Begin typing your search above and press return to search.

ఏపీలో మోడీ సుడిగాలి పర్యటనలే !

అయితే మోడీ సభ ఒకటి ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో ఉంటుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   24 April 2024 5:33 PM GMT
ఏపీలో మోడీ సుడిగాలి పర్యటనలే !
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వచ్చే డేట్ టైం ఫిక్స్ అయింది. అయితే ఆయన పర్యటనలో ఎన్ని సభలలో ప్రసంగిస్తారు అన్నది మాత్రం తెలియలేదు. నరేంద్ర మోడీ తెలంగాణా టూర్ ఇప్పటికే కన్ ఫర్మ్ అయింది. ఆయన ఏప్రిల్ 30న వస్తున్నారు. అలాగే మే 3, 4 తేదీలలో పర్యటిస్తున్నారు. ఆ తేదీల మధ్యలో ఒకసారి ఏపీకి మోడీ వస్తారని ఆయన టూర్ ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో నరేంద్ర మోడీ ఒక రోజు పర్యటన ఉంటుందా లేక ఒకటి రెండు సభలతో ముగుస్తుందా అంటే ఇంకా క్లారిటీ లేదు. అయితే మోడీ సభ ఒకటి ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో ఉంటుందని తెలుస్తోంది.

అన్నీ కుదిరితే నరేంద్ర మోడీ మే మొదటి వారంలో అనకాపల్లికి వస్తారు అని అంటున్నారు. అంటే ఆయన 3, 4 తేదీలలో తెలంగాణా పర్యటన తరువాత కొంత విరామం తీసుకుని ఏపీకి వస్తారు అన్న మాట. అలా అయితే ఏపీకి ప్రత్యేక డేట్లు ఏవీ ఆయన ఇచ్చినట్లుగా లేదు అనుకోవాలి.

మరో వైపు చూస్తే మే 7 తరువాత ఒక రోజు పాటు మోడీ ఏపీ పర్యటన ఉండవచ్చు అని అంటున్నారు. మోడీ తమ పార్టీ పోటీ చేస్తున్న పార్లమెంట్ సీట్లలో ఆయా అభ్యర్ధులకు ప్రచారం చేసి వెళ్తారు అని అంటున్నారు. తిరుపతి, నర్సాపురం, అనకాపల్లిలలో మోడీ సభలు ఉండవచ్చు అన్నది ఇప్పటికి అందుతున్న సమాచారం.

మోడీ సభలు కనుక కన్ ఫర్మ్ అయితే టీడీపీ కూటమి ప్రచారానికి హైప్ వచ్చినట్లే అని అంటున్నారు. దేశాన్ని ఏలే ప్రధాని హోదాలో ఆయన ఇచ్చే మాట చెప్పే విషయం అలాగే వదిలే హామీలూ జనాలలో చర్చకు వస్తాయని భావిస్తున్నారు.

అయితే మోడీ అనకాపల్లి సభకు వస్తే కచ్చితంగా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడాలని ఉక్కు కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోడీ విశాఖకు గతంలోనే రావాలని అనుకున్నారు. కానీ అది వాయిదా పడింది. ఇపుడు ఎన్నికల వేళ ఆయన ఏకంగా అనకాపల్లికి వస్తున్నారు అనకాపల్లిలోనూ ఉక్కు కార్మికుల ప్రభావం ఉంది. దాంతో మోడీ ఈ సభలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కీలక ప్రకటన చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.

ఆ విధంగా మోడీ చేత ప్రకటన చేయించే బాధ్యత కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు తీసుకోవాలని కోరుతున్నారు. మొత్తానికి మోడీ సభలు ఇతర చోట్ల జరిగితే విభజన హామీల ప్రస్తావన వస్తుంది. అదే విశాఖలో జరిగితే స్టీల్ ప్లాంట్ సమస్యని తప్పకుండా లేవనెత్తాలని కోరుతున్నారు. దాంతో ఆయన పెట్టే సభల వల్ల కూటమికి ఎంత వరకూ మైలేజ్ వస్తుంది అన్న చర్చ సాగుతోంది.