Begin typing your search above and press return to search.

నిజమైన 'యశస్వి'..ఆ మూడు దేశాల గడ్డపై తొలి టెస్టులోనే సెంచరీ రికార్డు

ఇక ఇంగ్లండ్ లో జైశ్వాల్ తొలిసారి పర్యటిస్తున్నాడు. ఈ గడ్డపై ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే అతడు మూడంకెల స్కోరును అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 1:30 PM IST
నిజమైన యశస్వి..ఆ మూడు దేశాల గడ్డపై తొలి టెస్టులోనే సెంచరీ రికార్డు
X

'యశస్వి..' అంటే చిరస్థాయిగా నిలిచే "కీర్తివంతుడు", "విజయవంతమైనవాడు", లేదా "ప్రసిద్ధి చెందినవాడు" అని అర్థం. ఇప్పడు టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఈ కోవలోకే వెళ్తున్నాడు. ఆడిన ప్రతి విదేశంలోనూ తొలి టెస్టులోనే సెంచరీ చేసిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బహుశా భవిష్యత్ లోనూ ఇది ఎవరికీ సాధ్యం కాని ఘనతగానూ చెప్పొచ్చు.

ఇంగ్లండ్ తో లీడ్స్ లో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఓపెనర్ జైశ్వాల్ అద్భుత సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఓవైపు చేతి గాయం ఇబ్బందిపెడుతున్నా.. రిటైర్ హర్ట్ తీసుకోకుండా ఆడాడు జైశ్వాల్. సెంచరీ కొట్టాక ఔట్ అయ్యాడు. విశేషం ఏమంటే.. ఇంగ్లండ్ అంటేనే అతడు చెలరేగిపోతున్నాడు. ఆ జట్టుపై ఆడిన 10 ఇన్నింగ్స్ లో 90.33 సగటుతో 813 పరుగులు సాధించాడు. సగటులో దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్ మన్ (కనీసం 500 పరుగులు)ను దాటేశాడు. బ్రాడ్ మన్ 63 ఇన్నింగ్స్ లో 89.78 సగటుతో 5,028 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ పై 90 సగటున్న ఏకైక క్రికెటర్ జైశ్వాల్ కావడం విశేషం.

ఇక ఇంగ్లండ్ లో జైశ్వాల్ తొలిసారి పర్యటిస్తున్నాడు. ఈ గడ్డపై ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే అతడు మూడంకెల స్కోరును అందుకున్నాడు. సరిగ్గా రెండేళ్ల కిందట 2023 జూలై 12న జైశ్వాల్ వెస్టిండీస్ టూర్ ద్వారా టీమ్ ఇండియాలోకి వచ్చాడు. నాడు రొసావూలో జరిగిన తొలి టెస్టులో జైశ్వాల్ 171 పరుగులు సాధించాడు.

ఇక 2023 చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది భారత్. నవంబరు 22 నుంచి పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో జైశ్వాల్ డకౌట్ అయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చెలరేగి ఆడాడు. 161 పరుగులతో ఆసీస్ గడ్డపై తొలి టెస్టులోనే సెంచరీ (రెండో ఇన్నింగ్స్)ని అందుకున్నాడు.

తాజాగా ఇంగ్లండ్ లోనూ ఆడుతున్న తొలి టెస్టులోనే సెంచరీ కొట్టాడు జైశ్వాల్. అయితే, దక్షిణాఫ్రికాలో మాత్రం అద్భుతం చేయలేకపోయాడు. 2023 డిసెంబరులో ఆ దేశంలో తొలి టెస్టు ఆడిన జైశ్వాల్ తొలి ఇన్నింగ్స్ లో 17, రెండో ఇన్నింగ్స్ లో 5 పరుగులకే ఔటయ్యాడు. కాగా, ఇక మిగిలింది న్యూజిలాండ్ తో సిరీస్. ఇందులోనూ జైశ్వాల్ తొలి టెస్టులోనే సెంచరీ కొడితే అద్భుతమైన రికార్డు అతడి సొంతం అవుతుంది.