Begin typing your search above and press return to search.

ఆ కొత్త పార్టీలోకి అఖిల ప్రియ?

మరోవైపు నంద్యాల టికెట్ను అఖిల ప్రియ పెదనాన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డికి ఇచ్చేందుకు బాబు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది

By:  Tupaki Desk   |   1 Sep 2023 7:12 AM GMT
ఆ కొత్త పార్టీలోకి అఖిల ప్రియ?
X

రాజకీయ పరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? త్వరలోనే ఆమె కొత్త పార్టీలోకి వెళ్తున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. టీడీపీలో తనకు ఆదరణ దక్కడం లేదని భావిస్తున్న ఆమె.. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలకు ముందు పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రామచంద్ర యాదవ్ కొత్తగా పెట్టిన భారత చైతన్య యువజన పార్టీలోకి అఖిల ప్రియ వెళ్లనున్నారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీలో భూమా అఖిల ప్రియకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అఖిల ప్రియ ఆళ్లగడ్డ టీడీపీ ఇంఛార్జీగా ఉన్నారు. ఆళ్లగడ్డతో పాటు నంద్యాలలోనూ ఆమె యాక్టివ్గా ఉంటున్నారు. ఆళ్లగడ్డలో తనకు, నంద్యాలలో తన సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కోరుతున్నారు. కానీ అందుకు బాబు సుముఖంగా లేనట్లు తెలిసింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఇంఛార్జీలతో బాబు సమావేశమయ్యారు. కానీ దీనికి అఖిల ప్రియను ఆహ్వానించలేదని తెలిసింది.

మరోవైపు నంద్యాల టికెట్ను అఖిల ప్రియ పెదనాన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డికి ఇచ్చేందుకు బాబు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. నంద్యాల ఇంఛార్జీగా బ్రహ్మానందరెడ్డి దూసుకెళ్తున్నారు. ఇక ఆళ్లగడ్డలోనూ అఖిల ప్రియకు టికెట్ ఇచ్చే ఆలోచనలో బాబు లేనట్లు తెలిసింది. దీంతో ఆమె పార్టీ మారే ప్రయత్నాలను మొదలెట్టారని టాక్. ఆళ్లగడ్డలో యాదవుల ఓట్లు దాదాపు 30 వేలు ఉన్నట్లు సమాచారం. అలాగే బలిజ సామాజిక వర్గం ఓట్లు కూడా బాగానే ఉన్నాయి.

అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ది బలిజ సామాజిక వర్గం. దీంతో యాదవుల సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీలోకి చేరేందుకు అఖిల ప్రియ చూస్తుందని తెలిసింది. తాను చెప్పిన వాళ్లకు 10 చోట్ల టికెట్లు ఇవ్వాలని, అంతే కాకుండా ఆళ్లగడ్డలో ఎన్నికల ఖర్చుకు రూ.30 కోట్లు ఇవ్వాలని అఖిల డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి రామచంద్ర యాదవ్ ఒప్పుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.