ఓటీటీల్లో అశ్లీల ప్రసారాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఓటీటీలు, సోషల్ మీడియాలో వస్తోన్న లైంగిక, అశ్లీలకరమైన కంటెంట్ ను నియంత్రిస్తూ, వాటిపై చర్యలు తీసుకోవాలని దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
By: Tupaki Desk | 29 April 2025 9:24 PM ISTఓటీటీలు, సోషల్ మీడియాలో వస్తోన్న లైంగిక, అశ్లీలకరమైన కంటెంట్ ను నియంత్రిస్తూ, వాటిపై చర్యలు తీసుకోవాలని దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దానికి సంబంధించిన వివిధ అంశాలను ఈ సందర్భంగా జస్టిస్ అగస్టిన్ జార్జి మాషి, జస్టిస్ బిఆర్ గవాయితో కూడిన ధర్మాసనం లేవనెత్తింది.
ఈ అంశం తమ పరిధిలోకి రాదని, ఇప్పటికే తాము కార్య నిర్వాహక వర్గాలు, శాసన నిర్మాణాల్లో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలున్నాయని న్యాయస్థానం తెలిపింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేంద్రంతోపాటూ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సహా పలువురుకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మాట్లాడుతూ, ఈ అంశంపై పరిష్కారాన్ని కనుగొంటామని హామీ ఇస్తూ, కొన్ని ప్రసారాలు మరీ దిగజారుడుతనంగా ఉంటున్నాయని, కనీసం ఇద్దరు మగాళ్లు కూడా ఆ కంటెంట్ ను కలిసి చూడలేకపోతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ ఎవరిమీదా వ్యతిరేకతతో వేసింది కాదని, ఓటీటీ, సోషల్ మీడియాల్లో ప్రసారమవుతున్న విషయాలపై తీవ్ర ఆందోళన తెలియచేసేందుకు ఉద్దేశించిందని పిటిషనర్ తరపు లాయర్ శంకర్ విష్ణు జైన్ తెలిపారు.
ఇలాంటి ప్రసారాలన్నీ ఎలాంటి పర్యవేక్షణ లేకుండానే జరుగుతున్నాయని ఆయన అన్నారు. గత విచారణ టైమ్ లోనే ఇది శాసన నిర్మాణ, కార్యనిర్వాహక వ్యవస్థలు పరిష్కరించాల్సిన అంశంగా మేం చెప్పామని ధర్మాసనం పేర్కొంది. అశ్లీల ప్రసారాలను నిషేధిస్తూ చట్టం రూపొందే వరకూ ఆయా ప్రసారాలను సమీక్షించి వాటిని నియంత్రించడానికి నేషనల్ కంటెంట్ కంట్రోల్ అథారిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్లు, తమ పిటిషన్ లో కోరారు.