Begin typing your search above and press return to search.

రాజకీయ కుంభమేళా... "సిద్ధం" సభ హైలెట్స్ ఇవే!

ఈ సభకు హాజరైన సుమారు 15 లక్షల భారీ జనసంద్రాన్ని చూసి దీన్ని "రాజకీయ కుంభమేళ"గా అభివర్ణిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

By:  Tupaki Desk   |   10 March 2024 2:23 PM GMT
రాజకీయ కుంభమేళా... సిద్ధం  సభ హైలెట్స్  ఇవే!
X

ఆకాశం బద్ధలైందా.. నేల ఈనిందా అన్నట్లుగా ఉంది ఇక్కడ జనసంద్రాన్ని చూస్తే అని మంతి అంబటి రాంబాబు అన్నారంటే అది అతిశయోక్తికాదేమో. కార్యకర్తల్లో కదనోత్సాహం నింపడానికి అన్నట్లుగా వైసీపీ ఏర్పాటుచేస్తున్న "సిద్ధం" సభలకు జనం భారీ ఎత్తున తరలి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... చివరి "సిద్ధం" సభ తాజాగా అద్ధంకి నియోజకవర్గంలో జరిగింది. ఈ సభకు హాజరైన సుమారు 15 లక్షల భారీ జనసంద్రాన్ని చూసి దీన్ని "రాజకీయ కుంభమేళ"గా అభివర్ణిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.


అవును... వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ "సిద్ధం" సభల పేరిట కార్యకర్తల్లో కదనోత్సాహం నింపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడుల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలు విజయవంతం అవ్వగా... ఈ సభల్లో జగన్ సరికొత్త ప్రసంగాలతో తనపాలనలో జరిగిన మంచిని సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన సభలో... తనకు, తన పరిపాలనకు... చంద్రబాబు పాలనకు తేడాను సవివరంగా వివరించారు.


మేదరమెట్ల వద్ద కోల్ కత - చెన్నై నేషనల్ హైవే పక్కనే ఉన్న సుమారు 338 ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించారు. ఈ సభకు దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలల్లోని సుమారు 54 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు తరలి వచ్చాయి. ఈ సందర్భంగా కార్యకర్తలను, అభిమానులను, వైసీపీ శ్రేణులను, యావత్ ప్రజానికాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.


జగన్ ప్రసంగంలో హైలెట్స్..!:

తాజాగా జరిగిన సిద్ధం సభలో "వై" షేపులో ఉన్న ర్యాంపుపై ప్రజలకు అభివాదం చేసిన అనంతరం మైకందుకున్న జగన్... బిందువు బిందువు కలిస్తే సిందువు అయినట్లుగా ఇక్కడ భారీగా జనసందోహం తరలివచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిగా... జనాలకు మంచి జరగడాన్ని అడ్డుకోవడానికి వస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో స్టార్ క్యాంపెయినర్లు, స్టార్లు, అబద్ధాలకు రంగులు అద్దే ఎల్లో మీడియా తనకు లేదని.. ప్రజలు మాత్రమే తనకున్న బలమని నొక్కి చెప్పారు.


ఈ సందర్భంగా ప్రజలను గెలిపించాలని తాను తాపత్రయపడుతుంటే... పెత్తందార్లంతా ఏకమై మీ బిడ్డ జగన్ ను ఓడించాలని పరితపిస్తున్నారని.. అందుకోసం కుట్రలు, కుతంత్రాలతో వస్తున్నారని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... విశ్వసనీయతకు వంచనకూ మధ్యజరుగుతున్న యుద్ధం ఇది అని జగన్ ఉద్ఘాటించారు. ఈ యుద్ధంలో వైసీపీ శ్రేణులంతా పోరాడటానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు.

ఈ క్రమంలో ప్రధానంగా చంద్రబాబుకు తనకు ఉన్న తేడాని గమనించమని కోరిన జగన్.. అందుకు అవసరమైన చాలా ఉదాహరణలు తెరపైకి తెచ్చారు. గతంలో పవన్ కల్యాణ్, మోడీ ఫోటోలతో పాటు తన ఫోటోను ముద్రించి జనాలకు ఇచ్చిన హామీలకు సంబందించిన కరపత్రాన్ని సంతకం చేసి మరీ ఇంటింటికీ చంద్రబాబు పంపారని గుర్తు చేశారు. ఇదే సమయంలో నాడు ఈ ముగ్గురూ కలిసి ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నేరెవేరిందా అని జగన్ ప్రజలను ప్రశ్నించారు. జనం... లేదంటూ ఈ సమయంలో చేతులు ఊపరు!

కరోనా వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించినందుకే, ఎన్ని కష్టాలు వచ్చినా అవి అందిస్తున్నందుకే ప్రజలు ఆశీర్వదించడంతోనే మన ఫ్యాన్ కు పవర్ వస్తోందని చెప్పిన జగన్... చంద్రబాబు సైకిల్ కు ట్యూబు లేదు, చక్రాలు లేవు, ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కడానికి ఆయనకు ఇతరుల అవసరం ఉంది అని అన్నారు. అందుకోసమే ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నారని అన్నారు.

ఆ ప్యాకేజీ స్టారు సైకిల్ సీటు అడగడు.. తక్కువ సీట్లు ఎందుకు ఇస్తున్నాడనీ అడగడు.. అవసరమైతే తన టీగ్లాసు బాబుకి ఇచ్చేస్తాడు.. చంద్రబాబు సైకిల్ దిగమంటే దిగుతాడు.. తొయ్యమంటే తోస్తాడు.. సిట్ అంటే కూర్చుంటాడు.. స్టాండ్ అనగానే నిల్చుంటాడు అని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఏపీలో సైకిల్ చక్రం తిరగడం లేదని ఢిల్లీ వెళ్లి మోకరిల్లారని అన్నారు. జగన్ పాలనలో ప్రజలకు మంచి జరుగుతుందనే భయంతోనే పొత్తుల కోసం నానా అగచాట్లు పడుతున్నాడని అన్నారు.

ఇదే సమయంలో మన నేతలంతా మన పాలనలో జరిగిన అభివృద్ధి గురించి చెబుతూ గడపగడపకూ వెళ్తుంటే... చంద్రబాబు మాత్రం మీడియా సంస్థల గడపలూ, ఢిల్లీలోని నేతల గడపలూ ఎక్కుతున్నాడని అన్నారు. మన పాలనలో జరిగిన మంచిని ప్రతీ కార్యకర్త, ప్రతీ వాలంటీరు, ప్రతీ ఒక్కారూ ఇంటింటికీ వెళ్లి మీ బిడ్డ పాలనలో జరిగిన మంచిని వివరించాలని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే... ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పాలని కోరారు.

ఇదే సమయంలో నరక లోకానికీ నారా లోకానికీ ఎవరూ రారు కాబట్టి.. ఎంట్రన్స్ లో రకరకాల పథకాలతో స్వర్గం చూపిస్తారని, అలాంటి మార్కెంటింగ్ టెక్నిక్ చంద్రబాబుకు అలవాటని.. మరోసారి మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారని జగన్ అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోకు, శకుని పాచికలకూ తేడాలేదని.. పక్క రాష్ట్రాల్లోని ఇతర పార్టీలు ఇచ్చిన హామీలతో కిచిడీ వాగ్ధానాలు తెస్తున్నారని జగన్ నిప్పులు కక్కారు.