ముంబై బీసీసీఐ ఆఫీస్.. బోర్డ్ రూమ్ నం.10000.. ఏమిటీ దీని ప్రత్యేకత
గావస్కర్‌కు దేశమంటే అమిత ప్రేమ. ఎంతగా అంటే.. కామెంట్రీ బాక్స్‌లో ఉంటూ... టీమ్ ఇండియా ఆటగాడు తప్పు చేస్తే తీవ్రంగా తిట్టేసేంత.
By: Tupaki Desk | 16 May 2025 9:25 AM ISTఇప్పుడు సాధారణ పేస్ బౌలర్ల బౌలింగ్ లోనూ బ్యాట్స్‌మెన్ హెల్మెట్‌తోనే బరిలో దిగుతున్నారు.. కొందరైతే స్పిన్‌లోనూ హెల్మెట్ తీయడం లేదు. కానీ, 1970ల్లో.. పేరు చెబితేనే బ్యాట్స్‌మెన్ వణికిపోయే అరివీర భయంకర వెస్టిండీస్ బౌలర్లను ఆయన కనీసం హెల్మెట్ కూడా లేకుండా ఒక ఆట ఆడేశాడు. టెస్టులు ఆడడం ఒక కళ అని చాటాడు.. గంటలకు గంటలు క్రీజులో పాతుకుపోవడం.. రోజుల తరబడి బ్యాటింగ్ చేయడం.. టన్నుల కొద్దీ పరుగులు బాదడం..ఇవన్నీ ఒకే ఒక్క బ్యాట్స్‌మన్ లో ఉంటే అతడే సునీల్ గావస్కర్. 1971 నుంచి 1987 వరకు 16 ఏళ్లు భారత బ్యాటింగ్ వెన్నెముక గావస్కర్. అప్పట్లో టెస్టులే ప్రధానం కాబట్టి.. వన్డేలు అడపాదడపాగానే సాగేవి. దీంతో గావస్కర్ కళాత్మక ఆట చూసేందుకు అభిమానులు ఎంతో ఆశగా గ్రౌండ్‌కు వచ్చేవారు. అంతగా క్రికెట్‌ను ఏలాడు గావస్కర్. రిటైర్మెంట్ అనంతరం కూడా గావస్కర్‌కు ఆట పట్ల ఆసక్తి ఏమీ తగ్గలేదు. కొంతకాలం పత్రికలకు వ్యాసాలు రాశారు. కామెంట్రీలో సెటిలయ్యారు.
ఎక్కడున్నా నిండైనా ‘భారతీయుడు’
గావస్కర్‌కు దేశమంటే అమిత ప్రేమ. ఎంతగా అంటే.. కామెంట్రీ బాక్స్‌లో ఉంటూ... టీమ్ ఇండియా ఆటగాడు తప్పు చేస్తే తీవ్రంగా తిట్టేసేంత. ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ చెత్త షాట్ ఆడి ఔటైన నేపథ్యంలో గావస్కర్ అతడిని స్టుపిడ్ స్టుపిడ్ స్టుపిడ్ అంటూ తిట్టిపోశారు. ఇంకా చెప్పాలంటే ఎన్నో సందర్భాల్లో భారత క్రికెటర్లు తప్పు చేస్తే కడిగేసేవారు. ఇక గావస్కర్ భారత క్రికెట్‌ను ఎవరైనా తక్కువ చేస్తే సహించరు. ఈ విషయంలో గతంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మీడియా, బోర్డులను తీవ్రంగా తప్పుబట్టేవారు. వారిది పక్షపాత ధోరణి అని మండిపడేవారు. ఇటీవల టీమ్ ఇండియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన సందర్భంలో 75 ఏళ్ల వయసులోనూ గావస్కర్ గ్రౌండ్‌లో ఆనందంతో గంతులేశారు.
ప్రపంచ దిగ్గజం ఆయన
125 టెస్టుల్లో 51.02 సగటుతో 10,122 పరుగులు చేసిన గావస్కర్.. టెస్టు క్రికెట్‌లో 10 వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్. భారత క్రికెట్‌తో జీవితాన్ని ఇంతగా పెనవేసుకున్న ఆయనను తాజాగా బీసీసీఐ వినూత్నంగా సత్కరించింది. గావస్కర్ పుట్టి పెరిగింది ముంబై. ఇక బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఉండేది కూడా ఇక్కడే. అందుకే అచ్చమైన ముంబైకర్ గావస్కర్ పేరిట బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో స్పెషల్ బోర్డ్ రూమ్ ఏర్పాటు చేసింది. టెస్టు క్రికెట్‌లో 10 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచే గావస్కర్ పేరిట ఏర్పాటు చేసిన బోర్డ్ రూమ్‌కు ‘10,000 గావస్కర్’ అని పేరుపెట్టింది. దీనిని గావస్కర్ స్వయంగా ప్రారంభించారు.
ముంబై క్రికెట్ సంఘం, బీసీసీఐ తనకు తల్లిదండ్రుల వంటివని, వాటివల్లే ఇంతటివాడిని అయ్యానని గావస్కర్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ వయసులో కూడా బోర్డు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనతో ఏ అవసరం ఉన్నా.. సందేహించకుండా అడగాలని సూచించారు.