Begin typing your search above and press return to search.

ఐపీఎల్-18... 10వ ప్లేస్ కోసం ఆ 2 జట్ల మ్యాచ్.. ఇదేం మాస్ రా మామ

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు చేరేది ఎవరో ప్రస్తుతం ఓ అంచనా వచ్చేసింది. 14 మ్యాచ్ లకు గాను కనీసం 8 మ్యాచ్ లు గెలిచిన జట్లు ప్లే ఆఫ్స్ కు వెళ్తాయి.

By:  Tupaki Desk   |   25 April 2025 2:47 PM IST
CSK vs SRH  10Th Place Match
X

ఒక జట్టు ఐదుసార్లు చాంపియన్.. ఐదుసార్లు రన్నరప్.. ఒక జట్టు రెండుసార్లు చాంపియన్.. ప్రస్తుతం రన్నరప్.. మరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎలా ఉంటుంది..? కనీసం వీటిలో ప్లేఆఫ్స్ చేరేది ఎవరు? అనే చర్చ నడుస్తుంది.. కానీ, దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది.

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు చేరేది ఎవరో ప్రస్తుతం ఓ అంచనా వచ్చేసింది. 14 మ్యాచ్ లకు గాను కనీసం 8 మ్యాచ్ లు గెలిచిన జట్లు ప్లే ఆఫ్స్ కు వెళ్తాయి. ఈ లెక్కన ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. 8 మ్యాచ్ లకు గాను ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో ఉన్నాయి. ఈ మూడు జట్లు 6 మ్యాచ్ లలో కనీసం రెండు గెలిచినా చాలు ప్లేఆఫ్స్ నకు వెళ్లడం ఖాయం.

ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రెండుసార్లు టైటిల్ కొట్టిన సన్ రైజర్స్ (ఎస్ఆర్ హెచ్) మాత్రం ఈసారి లీగ్ లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాయి. 8 మ్యాచ్ లకు కేవలం రెండు మ్యాచ్ లు మాత్రమే గెలిచాయి. నాలుగు పాయింట్లతో ఉన్నాయి.

తాజాగా ముంబై చేతిలో పరాజయం పాలైన ఈ రెండు జట్లు శుక్రవారం చెన్నైలోని చెపాక్ మైదానంలో తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో చెన్నై -1.392 అట్టడుగున ఉండగా.. సన్ రైజర్స్ 9వ స్థానంలో (రన్ రేట్ -1.361) ఉంది.

ఏ జట్టు గెలిచినా ఉపయోగం లేదు.. పాయింట్లతో ఒరిగేదేమీ లేదు.. బహుశా ప్రస్తుత ఐపీఎల్ లో అత్యంత అనాసక్తికర మ్యాచ్ ఇదేనేమో? దీన్నిబట్టే ఓ నెటిజన్.. ’’కప్ కోసం పోటాపోటీగా ఆడే జట్లను చూసుంటారు. ఈ రోజు 10వ స్థానం కోసం హోరాహోరీగా తలపడే టీమ్స్ ను చూస్తున్నాం’’ అంటూ ట్వీట్ చేశాడు.