Begin typing your search above and press return to search.

బొబ్బిలి టీడీపీ జాతకం మార్చేది వారేనా ?

ఇపుడు 2024లో పరిస్థితి అనుకూలంగా ఉంది అని చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీ కళ్ళుమూసుకుని గెలిచే సీటు బొబ్బిలి అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 April 2024 3:43 AM GMT
బొబ్బిలి టీడీపీ జాతకం మార్చేది వారేనా ?
X

తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలసి రాని అసెంబ్లీ నియోజకవర్గాలలో బొబ్బిలి ఒకటి. ఈ సీటు ఎప్పుడూ కాంగ్రెస్ కే జై కొడుతూ వచ్చింది. గత రెండు ఎన్నికల నుంచి వైసీపీ పరం అవుతోంది. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టాక తొలి ఎన్నికల్లో పసుపు జెండా బొబ్బిలి కోట పైన ఎగిరింది. అలాగే 1985లో రెండవసారి కూడా టీడీపీ విజయం సాధించింది. 1989లో ఓటమి పాలు అయిన టీడీపీ 1994లో మరోసారి గెలిచింది.

ఇక అక్కడ నుంచి నేటి వరకూ అంటే దాదాపు మూడు దశాబ్దాలుగా గెలిచినది లేదు. ఈ మధ్యలో అయిదు ఎన్నికలు వరసగా జరిగాయి. అందులో మూడు సార్లు కాంగ్రెస్ గెలిస్తే రెండు సార్లు వైసీపీ గెలిచింది. అలా బొబ్బిలి సీటు కాంగ్రెస్ కి ఆ తరువాత వైసీపీకి కంచుకోటగా మారింది.

బొబ్బిలిలో బీసీ వెలమలు ఓసీ వెలమలు ఉన్నారు. ఓసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన బొబ్బిలి రాజులు కాంగ్రెస్ లో వైసీపీలో ఉన్నపుడు గెలిచారు. వారు టీడీపీలోకి వెళ్తే 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఇపుడు 2024లో పరిస్థితి అనుకూలంగా ఉంది అని చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో టీడీపీ కళ్ళుమూసుకుని గెలిచే సీటు బొబ్బిలి అని అంటున్నారు.

అయితే వైసీపీ బీసీ ఓట్ల మీద గురి పెట్టింది. రాజులకు బీసీలకు పోటీ అంటోంది. బొబ్బిలిలో అత్యధిక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు మరోసారి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక జగన్ ఉత్తరాంధ్ర పర్యటన నేపధ్యంలో బొబ్బిలి నుంచి కాంగ్రెస్ తరఫున రెండు సార్లు గెలిచి బీజేపీలో ఉన్న సీనియర్ నేత పెద్దింటి జగన్మోహన్ రావు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

దాంతో తమ బలం పెరిగింది అని వైసీపీ భావిస్తోంది. రాజులను గెలిపిస్తే కోటకే పరిమితం శంబంగిని గెలిపిస్తే జనంలో ఉంటారు అని వైసీపీ ప్రచారం చేస్తోంది. అయితే గతసారి మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావుకు టికెట్ ఇచ్చిన టీడీపీ ఈసారి ఆయన తమ్ముడు బేబీ నాయనకు టికెట్ ఇచ్చింది. బేబీ నాయన గత అయిదేళ్ల పాటు బొబ్బిలిని అట్టిపెట్టుకొని పనిచేస్తూ వస్తున్నారు.

ఆయన మునిసిపల్ ఎన్నికల్లో కూడా గట్టిగా పోరాడారు. అత్యధిక స్థానాలు టీడీపీకి రప్పించారు. గత ఏడాదిగా బొబ్బిలిలో సైకిల్ పరుగులు తీస్తోంది. దీంతో ఈసారి బొబ్బిలిలో టీడీపీ విజయం ఖాయమని బొబ్బిలి రాజులు అంటున్నారు. మూడు దశాబ్దాలుగా అయిదు ఎన్నికల్లో ఓటమి పాలు అయిన టీడీపీ జాతకం మారితే మాత్రం ఆ క్రెడిట్ పూర్తిగా బొబ్బిలి రాజులకు దక్కుతుంది అని అంటున్నారు. మరి టీడీపీకి ఇప్పటిదాక మూడు సార్లు విజయాలు అందించి ఆ పార్టీ ద్వారా తాను ఎమ్మెల్యే అయిన శంబంగి వైసీపీలో ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి కూడా వరసగా గెలుస్తాను అని సవాల్ చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.