Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఏ పార్టీకి ?

ఇక టీడీపీ అయితే వైసీపీ వ్యతిరేక ఓటు ని చీల్చకుండా ఉండేందుకు అన్ని పార్టీలను కలుపుకుంటోంది.

By:  Tupaki Desk   |   4 May 2024 2:30 AM GMT
జూనియర్  ఎన్టీఆర్  మద్దతు ఏ పార్టీకి ?
X

ఏపీలో హోరా హోరీగా పోరు సాగుతోంది. ఒక్క ఓటు కోసం అధినేతలే చమటోడుస్తున్న నేపధ్యం ఉంది. ఈసారి నెక్ టూ నెక్ ఫైట్ అని గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ చెబుతున్నాయి. గడచిన ఎన్నికల్లో ఎంతటి జగన్ వేవ్ బలంగా వీచినా కేవలం పాతిక ఓట్లతో బయటపడిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గెలుపుని చూస్తే చాలు ఒక్క ఓటు ఎంత అవసరమో చెబుతుంది.

ఇక టీడీపీ అయితే వైసీపీ వ్యతిరేక ఓటు ని చీల్చకుండా ఉండేందుకు అన్ని పార్టీలను కలుపుకుంటోంది. బీజేపీని ముగ్గులోకి లాగింది. జనసేన ఎటూ ఉంది. ఈ క్రమంలో వివిధ వర్గాలు పెద్దల మద్దతు కూడా అందుకుంటోంది. ఇన్ని చేస్తున్న టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు దక్కిందా లేదా అన్నది చర్చగా ఉంది.

జూనియర్ 2009లో టీడీపీకి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉన్న టాప్ హీరో. ఆయన ఆనాడు చేసిన ప్రసంగాలు ఇప్పటికీ అంతా తలచుకుంటారు పాతికేళ్ల వయసులో ఎంతో గొప్ప మెచ్యూరిటీ చూపించారు. గుక్క తిప్పుకోకుండా తాత సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా అనర్గళంగా ఆయన చేసిన ప్రసంగాలకు ఉమ్మడి ఏపీ మొత్తం ఊర్రూతలూగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోవచ్చు కానీ కచ్చితంగా జూనియర్ ప్రభావం తీవ్ర స్థాయిలో చూపించారు అని చెప్పాల్సిందే.

అదే జూనియర్ తరువాత కాలంలో టీడీపీకి దూరం అయ్యారా పెట్టారా అన్నది పక్కన పెడితే పెద్ద గ్యాప్ మాత్రం అలా కొనసాగుతూ వస్తోంది. నారా లోకేష్ యువగళం సందర్భంగా ఒక చోట మాట్లాడుతూ జూనియర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. దానికి జూనియర్ వైపు నుంచి నో రెస్పాన్స్.

ఇక అయిదేళ్ళ వైసీపీ ప్రభుత్వంతో కూడా జూనియర్ ఎక్కడా కలసి ముందుకు సాగలేదు. సినీ హీరోలు అంతా జగన్ ని కలసినా ఆయన దూరం పాటించారు. ఒక విధంగా చూస్తే జూనియర్ న్యూట్రల్ పర్సన్ గానే ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయన సినీ కెరీర్ చూస్తే అద్భుతంగా సాగుతోంది. ఆయన ట్రిపుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు.

గతానికి ఇప్పటికీ పోల్చితే జూనియర్ ఇమేజ్ తారస్థాయిలో ఉంది. డూ ఆర్ డై అన్నట్లుగా ఏపీలో టీడీపీ ఫైట్ చేస్తున్న వేళ జూనియర్ మద్దతు ఇస్తే వార్ వన్ సైడ్ అవడం ఖాయమన్న భావన సగటు టీడీపీ క్యాడర్ లో ఉంది. అయినా కానీ ఎందుకు టీడీపీ పెద్దలు ఆ వైపు గా అడుగులు వేయడం లేదు అన్న చర్చ సాగుతోంది.

రాజకీయ లాభం ఉంటే ఎందాక అయినా వెళ్లే సామర్ధ్యం నైపుణ్యం పుష్కలంగా ఉన్న చంద్రబాబు జూనియర్ కి రాయబారాలు పంపించకుండా ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే జూనియర్ చాలా నిర్మొహమాటంగానే ఉన్నారు. తన కెరీర్ నే ఆయన చూసుకుంటున్నారు. ప్రస్తుతం జూనియర్ వయసు 41 ఏళ్ళు. ఆయనకు సినీ రంగంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది.

అందుకే ఆయన తొందరపడడం లేదు అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే జూనియర్ ఫోటోలను టీడీపీ తీసుకోవడం లేదు. ఆయన మావాడే అని చెప్పడంలేదు. అలా ఆయన నిర్ణయాన్ని చూసి వదిలేసినట్లుగానే ఉంది. కానీ వైసీపీలో చేరి రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేసిన కొడాలి నాని మాత్రం జూనియర్ నామస్మరణ చేస్తూనే ఉన్నారు. ఆయనకు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మద్దతు ఇచ్చారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే జూనియర్ కి టీడీపీ పగ్గాలు దక్కుతాయని అన్నారు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అన్నీ ఆలోచించాలని కోరారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి సీఎం పదవిని లాక్కున్న చంద్రబాబు పార్టీలో అసలైన టీడీపీ అభిమానులు ఎవరూ ఉండరని కొడాలి తేల్చి చెప్పారు.

అంతే కాదు తనకు ఎన్టీఆర్ వైఎస్సార్ రెండు కళ్ళు అని అన్నారు. తన కారు మీద ఇద్దరి ఫోటోలు ఉంటాయని చెప్పారు. తనకు రాజకీయ గురువు హరిక్రిష్ణ అని జూనియర్ తనకు ఎంతో ఇష్టమైన మిత్రుడని చెప్పుకున్నారు. తనకే కాదు జగన్ కి కూడా ఎన్టీఆర్ అన్నా జూనియర్ ఎన్టీఆర్ అన్నా ఇష్టమని అందుకే క్రిష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారని గుర్తు చేశారు.

దీనిని బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారికి టీడీపీని చిత్తుగా ఓడించాల్సిందేనా. వారు అలా చేస్తారా అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు ఎటు వైపు అన్న చర్చకు తెర లేస్తోంది. వారు అయితే అయోమయంలో ఉన్నారు. కొడాలి నానికి మద్దతు ఇచ్చిన వారు అంటే అది ఒక ప్రాంతానికే పరిమితం.

కానీ ఏపీ స్టేట్ వైడ్ గా చూస్తే జూనియర్ ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. వారి మద్దతు ఏ పార్టీకి దక్కుతుంది అన్నది ఇపుడు చర్చగా ఉంది. ఎందుకంటే టీడీపీలో ఉన్నా కూడా పసుపు జెండాల మీద జూనియర్ బొమ్మ వేసి పాలాభిషేకాలు చేయడం కాబోయే సీఎం అని నినాదాలు చేయడం ద్వారా జూనియర్ ఫ్యాన్స్ తన వైఖరి ఏమిటో చెప్పారు. మరి వారు టీడీపీకి ఓటు వేస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.