Begin typing your search above and press return to search.

టాలీవుడ్ నిర్మాత‌ల జుట్టు వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయిందా... !

తెలుగు సినీ పరిశ్రమ రూపురేఖలను ఓటీటి సంస్థలు పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ఒకప్పుడు హీరోల చేతుల్లో ఉండేది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 5:00 PM IST
టాలీవుడ్ నిర్మాత‌ల జుట్టు వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయిందా... !
X

తెలుగు సినీ పరిశ్రమ రూపురేఖలను ఓటీటి సంస్థలు పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ఒకప్పుడు హీరోల చేతుల్లో ఉండేది. ఆ తర్వాత దర్శకుల చేతుల్లోకి వెళ్ళింది. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు టాలీవుడ్ ఓటిటీ చేతిలో బందీ కాబోతుందా ? అంటే అవును అన్న ఆన్సర్లే వినిపిస్తున్నాయి. వాస్తవానికి కరోనాకు ముందు వరకు ఓటిటి సంస్థల ప్రాబల్యం టాలీవుడ్ మీద అంతగా లేదు. ఎప్పుడైతే కరోనా కారణంగా జనం అందరూ ఇళ్లకే పరిమితమయ్యారో ? అప్పుడు ఓటీటీకి విపరీతమైన కంటెంట్ అవసరం ఏర్పడింది. దీంతో ఓటీటీ సంస్థలు సినిమా రిలీజ్ కూడా కాకముందే కాంబినేషన్స్ చూసి అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టాయి. కరోనా టైంలో ఆయా సంస్థల‌కు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. దీంతో వచ్చిన డబ్బుని మళ్లీ సినిమాల మీద ఇన్వెస్ట్ చేసేందుకు సినిమాకి ఎంత అయినా ఖర్చు పెట్టడానికి ? వెనకాడకుండా కోట్లకు కోట్లు కాంబినేషన్ మీద కుమ్మరిస్తున్నారు.

కరోనా టైంలో దిల్ రాజు లాంటి హీరోతో తెరకెక్కించిన బి సినిమాను సైతం నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు అంటే ఓటీటీల క్రేజ్ అప్పట్లో ఎలా ఉందో అర్థమవుతుంది. కరోనా తర్వాత ఓటిటిల హవా ఒక రేంజ్ లో ఉండటం మొదలైంది. ఇప్పుడు ఓటిటి సంస్థలు అవసరమైతే ముందుగా పెట్టుబడులు పెట్టడం మాత్రమే కాదు.. నిర్మాతలతో గీచి గీచి బేరాలు ఆడుతున్నాయి. ఒకప్పుడు నిర్మాతలు కూడా ఓటిటి ఆదాయాన్ని ప్రధానంగా చూసేవారు కాదు.. థియేట్రికల్ బిజినెస్ మీద ఆధారపడేవారు. ఆ తర్వాత శాటిలైట్, ఆడియో లాంటి ఆప్షన్లు చూసుకునేవారు. ఇప్పుడు థియేటర్లతో సమానంగా ఓటీటీ రాబడి ఉంటోంది.

ఒకప్పుడు సినిమాలు మొదలుపెట్టినప్పుడు కాంబినేషన్ను చూసి అడ్వాన్స్ ఇచ్చిన ఓటిటి సంస్థలు ఇప్పుడు ఆయా సినిమాలో రిలీజ్ డేట్లను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఏకంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు - నాగార్జున కుబేర - విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్‌డ‌మ్‌ లాంటి పెద్ద సినిమాల రిలీజ్ డేట్లను కూడా ఓటీటీ సంస్థలు కంట్రోల్ చేస్తున్నాయి అంటే టాలీవుడ్ నిర్మాతలు జుట్టు ఆ సంస్థల చేతుల్లోకి ఎంతవరకు వెళ్లిపోయిందో క్లియర్ గా తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు ఈ విషయంలో మేల్కొని ఓటీటీలతో సంబంధం లేకుండా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.. కొందరు నిర్మాతలు మాత్రం ఓటీటీ సంస్థలు కూడా పెట్టుబడి పెడుతున్నాయి.. కాబట్టి వాళ్లు డిమాండ్ చేస్తే తప్పేంటని ? వారితో అంట కాగుతున్నారు. ఏది ఏమైనా తెలుగు సినీ పరిశ్రమ మీద ఓటీటి సంస్థల ప్రాబల్యం విపరీతంగా పెరుగుతుంది.. ఇది ఇలాగే పెరిగితే రేపటి రోజున థియేటర్ల వ్య‌వ‌స్థ‌కు కచ్చితంగా ఇబ్బంది అని చెప్పాలి.