Begin typing your search above and press return to search.

14 ఏళ్లకే సెంచరీ.. టీమ్ ఇండియాలోకి వచ్చేస్తాడా? సచిన్ ను దాటేస్తాడా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ ఏడాది రూ.1.10 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న బిహారీ బాబు వైభవ్ సూర్యవంశీ సోమవారం గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఏకంగా సెంచరీ కొట్టాడు.

By:  Tupaki Desk   |   29 April 2025 9:04 AM IST
14 ఏళ్లకే సెంచరీ.. టీమ్ ఇండియాలోకి వచ్చేస్తాడా? సచిన్ ను దాటేస్తాడా?
X

ఇప్పటివరకు భారత క్రికెట్ లో అత్యంత చిన్న వయసులో జాతీయ జట్టుకు ఎంపికైనది సచిన్ టెండూల్కర్ మాత్రమే. 16 ఏళ్ల వయసులో 1989లో టీమ్ ఇండియాలోకి వచ్చిన అతడు 24 ఏళ్లు సేవలందించాడు.

ఇప్పుడు 14 ఏళ్ల కుర్రాడు సచిన్ రికార్డును దాటేసేలా కనిపిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ ఏడాది రూ.1.10 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న బిహారీ బాబు వైభవ్ సూర్యవంశీ సోమవారం గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఏకంగా సెంచరీ కొట్టాడు.

35 బంతుల్లో సెంచరీ చేసిన 14 ఏళ్ల వైభవ్.. ఐపీఎల్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన తొలి భారతీయుడుగా నిలిచాడు. గుజరాత్ తో మ్యాచ్ లో 7 ఫోర్లు, 11 సిక్సులతో 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు వైభవ్. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు మరో 18 బంతుల్లో సెంచరీ కూడా కొట్టేశాడు. క్రిస్ గేల్ వంటి మెరుపు వీరుడు 30 బంతుల్లో సెంచరీ చేయగా.. మరో 5 బంతులు మాత్రమే ఎక్కువగా తీసుకున్నాడు వైభవ్.

ఈ మ్యాచ్ లో ఓడిపోతే రాజస్థాన్ ప్లేఆఫ్స్ అవకాశాలు క్లిష్టమే అనే పరిస్థితుల్లో.. 210 పరుగుల టార్గెట్ ను కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించేలా చేశాడు వైభవ్.

సోమవారం నాటికి 14 ఏళ్ల 32 రోజుల వయసున్న వైభవ్.. టి20ల్లో సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడు. 11 సిక్సులతో మురళీ విజయ్ తర్వాత ఓ మ్యాచ్ లో అత్యధిక సిక్సులు కొట్టిన రెండో భారతీయుడుగా వైభవ్ నిలిచాడు. తాజా సెంచరీతో ఐపీఎల్ లో అతి చిన్న వయసులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు.

భవిష్యత్ లో టీమ్ ఇండియాలోకి వచ్చే నలుగురు కుర్రాళ్లు వీరే అంటూ మాజీ హెడ్ కోచ్, మేటి ఆల్ రౌండర్, మంచి కామెంటేటర్, విశ్లేషకుడు అయిన రవిశాస్త్రి ఇటీవల కొన్ని పేర్లు చెప్పాడు. వీరిలో మొదటి పేరు వైభవ్ సూర్య వంశీది కాగా, మిగతావారు 17 ఏళ్ల ఆయుష్ మాత్రే (చెన్నై సూపర్ కింగ్స్), పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు, 24 ఏళ్ల ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్.