Begin typing your search above and press return to search.

వారసుల భవిష్యత్‌ పై ఈ ముగ్గురు నేతల ఆందోళన!

సీఎం వైఎస్‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే వారి తరఫున కూడా నేతలు బరిలోకి దిగుతారని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 12:30 AM GMT
వారసుల భవిష్యత్‌ పై ఈ ముగ్గురు నేతల ఆందోళన!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో కొంతమంది నేతలు తమకు బదులుగా తమ వారసులను బరిలోకి దించుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు.. పేర్ని నాని, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తమకు బదులుగా ఈసారి తమ కుమారులను ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారు. ఇదే కోవలో మరికొంతమంది నేతలు ఉన్నారని అంటున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే వారి తరఫున కూడా నేతలు బరిలోకి దిగుతారని చెబుతున్నారు.

కేవలం వైసీపీ తరఫునే కాకుండా టీడీపీ తరఫున కూడా కొందరు నేతలు తమకు బదులుగా తమ వారసులను బరిలోకి దించాలని చూస్తున్నట్టు టాక్‌ నడుస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు టీడీపీ నేతలు తమ వారసులకు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి పలుమార్లు అసెంబ్లీకి ఎంపికయ్యారు. ఈసారి ఆయన తనకు నర్సీపట్నం అసెంబ్లీ సీటును, తన కుమారుడు చింతకాయల విజయ్‌ కు అనకాపల్లి ఎంపీ సీటును కోరుతున్నారు. ప్రస్తుతం విజయ్‌ ఐటీడీపీ బాధ్యతల్లో క్రియాశీలకంగా ఉన్నారు.

అలాగే బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నుంచి 2014లో టీడీపీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన కూడా తన కుమారుడు అప్పలనాయుడుకు సీటును ఆశిస్తున్నారు. విశాఖ జిల్లాలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి బండారు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే బండారు అప్పలనాయుడు పెందుర్తిలో చురుగ్గా పర్యటిస్తున్నారు.

విశాఖలో మరో ముఖ్య నేత గంటా శ్రీనివాసరావు. 1999 నుంచి ఇప్పటివరకు ఓటమి ఎరుగని ధీరుడిగా గంటా చరిత్ర సృష్టించారు. ప్రతి ఎన్నికల్లోనూ నియోజకవర్గం మార్చి గెలుపొందుతూ రికార్డులు సృష్టించారు. గంటా కూడా తన కుమారుడు రవితేజను రాజకీయాల్లో ఆరంగేట్రం చేయించాలని చూస్తున్నారు. గతంలో రవితేజ సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హీరోగా ఒక సినిమా కూడా వచ్చింది. అయితే పరాజయం పాలైంది. దీంతో రవితేజ సినిమాల నుంచి తప్పుకున్నారు. తన తండ్రిలాగా రాజకీయాల్లో తన భవిష్యత్‌ ను వెతుక్కుంటున్నారు.

ఈ నేపథ్యంలో విశాఖ నగర పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి తనకు, చోడవరం నుంచి తన కుమారుడు రవితేజకు టికెట్‌ ఇవ్వాలని గంటా శ్రీనివాసరావు కోరుతున్నట్టు తెలుస్తోంది. తన వియ్యంకుడు, మాజీమంత్రి నారాయణ ద్వారా చంద్రబాబుపై గంటా ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. నారాయణకు రవితేజ స్వయానా అల్లుడు కావడం విశేషం. రవితేజ ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా తిరుగుతున్నారు. ఇప్పుడు గంటా కోరుతున్న చోడవరంలో గతంలో ఆయన గెలుపొందారు.

అయితే బండారు సత్యనారాయణమూర్తి తన కుమారుడు అప్పలనాయుడుకు కోరుతున్న పెందుర్తి సీటును జనసేన కూడా ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో బండారుకు ఈసారి సీటు కష్టమేనని అంటున్నారు.

అలాగే అనకాపల్లి ఎంపీ స్థానాన్ని జనసేన కోరుతోందని తెలుస్తోంది. ఇక్కడ నుంచి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌ కు కూడా సీటు కష్టమేనంటున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు కుమారుడి భవితవ్యం ఏమిటనేది తేలాల్సి ఉంది.