ఆ హీరో.. ఈసారి కూడా కష్టమంటున్నారే

Sun Jan 14 2018 08:00:01 GMT+0530 (IST)

దశాబ్దం దాటి పోయింది తమిళ కథానాయకుడు విక్రమ్ నిఖార్సయిన హిట్టు కొట్టి. సక్సెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు విక్రమ్. శంకర్ తో చేసిన ‘ఐ’ కూడా ఆడలేదు. దాని తర్వాత ‘10 ఎన్రదుకుల్లా..’ ‘ఇరు ముగన్’ అనే సినిమా చేశాడు. అవీ నిరాశ పరిచాయి. ఇప్పుడు అతడి ఆశలన్నీ ‘స్కెచ్’ మీదే నిలిచాయి. విజయ్ చందర్ అనే దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళనాట పెద్ద ఎత్తున విడుదలైంది. ఐతే ఈ సినిమా విక్రమ్ గత చిత్రాలతో పోలిస్తే బెటర్ అంటున్నారు.. అంతకుమించి పాజిటివ్ గా ఏమీ మాట్లాడటం లేదు. ఇదొక సగటు కమర్షియల్ సినిమా అనే టాక్ వినిపిస్తోంది.ఈ చిత్రంలో విక్రమ్ సరసన తమన్నా నటించిన సినిమా ఇది. ఇద్దరి కెమిస్ట్రీ బాగుందని.. తమన్ మ్యూజిక్ కూడా ఓకే అని.. కానీ సినిమా మాత్రం అంత గొప్పగా ఏమీ లేదంటున్నారు. సంక్రాంతి సీజన్ కాబట్టి వసూళ్లు బాగానే ఉన్నాయి. అంతిమంగా విక్రమ్ కోరుకునే విజయాన్ని మాత్రం ఈ సినిమా ఇచ్చేలా లేదు. ఈ చిత్రాన్ని తెలుగులోకి ఇదే పేరుతో అనువాదం చేస్తున్నారు. సంక్రాంతికి తమిళంలో విడుదలైన మిగతా రెండు పెద్ద సినిమాలకు ‘స్కెచ్’తో పోలిస్తే మెరుగైన టాక్ తెచ్చుకున్నాయి. సూర్య సినిమా ‘తానా సేంద కూట్టం’ అన్నిటికంటే పెద్ద హిట్టయ్యేలా ఉంది. దీనికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ప్రభుదేవా-హన్సిక జంటగా నటించిన ‘గుళేబకావలి’ కూడా బాగుందనే అంటున్నారు.