300 కాదు.. అందరి కంటే ముందే ఇంటికి.. వెరీ బ్యాడ్ ఆరెంజ్ ఆర్మీ
కానీ, ఇప్పుడు సొంత గడ్డపైనే ఓటములు.. 300 కాదు కదా.. 200 కొట్టినా గొప్పే అనుకునేలా ఆట.. ఓవైపు పెద్దగా పేరు లేని ప్రత్యర్థి జట్లు దూకుడుగా ఆడుతూంటే ఈ జట్టేమో పూర్తిగా చేతులెత్తేసింది
By: Tupaki Desk | 24 April 2025 5:19 PM ISTనిరుడు సరిగ్గా ఇదే రోజుల్లో 300 కొట్టేస్తారా..? అని ప్రతి మ్యాచ్ కు ముందు అంచనాలు.. ఇదిగొ అదిగొ అంటూ ఊహాగానాలు.. మ్యాచ్ లో ఎవరో ఒకరు దూకుడైన బ్యాటింగ్.. ప్రతి మ్యాచ్ లోనూ గెలుపు మనదే అనేంత జోష్.. ఇదీ నిరుడు ఆ జట్టు పరిస్థితి.
కానీ, ఇప్పుడు సొంత గడ్డపైనే ఓటములు.. 300 కాదు కదా.. 200 కొట్టినా గొప్పే అనుకునేలా ఆట.. ఓవైపు పెద్దగా పేరు లేని ప్రత్యర్థి జట్లు దూకుడుగా ఆడుతూంటే ఈ జట్టేమో పూర్తిగా చేతులెత్తేసింది
సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్).. నిరుడు ఐపీఎల్ రన్నరప్. ఫైనల్లో కాస్త బోల్తాపడింది కానీ.. లేదంటే టైటిల్ ఖాయం అనుకున్నారు. అభిమానులు ముద్దుగా ఆరెంజ్ ఆర్మీ అని పిలుచుకునే ఎస్ఆర్ హెచ్ ఈ సీజన్ లో తేలిపోయింది. కచ్చితంగా 300 కొడతారని ఆశలు పెట్టుకుంటే అట్టర్ ఫ్లాప్ అవుతోంది. తొలి మ్యాచ్ లోనే 286 పరుగుల రెండో అత్యధిక స్కోరు చేసి ఇక 300 ఖాయం అనిపించింది. కానీ, తర్వాతి నుంచి అంతా తుస్.
మొత్తం 8 మ్యాచ్ లలో 2 విజయాలు.. పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానం. రన్ రేట్ మరీ ఘోరం -1.361. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ లలో 12 పాయింట్లు సాధించాయి. దీంతో సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరే చాన్సులు లేనట్లేనని చెబుతున్నారు. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ చేతిలో ఉప్పల్ లో ఘోరంగా ఓడడంతోనే సన్ రైజర్స్ కథ ముగిసిందని తెలిసిపోయిందని అంటున్నారు.
కాటేరమ్మ కొడుకులకు ఏమైంది..?
భారత్ లోనే 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ గెలిపించిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సారథ్యంలో నిరుడు సన్ రైజర్స్ మంచి జోష్ మీద కనిపించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), అభిషేక్ శర్మకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మార్క్ రమ్, క్లాసెన్, తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తోడవడంతో సన్ రైజర్స్ పటిష్ఠంగా కనిపించింది. కెప్టెన్ గానే కాక కమ్మిన్స్ తన పేస్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు వీరెవరూ మ్యాచ్ గెలిపించే స్థాయిలో లేరు. దీంతోనే సన్ రైజర్స్ ను వరుసగా ఓటములు వెంటాడుతున్నాయి. దీంతో పాయింట్ల పట్టికలో తనకంటే కింద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కంటే ముందే లీగ్ ప్లేఆఫ్స్ రేస్ నుంచి ఔటైపోయింది.