Begin typing your search above and press return to search.

ఏపీలో కీల‌క నేత‌ల జంపింగులు.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ!

వైసీపీ నుంచి టీడీపీలోకి.. టీడీపీ నుంచి వైసీపీలోకి నాయ‌కుల జంపింగులు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చాయి.

By:  Tupaki Desk   |   26 April 2024 5:30 PM GMT
ఏపీలో కీల‌క నేత‌ల జంపింగులు.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ!
X

ఏపీలో ఎన్నిక‌ల‌కు ముందు కీల‌క‌నాయ‌కులు ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీలోకి జంప్ చేశారు. ఇక‌, నామినేష‌న్‌ల ప‌ర్వం ప్రారంభ మ‌య్యే వ‌ర‌కు కూడా ఇదే విధానం కొన‌సాగింది. వైసీపీలో టికెట్లు రాని వారు.. టీడీపీ, జ‌న‌సేన‌ల్లోకి చేరి టికెట్లు తెచ్చుకున్నారు. కానీ.. టీడీపీ, జ‌న‌సేనల నుంచి కూడా నాయ‌కులు జంప్ చేసి వైసీపీలోకి చేరినా.. ఎవ‌రూ టికెట్లు ద‌క్కించుకోలేక పోయారు. ఇదొక చిత్ర‌మైన రాజ‌కీయం. అయితే.. నామినేష‌న్ల ప‌ర్వం కూడా పూర్త‌యిన త‌ర్వాత‌.. మ‌రోసారి జంపింగుల వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. వైసీపీ నుంచి టీడీపీలోకి.. టీడీపీ నుంచి వైసీపీలోకి నాయ‌కుల జంపింగులు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చాయి.

జంప్ చేస్తున్న వారిలో కీల‌క‌మైన నాయ‌కులే ఉండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా గుంటూరు జిల్లా తాడికొండ లేదా ప్ర‌త్తిపాడు నుంచి పోటీ చేయాల‌ని భావించిన మాజీ మంత్రి, ఎస్సీ నాయ‌కుడు డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయ‌న ఇప్ప‌టికే టీడీపీకి ట‌చ్‌లోకి వెళ్లిపోయారు. అయితే.. ఈయ‌న గత ఎన్నిక‌ల‌కు ముందు.. ఇదే అంశంతో టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు కూడా.. డొక్కాకు టికెట్ ఇవ్వ‌లేదు. ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. అయినా.. టికెట్‌పై ఆశ‌తో ఆయ‌న వైసీపీలోకి వ‌చ్చారు.కానీ, ఇక్క‌డ కూడా ఆశ తీర‌లేదు. దీంతో ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న టీడీపీలోకి వెళ్తున్నారు. ఈయ‌న‌కు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఇదేస‌మ‌యంలో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి య‌న‌మ‌ల‌రామ‌కృష్ణుడు సోద‌రుడు.. య‌న‌మల కృష్ణుడు కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకి హ్యాండిచ్చారు. ఆయ‌న కూడా పార్టీకి రాజీనామా చేశారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఆయ‌న తుని అసెంబ్లీ సీటును ఆశించారు. కానీ, చంద్ర‌బాబు ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా.. య‌న‌మ‌ల కుమార్తె దివ్య‌కు ఛాన్స్ ఇచ్చారు. దీంతో అలిగిన కృష్ణుడు అప్ప‌టి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు. నామినేష‌న్ల కార్య‌క్ర‌మానికి ముందే రాజీనామా చేయాల‌ని అనుకున్నారు. కానీ, ఆయ‌నను వైసీపీ నిలుపుద‌ల చేసింది. ఇప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌తో కృష్ణుడు తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు. రెండు రోజుల్లో ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఫ‌లితంగా తునిలో టీడీపీ గెలుపు అవ‌కాశంపై భారీ ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది.