Begin typing your search above and press return to search.

బాబును ముగ్గులోకి లాగి...ఆ బ్రాండ్ ని తొలగించి...!?

మొత్తానికి అభివృద్ధికి మారు పేరుగా ఉన్న బాబుని పప్పు బెల్లాల పందేరం వైపుగా నడిపించి ముగ్గులోకి లాగేశారా అన్న చర్చ నడుస్తోంది మరి.

By:  Tupaki Desk   |   28 April 2024 3:52 AM GMT
బాబును ముగ్గులోకి లాగి...ఆ బ్రాండ్ ని తొలగించి...!?
X

అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ని తాను అని టీడీపీ అధినేత చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో వాస్తవం కూడా ఉంది. ఆయన సంస్కరణల పిపాసి. అభివృద్ధి వైపు చూస్తారు భవిష్యత్తు దార్శనీకుడు అని పేరు. నిజంగా చెప్పాలి అంటే చంద్రబాబుని అంతా ఇష్తపడింది ఆ కోణం చూసే.

ఆయన 1995 నుంచి 2004 వరకూ పాలించినదే ఆయన అసలైన పాలన అనేవారూ ఉన్నారు. అలాగే ఆయన నమ్మిన దానిని ఆచరించి చూపించినది కూడా అపుడే. ఉచితాలు సంక్షేమం అంటే బాబు వ్యతిరేకంగా ఉండేవారు. నిజానికి అదే కరెక్ట్ కూడా అని మేధావులూ బాబుని వెనకేసుకుని వచ్చేవారు. కానీ చిత్రంగా అప్పట్లో వైఎస్సార్ సంక్షేమ అజెండాను నెత్తికెత్తున్నారు.

కాంగ్రెస్ సారధిగా ఆయన రైతులకు ఉచిత విద్యుత్ అన్నారు. అలా మొదలైన సంక్షేమ ధార ఒక గంగా ప్రవాహం మాదిరి అయింది. గెలుపునకు అదే తారక మంత్రం అయింది. దాంతో చంద్రబాబు కూడా అదే బెటర్ అనుకున్నారు ఆ రూట్లో నడచారు. కానీ వైఎస్సార్ ఉండగా ఆయనకు గెలుపు దక్కలేదు. 2014లో విభజన ఏపీలో మాత్రం ఆయన సంక్షేమ పధకాలను హామీలను కుమ్మరించి అధికారం దక్కించుకున్నారు.

అయితే వాటి అమలు చాలా కష్టం అని బాబుకు తెలుసు. అందుకే ఆయన చేయగలిగనంత చేశారు. చాలా చేయలేకపోయారు. ఆయన కూడా అప్పులు చేసినా అవి తెచ్చి సంక్షేమానికి పెట్టడం మీద వ్యతిరేకంగా ఉండేవారు. 2019 నాటికి జగన్ సంక్షేమ పధకాలతో జనంలోకి వచ్చారు. వాటిని జనం నమ్మారు. ఆయనకు ఓటేశారు. ఏకంగా 151 సీట్లు జగన్ కి దక్కాయి.

ఇక 2024 ఎన్నికలకు అదే షార్ట్ కట్ అనుకుని చంద్రబాబు అభివృద్ధి బ్రాండ్ ని పక్కన పెట్టేసి సూపర్ సిక్స్ అంటూ సంక్షేమ సునామీకే తెర తీశారు. అదీ ఇదీ కాదు ఆల్ ఫ్రీ అన్న తీరులో బాబు సంక్షేమ హామీలు సాగుతున్నాయి. ఈ మొత్తం రొదలో హామీల వరదలో బాబు మార్క్ అయిన అభివృద్ధి కొట్టుకుని పోయింది.

దీంతో ఏపీలో తటస్థులు అంతా నివ్వెరపోయి చూస్తున్నారు. మూడేళ్ల పాటు బాబును సమర్ధించిన వారు అలా చూస్తూండిపోతున్నారు. ఎందుకంటే ఉచితాలతో పప్పు బెల్లాలతో ఏపీ శ్రీలంక అవుతుందని బాబు అంటే ఆనాడు ఆయనకు విశేషంగా ఆదరణ లభించింది.

అయితే మళ్ళీ ఏమైందో ఏమో సంక్షేమానికే ఓట్లు రాలుతాయని భావించి బాబు యూ టర్న్ తీసుకున్నారు. పధకాలకు వ్యతిరేకం కాదని చెప్పుకున్నారు. కానీ జగన్ కిటికీలు తెరిస్తే బాబు ఏకంగా తలుపులు తీసి మరీ ఉచితాల జాతర అంటున్నారు.

ఇది ఇపుడు బాబుని జనంలో కొత్తగా చూపిస్తోంది. ఇది ఆయనది కాని చెప్పు. అందులో బాబు కాలు పెడితే ఎలా ఉంటుంది. పైగా బాబు ఎన్ని చెప్పినా అమలు చేయరు అన్నది జనంలోకి ఎపుడో వెళ్ళిపోయింది. ఇలా వ్రతం చెడి ఫలం దక్కకపోతే రెండింటా రేవడి అయ్యేనా టీడీపీ అన్న చర్చ సాగుతోంది.

జగన్ విషయం తీసుకుంటే బాబు సంక్షేమం వెంట పరుగులు తీస్తూంటే ఎక్కడ ఆగాలో తెలిసి ఠక్కున ఆగిపోయారు. అంతే కాదు తాను ఉచితాల పేరిట చేసినది అంతా అర్హులకు ఆపన్నులకే తప్ప దండుగమారులుగా సోమరిపోతులుగా ఎవరినీ చేయడానికి కాదు అని ఒక సందేశం ఇచ్చినట్లుగా ఆయన తాజా ఎన్నికల మేనిఫెస్టో ఉంది అని అంటున్నారు.

అదే సమయంలో తాను ఇచ్చే సంక్షేమం ఇంతే ఇక మీదట అభివృద్ధి అంటూ జగన్ హామీ ఇస్తున్నట్లుగా ఆయన ఎన్నికల ప్రణాళిక ఉంది. అందుకే మరో పదిహేనేళ్ళు వైసీపీకి అధికారం ఇస్తే ఏపీని అన్ని రంగాలలో పరుగులు తీయిస్తామని కూడా ఆయన అంటున్నారు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. అంటే మెల్లగా బాబు పాత్రలోకి వెళ్లడానికి జగన్ చూస్తున్నారు.

ఇది ఏపీలో తటస్థులుగా ఉన్న ఓటర్లను కచ్చితంగా అట్రాక్ట్ చేయడానికే అని అంటున్నారు. వారి మద్దతే ఇపుడు కీలకం వారు ఎటు మొగ్గితే అటే విజయం. అధికారం ఇస్తే సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తారు అనుకుంటే వారు ఆ పార్టీ వైపు అసలు వెళ్ళరు, మొగ్గరు. వైసీపీ ఇప్పటికే అమలు చేస్తున్న పధకాలతోనే ఎన్నికలకు వెళ్తోంది కాబట్టి తన వైపునకు వారిని తిప్పుకుంటే మాత్రం మరోసారి విజయం ఖాయం అని అంచనా వేస్తున్నారు. మొత్తానికి అభివృద్ధికి మారు పేరుగా ఉన్న బాబుని పప్పు బెల్లాల పందేరం వైపుగా నడిపించి ముగ్గులోకి లాగేశారా అన్న చర్చ నడుస్తోంది మరి.