అందరి కళ్లూ మా ఫ్యామిలీ మ్యాన్‌పైనే.. ప్రైమ్ వీడియో సర్‌ప్రైజింగ్ పోస్ట్
ఇండియాలో పలు వెబ్ సిరీస్ లు పాపులర్ అవగా, అందులో ఒకటిగా ది ఫ్యామిలీ మ్యాన్ కూడా ఉంది.
By: Tupaki Desk | 24 Jun 2025 4:42 PM ISTఇండియాలో పలు వెబ్ సిరీస్ లు పాపులర్ అవగా, అందులో ఒకటిగా ది ఫ్యామిలీ మ్యాన్ కూడా ఉంది. ప్రముఖ ఓటీటీ యాప్ ప్రైమ్ వీడియోలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సిరీస్‌ల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ రెండు సీజన్‌లు పూర్తి చేసుకోగా ఇప్పుడు మూడో సీజన్ కు రంగం సిద్ధమవుతుంది. మనోజ్ బాజ్ పాయ్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సిరీస్ కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.
అయితే ఈ సిరీస్‌కు ది ఫ్యామిలీ మ్యాన్ రిటర్న్స్ అంటూ కొత్త టైటిల్ ను లాక్ చేయడం విశేషం. ప్రైమ్ వీడియో ఈ పోస్టర్ ను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ షేర్ చేస్తూ "మా ఫ్యామిలీ మ్యాన్ పైనే అందరి కళ్లు, కొత్త సీజన్ త్వరలో" అని వెల్లడించగా, ఈ పోస్టర్ లో మనోజ్ బాజ్ పాయ్ లుక్ చాలా ఇంటెన్స్ గా ఉంది. సీజన్3లో శ్రీకాంత్ తివారీ(మనోజ్ బాజ్‌పాయ్ పాత్ర పేరు) ఎదుర్కొనే కొత్త సవాళ్లతో పాటూ దేశభద్రత, ఫ్యామిలీ లైఫ్ ను ఎలా బ్యాలెన్స్ చేయాలనే విషయాలను చూపించనున్నారు.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్3 ఈ ఏడాది నవంబర్ లో రిలీజ్ కానుందని గతంలో మనోజ్ బాజ్ పాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గత రెండు సీజన్లలో కీలక పాత్రల్లో నటించిన ప్రియమణి, ఆశ్లేషా ఠాకూర్, షరీబ్ హష్మీ, వేదాంత్ లాంటి నటీనటులు ఈ సీజన్ లోనూ కనిపించనున్నారు. సీజన్2 క్లైమాక్స్ లో చెప్పినట్టు సీజన్3, కొవిడ్19 నేపథ్యంలో చైనా నుంచి ఇండియాపై జరిగే దాడుల చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది.
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్3 షూటింగ్ గతేడాది మే నెలలో ప్రారంభమవగా, రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకుంది. తమ కెరీర్లోనే ఫ్యామిలీ మ్యాన్ సీజన్3 షూటింగ్ అత్యంత కష్టమైన షూటింగ్ గా రాజ్ అండ్ డీకే తెలిపారు. మూడో సీజన్ షూటింగ్ నాగాలాండ్ తో పాటూ వివిధ ప్రాంతాల్లో జరిగింది. తామెంతో ఎదురుచూసే సిరీస్ కు సంబంధించిన అప్డేట్ రావడంతో ఆ పోస్టర్ ను షేర్ చేస్తూ ప్రేక్షకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ లో జైదీప్ అహ్లావత్ కీలక పాత్ర చేస్తుండటంతో సీజన్3పై మరింత ఆసక్తి నెలకొంది.