ఒక్కడే 367 కొట్టాడు.. 400 ముంగిట డిక్లేర్డ్.. కెప్టెన్ కూడా అతడే పైగా
అయితే, 367 నాటౌట్ (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లు) వద్ద ఉండగా అనూహ్యంగా డిక్లేర్ చేశాడు.
By: Tupaki Desk | 7 July 2025 8:10 PM ISTటెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేయడమే గగనం.. ట్రిపుల్ సెంచరీ అంటే చాలా కష్టం.. ఏకంగా క్వాడ్రాఫుల్ సెంచరీ (400) అంటే అసాధ‍్యమే అని చెప్పాలి. వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా 2004లో ఇంగ్లండ్‌ను ఉతికిఆరేస్తూ సాధించిన క్వాడ్రాఫుల్ సెంచరీ (400 నాటౌట్) ఇంకా బద్దలవలేదు. 21 ఏళ్లలో ఈ రికార్డుకు దగ్గరగా వచ్చిన బ్యాట్స్‌మన్ కూడా లేరు. అలాంటిది.. ఇప్పుడు ఓ బ్యాట్స్‌మన్ కు 400 సాధించే అవకాశం దక్కింది. కానీ, అతడు చేసిన పని అతడికే అరుదైన రికార్డును దూరం చేసంది.
తమ పక్కనే ఉండే జింబాబ్వేలో ప్రపంచ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు టూర్ చేస్తోంది. మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ప్రస్తుతం మూడో టెస్టు జరుగుతోంది. ఆదివారం ప్రారంభమైన ఈ టెస్టులో దక్షిణాఫ్రికాకు కెప్టెన్ వియాన్ ముల్డర్. సీనియర్లు అందరూ విశ్రాంతి తీసుకోవడంతో ముల్డర్ కెప్టెన్సీ చేస్తున్నాడు. తొలి రోజు 259 బంతుల్లోనే 264 పరుగులు బాదేసిన అతడు.. సోమవారం రెండో రోజు మరో 103 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ట్రిపుల్ సెంచరీ దాటేశాడు.
అయితే, 367 నాటౌట్ (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లు) వద్ద ఉండగా అనూహ్యంగా డిక్లేర్ చేశాడు. నిండా ఒకటిన్నర రోజు ఆట కూడా పూర్తికాలేదు. మంచి జోరు మీద ఉన్నాడు.. కేవలం 34 పరుగులు చేస్తే టెస్టుల్లో క్వాడ్రాఫుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచే అరుదైన రికార్డు అందుకునేవాడు. పైగా డిక్లేర్ ఇచ్చే అధికారం ఉన్న జట్టు కెప్టెన్ కూడా. అయినా ఎవరికీ సాధ్యం కాని రికార్డును వద్దనుకున్నాడు. ఇన్నింగ్స్‌ను 626/5 వద్ద డిక్లేర్ చేసి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు.
దక్షిణాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్ ముల్డర్. కేవలం 297 పరుగుల్లోనే 300 కొట్టేశాడు. ఇది రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్. కెప్టెన్సీ చేస్తున్న తొలి మ్యాచ్ కూడా. ఇవన్నీ రికార్డులే.
-సఫారీల తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ హషీమ్ ఆమ్లా (311 నాటౌట్) పేరిట ఉంది. పాకిస్థాన్ బ్యాటర్ మొహ్మద్ హనీఫ్ (337, వెస్టిండీస్‌పై, 1958)తర్వాత విదేశాల్లో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్ కూడా ముల్డరే. డిక్లరేషన్ అనంతరం జింబాబ్వేను 170కే ఆలౌట్ చేసింది దక్షిణాఫ్రికా.
కాగా, లారా తర్వాత రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హేడెన్ ది. 2003లో జింబాబ్వేపై 380 పరుగులు చేశాడు. దీనికిముందు అతడు లారా (375 ఇంగ్లాండ్‌పై 1994లో) రికార్డునే బ్రేక్ చేశాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనె 2006లో దక్షిణాఫ్రికాపై 374 కొట్టాడు. వీరి తర్వాత ముల్డర్ నిలిచాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టులో 269 వద్ద ఔటయ్యాడు. మరి గిల్.. మిగతా మూడు టెస్టుల్లో ట్రిపుల్ కొట్టేస్తాడా..?