడుతుంది.

సింగం-3 కథ దాదాపుగా సింగం-2 తరహాలోనే ఉంటుంది. హీరో ముందుగా లోకల్ విలన్ల పని పట్టేసి.. ఆ తర్వాత ఇంటర్నేషనల్ విలన్ మీద పడతాడు హీరో. విలన్ పాత్ర హీరోకు దీటుగా ఉండటంతో ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఆసక్తికరంగానే సాగుతుంది. అంతిమంగా గెలిచేది హీరోనే అయినా.. అతడికి విలన్ నుంచి కూడా పోటీ గట్టిగానే ఉండటంతో హీరో పాత్ర మరింతగా ఎలివేట్ అవుతుంది. ‘ఎస్-3’కి కథా వస్తువుగా ఎంచుకున్న ‘మెడివేస్ట్’ కాన్సెప్ట్ ఆసక్తి రేకెత్తించేదే. అదొక్కటే ‘సింగం-3’లో కొత్తగా అనిపించే అంశం. మిగతావన్నీ కూడా ఒక టెంప్లేట్ ప్రకారం జరిగిపోతాయి.

హీరో సూపర్ బ్రెయిన్ తో ఇన్వెస్టిగేట్ చేసే సన్నివేశాలు.. అన్నీ అతడికి కన్వీనియెంట్ గా కలిసొచ్చేయడం.. చివరికి హీరో ఆస్ట్రేలియాలో పోలీసులకు పట్టుబడినపుడు తాను ఫలానా అని చెప్పి వాళ్లతో సెల్యూట్ కొట్టించుకోవడం.. ఇలాంటివి కొంచెం సిల్లీగా అనిపిస్తూనే ఎంటర్టైన్ చేస్తాయి. మాస్ ప్రేక్షకుల్ని మురిపించాలనే లక్ష్యం తప్ప హరికి మరో ఉద్దేశం లేదని.. ఆ విషయంలో సూర్య కూడా దర్శకుడు చెప్పినట్లు చేసుకుపోయాడని అర్థమవుతుంది. లాజిక్కుల గురించి ఆలోచించే ప్రేక్షకులకైనా సరే.. ‘సింగం-3’ థియేటర్లో కూర్చున్నంతసేపూ వాళ్లకు పెద్దగా ఆలోచించే అవకాశమే ఇవ్వడు హరి. అలా పరుగులు పెడుతుంటాయి ఇందులోని సన్నివేశాలు. కామెడీ.. పాటలు సైతం మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకున్నవే. ఐతే కథనానికి అవి కొంచెం అడ్డంకే అయ్యాయి. సూరి.. శ్రుతి హాసన్ అక్కడక్కడా హీరోనే కాదు.. సినిమా ఫ్లోను కూడా డిస్టర్బ్ చేశారు. ‘సింగం-3’ తరహా ఎంటర్టైన్మెంట్ ను ఆస్వాదించగలరా లేదా అన్నది అరగంటలోనే తేలిపోతుంది. ఆస్వాదించగలిగితే.. రెండున్నర గంటలు సులభంగా గడిచిపోతాయి. లేదా లౌడ్ నెస్ భరించలేక సగంలోనే బయటికి వచ్చేయడమే.

నటీనటులు:

సింగం తొలి రెండు భాగాల్లో కనిపించిన అనుష్క.. విజయ్ కుమార్ లతో పాటు ఇంకొందరు కూడా సింగం-3లో ఉన్నారు. వాళ్లను చూసి.. సూర్యను చూస్తే అతను సినిమా కోసం ఎంత కష్టపడతాడన్నది అర్థమవుతుంది. అందరిలోనూ మార్పు కనిపిస్తుంది కానీ.. సూర్య మాత్రం ‘సింగం-1’లో ఎలా కనిపించాడో ఇందులోనూ అలాగే కనిపించాడు. అదే ఎనర్జీతో నరసింహం పాత్రను పండించాడు. నటన పరంగా కొత్తగా చేయాల్సిన అవసరమేమీ రాలేదు. అదే ఫ్లోలో చెలరేగిపోయాడు సూర్య. మాస్ ప్రేక్షకుల్ని అతడి నటన ఉర్రూతలూగిస్తుంది. అనుష్క గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ‘సైజ్ జీరో’ ప్రభావంతో అనుష్క పూర్తిగా గ్లామర్ కోల్పోయింది. శ్రుతి హాసన్ తనదైన శైలిలో గ్లామర్ పంచింది. విలన్ అనూప్ సింగ్ ఠాకూర్ బాగానే చేశాడు. మిగతా వాళ్లందరూ పాత్రలకు తగ్గట్లుగా నటించారు.

సాంకేతిక వర్గం:

‘సింగం-3’లో కచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ లేని లోటు కనిపిస్తుంది. మ్యూజిక్ పరంగా ఇందులో ‘సింగం’ బ్రాండ్ మిస్సయింది. దేవిశ్రీని పక్కనబెట్టి హ్యారిస్ జైరాజ్ ను ఎందుకు ఈ సినిమాకు తీసుకున్నారో అర్థం కాదు. అతడి పాటలు మాస్ ను ఏమంత మెప్పించవు. సింగం థీమ్ మ్యూజిక్ సహా.. ఊపున్న మాటలు మిస్సయ్యాయి ఇందులో. నేపథ్య సంగీతం కూడా అలాగే సాగుతుంది. ఛాయాగ్రహణం.. ఎడిటింగ్ అన్నీ కూడా గత రెండు భాగాల్లో అలవాటైన తరహాలోనే సాగుతాయి. నిర్మాణ విలువల విషయంలో రాజీ అన్నది లేదు. సినిమాను రిచ్ గా తెరకెక్కించారు. దర్శకుడు హరి ‘సింగం’ అభిమానులు తన నుంచి ఏం ఆశిస్తారో అదే ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఒక టెంప్లేట్ ప్రకారం సినిమాను తెరకెక్కించాడు. కథ రొటీన్ గా ఉండటం నిరాశపరుస్తుంది. అతడి స్టయిల్లో సాగే రేసీ స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది.

చివరగా: అదే సింగం.. అదే దూకుడు

రేటింగ్: 2.75/5


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre