OTT నుంచి థియేటర్‌కి ప్రయోగం
ఇప్పుడు అక్షయ్ ఖన్నా 2021 చిత్రం `స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్` ఓటీటీలో విడుదలయ్యాక, థియేటర్లలోకి వస్తోంది.
By: Tupaki Desk | 22 Jun 2025 6:48 PM ISTఓటీటీలో ఒకసారి చూసేసిన సినిమాని మళ్లీ థియేటర్ కి వెళ్లి ప్రజలు చూస్తారా? .. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన ఆలోచన.. అంతకుమించి ప్రయోగాత్మక ఐడియాలజీ. అలాంటి ఆలోచనతో ప్రయోగాత్మకంగా రిలీజ్ చేసిన 'బండా' మొదటిసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ఈ సినిమా మొదట్లో ఓటీటీలో విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చి ఆశించినంతగా బాక్సాఫీస్ వద్ద మెరవకపోయినా, ఇది ఒక ప్రయోగం అని అంతా భావించారు.
ఇప్పుడు అక్షయ్ ఖన్నా 2021 చిత్రం 'స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్' ఓటీటీలో విడుదలయ్యాక, థియేటర్లలోకి వస్తోంది. 'అక్షర్‌థామ్: ఆపరేషన్ వజ్ర శక్తి' పేరుతో దీనిని థియేటర్లలోకి రిలీజ్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. నిజానికి థియేటర్లలో ఆడేసాక, కొన్ని వారాలకు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా ఓటీటీలో అందరికీ అందుబాటులో ఉన్న సినిమాని థియేటర్లలో విడుదల చేయడం ఒక కొత్త ట్రెండ్ గా మారింది. ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ తర్వాత పుట్టుకొచ్చిన ట్రెండ్ గా దీనిని చూడాలి.
దేశభక్తి, యుద్ధ వీరుల కథను పెద్ద తెరపై ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం మేకర్స్ కు ఉండి ఉండొచ్చు. ఇక థియేటర్ రెంట్లు పే చేసే వారికి నష్టాల గురించి భయం లేదని, ప్రయోగానికి ధైర్యం చేసారని భావించాలి. ప్రస్తుతం ప్రజల మూడ్ ని ఎన్ క్యాష్ చేయాలనే ప్రయత్నం కావొచ్చు. ఇక ఇటీవల `సనమ్ తేరి కసమ్` థియేటర్లలో రెండో రిలీజ్ లో సాధించిన ఘనవిజయం చూశాక కూడా కొందరిలో బాక్సాఫీస్ విజయంపై ఏదో ఒక కొత్త ఆశ పుట్టుకొచ్చిందని భావించాలి. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తే ఆదరణ దక్కుతుందా లేదా? అన్నది అప్పటి మూడ్ పై ఆధారపడి ఉంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు. `అక్షరధామ్: ఆపరేషన్ వజ్ర శక్తి` థియేట్రికల్ గా బాక్సాఫీస్ టెస్ట్ పాస్ అవుతుందా లేదా చూడాలి.