Begin typing your search above and press return to search.

కోలీవుడ్ హీరోల్ని చూసైనా మన హీరోలు రియాక్ట్ కారా?

By:  Tupaki Desk   |   19 Sep 2019 7:32 AM GMT
కోలీవుడ్ హీరోల్ని చూసైనా మన హీరోలు రియాక్ట్ కారా?
X
సామాజిక అంశాల మీద స్పందించే లక్షణం కోలీవుడ్ హీరోలకు ఎక్కువే. చెన్నై మహానగరం వరదలో మునిగిన వేళ.. టాప్ హీరోలు సామాన్యుల మాదిరి సామాన్లు మోయటం.. కష్టంలో ఉన్న వారిని ఆదుకునేందుకు రిస్క్ తీసుకోవటానికైనా సిద్ధం కావటం తెలిసిందే. ఇటీవల చెన్నైలోని చోటు చేసుకున్న ఒక విషాద ఉదంతం మద్రాస్ హైకోర్టును స్పందించేలా చేయటమే కాదు..కోలీవుడ్ హీరోలు పెద్ద ఎత్తున గళం విప్పేలా చేసింది.

పళ్లికరనై సమీపంలో టూవీలర్ మీద వెళుతున్న శుభశ్రీ అనే మహిళపై బ్యానర్ పడింది. ఆమె కింద పడిపోగా.. అంతలోనే వాటర్ ట్యాంకర్ ఆమె మీద దూసుకుపోవటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అధికార పార్టీకి చెందిన నేత కోసం ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఉదంతంపై కోలీవుడ్ అగ్రనటులు పెదవి విప్పటమే కాదు.. తమ అభిమానులకు బ్యానర్లు ఏర్పాటు చేయొద్దని.. కటౌట్లు పెట్టొద్దని విన్నవించుకోవటం గమనార్హం. తమ సినిమా ప్రమోషన్లలోనూ.. తాము హోస్ట్ చేసే ప్రోగ్రామ్ లలోనూ..మీడియాతో మాట్లాడే సందర్బంలోనూ.. ప్రజలతో కనెక్ట్ అయ్యే ఏ అవకాశం లభించినా వారు వదలటం లేదు సరికదా.. బ్యానర్లు.. కటౌట్లు ఏర్పాటు చేయొద్దని విన్నవించుకుంటుననారు.

తమిళ సూపర్ స్టార్స్ కమల్ హాసన్.. సూర్య.. విజయ్ తాజాగా తమ అభిమానులకు ఈ సందేశాన్ని ఇవ్వటం గమనార్హం. తన కటౌట్లు ఏర్పాటు చేయొద్దని తన ఫ్యాన్స్ ను కోరినట్లు సూర్య వెల్లడించారు. ఈసారి గట్టిగా చెబుతున్నానని.. ఈ తరహా వేడుకల్ని నిషేధించాలన్నారు. తనను అభిమానించి.. ప్రేమించే విధానాన్ని తెలియజేసే విధానం ఇది కాదని.. కావాలంటే పేద విద్యార్థులకు సాయం చేయాలని.. రక్తదానం చేయాలని.. ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సూర్య తరహాలోనే కమల్.. విజయ్ లు కూడా రియాక్ట్ అవుతున్నారు. కటౌట్లు ఏర్పాటు చేయొద్దంటే చేయొద్దన్నట్లుగా వారు గట్టిగా చెబుతున్నారు. ఒక ప్రాణం పోవటానికి కారణమైన కటౌట్లు.. ఫ్లెక్సీల విషయంలో తమిళ స్టార్ నటులు ఇంతలా స్పందిస్తే.. తెలుగు హీరోలు ఎవరూ ఇలాంటి అంశాన్ని ప్రస్తావించకపోవటం గమనార్హం. సోషల్ ఇష్యూలు తెలుగు స్టార్లకు పట్టవా? అన్న క్వశ్చన్ పలువురిలో కలుగుతోంది.