Begin typing your search above and press return to search.

వియ్యంకులు ఇద్దరూ ఒక్కటి అయ్యారు...ఆయన పరిస్థితి...!?

చంద్రబాబు తనకు రాజకీయ భరోసా ఇచ్చారు అని చెబుతూ క్యాడర్ ని సహనంతో ఉండమని హిత బోధ చేశారు.

By:  Tupaki Desk   |   1 March 2024 4:06 AM GMT
వియ్యంకులు ఇద్దరూ ఒక్కటి అయ్యారు...ఆయన పరిస్థితి...!?
X

అనకాపల్లి అసెంబ్లీలో టీడీపీ జనసేనల మధ్యన సంఘర్షణ జరుగుతుందని అది కొత్త రూపు తీసుకుంటుందని అంతా ఊహించారు. అయితే టికెట్ కోసం ఎంతో ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చంద్రబాబుని కలసిన తరువాత మెత్తబడ్డారు. చంద్రబాబు తనకు రాజకీయ భరోసా ఇచ్చారు అని చెబుతూ క్యాడర్ ని సహనంతో ఉండమని హిత బోధ చేశారు.

ఏపీకి చంద్రబాబు సీఎం కావడమే మన లక్ష్యమని చెబుతూ తాను పార్టీ మారుతున్న వార్తలను ఖండించారు. తన ప్రాణం ఉన్నంతవరకూ టీడీపీలోనే ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు. అలాగే తన తండ్రి కాలం నుంచి కూడా తాము టీడీపీ జెండా మోస్టామని గుర్తు చేశారు.

ఇక జనసేన అభ్యర్ధిగా ఉన్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పీలాకు వియ్యంకుడు అవుతారు. ఈ ఇద్దరూ ఇపుడు ఒక్కటి అయ్యారు అని అంటున్నారు. కొణతాల విజయానికి పీలా కృషి చేస్తారని అంటున్నారు. అయితే ఈ ఇద్దరూ ఒక్కటి కావడం వల్ల జనసేనలో ఇటు టీడీపీలో మరి కొంతమంది నేతల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు.

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అయిదేళ్ల పాటు వైసీపీలో ఉండి ఇటీవలే టీడీపీలో చేరారు. ఆయన తన కుమారుడు దాడి రత్నాకర్ కి అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించి పార్టీలో చేరారు. ఒకవేళ అది దక్కకపోయినా ఎంపీ టికెట్ అయినా ఇస్తారనుకుని పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

అనూహ్యంగా నాగబాబు ఎంపీ అభ్యర్ధి కావడంతో ఆ సీటు ఖాళీ లేదు. ఇక ఎమ్మెల్యేగా అయినా చాన్స్ ఉంటుందని అనుకుంటే అక్కడ దాడి చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కొణతాల ఎమ్మెల్యే అభ్యర్ధి అయిపోయారు దీంతో దాడి వర్గం పరిస్థితి కక్కా లేక మింగలేక అన్నట్లుగా తయారైంది అని అంటున్నారు. ఎన్నికల ముందు పార్టీ మారినా రాజకీయ జాతకం మాత్రం మారలేదు అని వాపోతున్నారు.

ఈ నేపధ్యంలో పీలా వైసీపీ వైపు వెళ్తారు అని ప్రచారం జరిగింది. అదే జరిగి ఉంటే అనకాపల్లి టీడీపీలో దాడికి అత్యధిక ప్రాధాన్యత టీడీపీ నుంచి దక్కేది. కానీ పీలా తాను సైకిల్ దిగను అని స్పష్టం చేయడంతో పాటు వియ్యంకుడి విజయానికి ఆయన కంకణం కట్టుకోవడంతో కొణతాల పీలా హవా మరోసారి అనకాపల్లి రాజకీయాల్లో సాగుతోంది అని అర్ధం అయింది.

ఈ మొత్తం పరిణామాల వల్ల దాడి వర్గమే ఇబ్బంది పడుతోంది అని అంటున్నారు. పార్టీ మారినా ఫలితం దక్కలేదని అంటున్నారు. ఇక జనసేనలో ఉన్న అనకాపల్లి ఇంచార్జి పరుచూరి భాస్కరరావుకు ఆ పార్టీ నుంచి హామీ లభించింది అని అంటున్నారు. టీడీపీలో హామీలు దక్కాలంటే పార్టీలో పీలా తరువాత మరో కీలక నేతగా మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ మరోసారి ఇస్తారని అంటున్నారు. సో ఇపుడు దాడి ఫ్యామిలీకి వీరందరి తరువాత హామీ లభిస్తుందా లేక పార్టీలో అలాగే ఉంటారా అన్నది చూడాలని అంటున్నారు.