కాంట్రవర్సీకి కారణమైన కులాభిమానం
ఈ వీకెండ్ లో ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ఏఐర్(ఆల్ ఇండియా ర్యాంకర్స్).
By: Tupaki Desk | 6 July 2025 11:11 PM ISTఈ వీకెండ్ లో ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ఏఐర్(ఆల్ ఇండియా ర్యాంకర్స్). 90స్ మిడిల్ క్లాస్ లాంటి ఓ మంచి వెబ్ సిరీస్ ను అందించిన ఈటీవీ విన్ నుంచి వచ్చిన మరో మంచి వెబ్ సిరీస్ గా ఏఐఆర్ కు రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ ఈ లోపే ఆ సిరీస్ చుట్టూ ఓ వివాదం మొదలైంది. సిరీస్ లోని ఒక సీన్ ఓ కులాన్ని టార్గెట్ చేస్తూ ఉందని ఆ సీన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
వేర్వేరు నేపథ్యం నుంచి వచ్చిన ముగ్గురు కుర్రాళ్లు విజయవాడలోని ఓ హాస్టల్ లో జాయిన్ అయ్యాక వారు ఎలాంటి సిట్యుయేషన్స్ ను ఫేస్ చేస్తారు అనేది ఈ సిరీస్ లో చూపించారు. అయితే ఈ నేపథ్యంలో ఓ సామాజిక వర్గానికి చెందిన పిల్లలకు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నట్టు, కాలేజ్ లో గ్రూపులు కట్టడంతో పాటూ ఇతర కులాలకు చెందిన హీరోలను ద్వేషిస్తున్నట్టు, వేరే కులానికి చెందిన హీరో కూల్ డ్రింక్ యాడ్ చేస్తే అది తాగకూడదని డెసిషన్ తీసుకున్నట్టు ఇందులో చూపించడం ఈ వివాదానికి కారణమైంది.
అయితే ఈ సిరీస్ లో ఎక్కడా ఫలానా కులమని ప్రస్తావించకపోయినా, అందులో ఏ క్యాస్ట్ ను టార్గెట్ చేశారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ సీన్ సదరు కులం వాళ్లకు ఎంతో అభ్యంతరంగా అనిపించి మేకర్స్ తో పాటూ స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ ను కూడా టార్గెట్ చేసి నెట్టింట వారిపై ఫైర్ అయ్యారు. అసలే ఆ కులానికి సంబంధించిన వారి మనోభావాలు దెబ్బతిని ఫైర్ మీదుంటే ఆ సీన్ కు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను ఈటీవీ విన్ రీపోస్ట్ చేయడం ఈ వివాదాన్ని మరింత సీరియస్ అయ్యేలా చేసింది.
ఈటీవీకి చెందిన ఓటీటీ వెబ్ సిరీస్ లో ఇలాంటి సీన్స్ రావడం అందరినీ ఆశ్చర్యపరచగా, ఈ వివాదంపై మేకర్స్ స్పందిస్తూ ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటామని, తమ కంటెంట్ గౌరవంతో ఉండేలా చూసుకుంటామని ఈటీవీ విన్ పేర్కొంటూ ట్వీట్ చేసింది. మరోవైపు సిరీస్ నిర్మాత అయిన డైరెక్టర్ సందీప్ రాజ్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. సిరీస్ లో ఉన్న సీన్ ను తేసేశామని, జరిగిన తప్పుకు క్షమించాలని కోరారు. మేకర్స్ క్షమాపణలు చెప్పినప్పటికీ నెటిజన్లు వారిని వదిలిపెట్టడం లేదు.