Begin typing your search above and press return to search.

"పొరబాటు జరిగితే నా శవం చూడాల్సి వస్తుంది"... టీడీపీ నేత వ్యాఖ్యలు!

ఎన్నికల్లొ తాను గెలవకుండా పొరపాటు జరిగితే తన శవం చూడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు!

By:  Tupaki Desk   |   1 April 2024 5:59 AM GMT
పొరబాటు జరిగితే నా శవం చూడాల్సి వస్తుంది... టీడీపీ నేత వ్యాఖ్యలు!
X

రోజు రోజుకీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొనే నేతల వైఖరి పూర్తిగా మారిపోతుందనే కామెంట్లు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తనకు ఓటు వేస్తే ఫలితాలొచ్చాక విజయయాత్ర చేద్దాం... లేకపోతే తమ శవయాత్ర చూద్దురుగాని అనే తరహా బ్లాక్ మెయిల్ రాజకీయాలు పెరిగిపోతున్నాయి! ఈ క్రమంలో తాజాగా టీడీపీ నేత కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. ఎన్నికల్లొ తాను గెలవకుండా పొరపాటు జరిగితే తన శవం చూడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజాకీయల్లో రకరకాల చిత్ర విచిత్రాలు తెరపైకి వస్తున్నాయి. ఎలక్షన్ స్టంట్స్ లో భాగంగా కొంతమంది నేతలు చెబుతున్న కబుర్లు, చేస్తోన్న పనులు మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా... టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి! తనకు ఓటు వేసి గెలిపించకపోతే తన శవాన్ని చూస్తారన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు, పరోక్ష హెచ్చరికలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార వాహనంపై స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు! ఈ సందర్భంగా మైకందుకున్న నారాయణ రెడ్డి... ఇవే తనకు చివరి ఎన్నికలు అని, తనను నమ్మి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారని, గెలిచి ప్రజాసేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని, ఏదైనా పొరపాటు జరిగితే తన శవం చూస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కందుల నారాయణ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు.. పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే చేయడం గమనార్హం. మరోపక్క నారాయణరెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి ఫిర్యాదులు చేసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఈ తరహా బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కి పాల్పడేవారిపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

కందుల నారాయణ రెడ్డి ఏమి అన్నారనేది ఆయన మాటల్లో వింటే... "ఒకే ఒక్క అవకాశం, చివరి అవకాశం కల్పించి.. మనప్రజలకు న్యాయం జరిగేదానికి చూసుకునే అవకాశం కల్పించమని నేను కోరుకుంటున్నా. ఆ భగవంతుడు ఇచ్చిన ఈ పునర్జన్మను సార్ధకం చేసుకునే విధంగా చేయమని చెప్పి ప్రతీ ఒక్కరినీ కోరుకుంటూ ఉన్నా."

"ఏమాత్రం పొరపాటు జరిగితే.. తిరిగి నా శవాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తది.. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ మనవి చేసుకుంటున్నా" అని కందుల నారాయణ రెడ్డి అన్నారు!

కాగా... గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరి రోజు ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ బీఆరెస్స్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గెలిస్తే విజయ యాత్ర, ఓడితే శవయాత్ర అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నాడు తీవ్ర సంచలనంగా మారాయి. అయితే ఆ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి 16వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు!

అయితే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో.. నాడు కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తరహాలోనే నేడు టీడీపీ అభ్యర్థి నారాయణరెడ్డి కూడా వ్యాఖ్యానించారు. దీంతో... ఈ తరహా వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. మరోపక్క గెలుపు మీద నమ్మకం లేనప్పుడే ఇలాంటి మాటలు వస్తుంటాయంటూ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై ఈసీ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి!