Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రా నీదా నాదా?

ఉత్తరాంధ్రా మీద వైసీపీ టీడీపీ కన్నేశాయి. ఈ రెండు పార్టీల అధినేతలూ ఒకే సమయంలో ఉత్తరాంధ్రాలో పర్యటనలు చేపట్టారు

By:  Tupaki Desk   |   24 April 2024 5:30 PM GMT
ఉత్తరాంధ్రా నీదా నాదా?
X

ఉత్తరాంధ్రా మీద వైసీపీ టీడీపీ కన్నేశాయి. ఈ రెండు పార్టీల అధినేతలూ ఒకే సమయంలో ఉత్తరాంధ్రాలో పర్యటనలు చేపట్టారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ అయితే ఈ నెల 20 నుంచి 24 దాకా విడిది చేసి మరీ ఉత్తరాంధ్రాలో మేమంతా సిద్ధం పేరుతో మూడు భారీ సభలను నిర్వహించారు. రోడ్ షోలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అయిదు రోజుల పాటు జగన్ ఉత్తరాంధ్రాలో మకాం వేశారు.

ఆయన ఉత్తరాంధ్రా పార్టీలో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేశారు. వీక్ గా ఉన్న చోట నేతలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీలో కొత్త వారిని చేర్చుకున్నారు. ఉత్తరాంధ్రాలో వైసీపీ చేసిన అభివృద్ధిని సభలలో జనాలకు చెప్పారు. విశాఖ నుంచే పాలిస్తామని కూడా చెప్పారు.

ఇక చంద్రబాబు అయితే 22 నుంచి ఉత్తరాంధ్రాలో మకాం వేశారు. ఆయన తమ పార్టీలో చెలరేగిన అసంతృప్తులను దారికి తెచ్చే పనిలో బిజీగా గడిపారు. అదే విధంగా వైసీపీకి బలంగా ఉన్న చోట ఆ పార్టీ నేతలను సైకిలెక్కించే పనిలో కూడా తమ్ముళ్లు ఉన్నారు.బాబు చేత కండువాలు వేయించారు.

ఇక చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సభలను నిర్వహిస్తున్నారు. ఆయన ఉత్తరాంధ్రాలో దాదాపుగా ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ వెళ్లారు. ఉత్తరాంధ్రా అంటే బీసీలది బడుగులది, తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్రా అని చంద్రబాబు చెప్పారు.

ఉత్తరాంధ్రాలో ఈసారి మొత్తం 34కి 34 అసెంబ్లీ సీట్లను అయిదు ఎంపీ సీట్లను టీడీపీ కూటమి గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019లో పొరపాటున వైసీపీకి ఓటేసిన వారు కూడా ఈసారి టీడీపీకి ఓట్లు వేస్తారని వైసీపీకి డిపాజిట్లు వచ్చే సమస్యే లేదని ఆయన అంటున్నారు.

మరో వైపు జగన్ అయితే ఉత్తరాంధ్రాలో ఓటర్లు వైసీపీని ఆదరించాలని కోరుతూనే హామీలు ఎపుడూ నెరవేర్చకుండా కూటమి కట్టిన నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఉత్తరాంధ్రా వైసీపీకే మళ్ళీ పట్టం కడుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఉత్తరాంధ్రాలో ఉన్న 34 అసెంబ్లీ సీట్లు ఇపుడు రెండు పార్టీలకు కీలకంగా మారుతున్నాయి. ఉత్తరాంధ్రాలో మెజారిటీ సీట్లు తీసుకోవాలని చంద్రబాబు జగన్ ఇద్దరూ చూస్తున్నారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. విశాఖ నుంచే పాలన అని జగన్ హామీ ఇస్తున్నారు.

ఉత్తరాంధ్రాలో అభివృద్ధి అన్నది చేసింది మేమంటే మేము అని రెండు పార్టీల అధినేతలు గట్టిగా చెబుతున్నారు. ఉత్తరాంధ్రా అధికారానికి దగ్గర దారి కావడంతో ఇద్దరు నేతలూ ఇక్కడే ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. 2014లో టీడీపీకి 2019లో వైసీపీకి పట్టం కట్టిన ఉత్తరాంధ్రా ఈసారి ఎవరికి ఓటేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఉత్తరాంధ్రా ఈసారి రాజకీయాన్ని మలుపు తిప్పుతుందని అంటున్నారు.