సూపర్ హిట్ సిరీస్ సీజన్ 4 వచ్చేసింది
ఇండియన్ ఓటీటీ మార్కెట్ పరిధి విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు భారీ వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులకు అందిస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Jun 2025 11:31 AM ISTఇండియన్ ఓటీటీ మార్కెట్ పరిధి విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు భారీ వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఇండియన్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ఇప్పటికే చాలా వెబ్ సిరీస్‌లు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలను మించి సూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే పలు వెబ్ సిరీస్‌లు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వెబ్ సిరీస్‌లు సక్సెస్ అయితే కొత్త సీజన్‌లు వస్తూనే ఉన్నాయి. అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్‌ల్లో పంచాయత్ ఒకటి. ఇది పక్కా పల్లెటూరు వాతావరణంలో రూపొందిన వెబ్ సిరీస్. అనూహ్యమైన విజయాన్ని ఈ వెబ్ సిరీస్ సొంతం చేసుకుంది.
2020లో మొదటి సీజన్‌తో పంచాయత్ వచ్చింది. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా, సాన్వికా, చందన్ రాయ్, దుర్గేష్ కుమార్, అశోక్ పాఠక్, సునీతా రాజ్వార్, పంకజ్ ఝా నటించారు. ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల గ్రామమైన ఫూలేరాలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించే వ్యక్తి కథతో పంచాయత్ వెబ్ సిరీస్ నడుస్తూ ఉంటుంది. వినోదాత్మకంగా, సందేశాత్మకంగా కథ, స్క్రీన్ ప్లే ఉంటుంది. పల్లె వాతావరణంలో ఎక్కువగా కనిపించే సీన్స్ ఈ వెబ్ సిరీస్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మూడు సీజన్‌లు వచ్చి సూపర్ హిట్ అయిన పంచాయత్ నాల్గోవ సీజన్ స్ట్రీమింగ్ మొదలైంది.
గత ఐదేళ్లుగా పంచాయత్ వెబ్ సిరీస్‌ను ఆసక్తిగా చూస్తున్న వారు, అభిమానిస్తున్న వారు ఎప్పుడెప్పుడు పంచాయత్ సీజన్ 4 వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు పంచాయత్ ఎప్పటిలాగే అమెజాన్ ప్రైమ్‌లో కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సీజన్ 4కి మంచి స్పందన లభించింది. అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌ను ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంచారు. హిందీ ప్రేక్షకులు అమితంగా అభిమానిస్తున్న పంచాయత్ ముందు ముందు మరిన్ని సీజన్‌లు రావాలని ప్రేక్షకులతో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు కూడా బలంగా కోరుకుంటున్నారు. సీజన్ 4 లో మరో సీజన్ ఉంటుంది అన్నట్లుగానే హింట్ ఇచ్చారని సమాచారం అందుతోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక పంచాయత్ వెబ్ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ చేయకుండా రీమేక్ చేశారు. పంచాయత్ ను సివరపల్లి అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన ఆ వెబ్ సిరీస్‌కి మంచి స్పందన దక్కింది. తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో వెంటనే సీజన్ 2 మొదలు పెడతారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ఏర్పాట్లు జరిగినట్లుగా లేవు. హిందీలో ఇప్పటికే నాలుగు సీజన్‌లు స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో తెలుగులో రెండో సీజన్‌ను ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సివరపల్లి ని మరింతగా వినోదాత్మకంగా సీజన్ 2 తో తీసుకు వస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.