Begin typing your search above and press return to search.

రన్ మెషిన్ శుభ్‌ మన్‌ గిల్.. ఈ సిరీస్ లో 'వెయ్యి' కొట్టేస్తాడా?

కేవలం నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే 585 పరుగులు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో తప్ప.. మిగతా మూడుసార్లు భారీ సెంచరీలు. వీటిలో ఒక భారీ డబుల్ సెంచరీ కూడా.

By:  Tupaki Desk   |   6 July 2025 9:46 AM IST
రన్ మెషిన్ శుభ్‌ మన్‌ గిల్.. ఈ సిరీస్ లో వెయ్యి కొట్టేస్తాడా?
X

ఇంగ్లండ్ తో రెండో టెస్టులో టీమ్ ఇండియా పట్టు బిగించినట్లే.. 608 పరుగుల కొండంత టార్గెట్.. 72కే మూడు ఇంగ్లండ్ కీలక వికెట్లు డౌన్.. ఇక చివరి రోజు ఆదివారం మరో ఏడు వికెట్లు తీస్తే ఎడ్జ్ బాస్టన్ లో చరిత్రలో తొలి గెలుపు సొంతం.. వాస్తవానికి లీడ్స్ లో జరిగిన తొలి టెస్టులోనే టీమ్ ఇండియా గెలవాల్సింది. కనీసం డ్రా కావాల్సింది. కానీ, ఓడిపోయింది. దీనికి కారణం.. కొన్ని పరుగులు తక్కువ చేయడమే. ఇప్పుడు రెండో టెస్టులో మాత్రం కొండంత కొట్టేసింది. దీనివెనుక ఉన్నది కెప్టెన్.

ఇటీవలి కాలంలో మరీ ముఖ్యంగా టెస్టుల్లో ఏ జట్టు కెప్టెన్ ఆడని విధంగా ఇంగ్లండ్ లో చెలరేగుతున్నాడు టీమ్ ఇండియా యువ కెప్టెన్ శుబ్ మన్ గిల్. కేవలం నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే 585 పరుగులు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో తప్ప.. మిగతా మూడుసార్లు భారీ సెంచరీలు. వీటిలో ఒక భారీ డబుల్ సెంచరీ కూడా.

ఇక శనివారం అయితే గిల్ విశ్వరూపమే చూపాడు. ఒకే టెస్టులో డబుల్‌ సెంచరీ, సెంచరీ సాధించిన భారత క్రికెటర్ గా రికార్డులకు ఎక్కాడు. వరుసగా ఇంగ్లండ్ గడ్డపై మూడు సెంచరీలు కొట్టిన ఘనతను కూడా అందుకున్నాడు. బహుశా ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ కూ సాధ్యం కాని రికార్డు ఇది.

అంతేకాదు.. కెప్టెన్‌గా తొలి రెండు టెస‍్టుల్లోనే మూడు సెంచరీలు (ఓ డబుల్‌ కూడా) సాధించడం గిల్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇది సూపర్‌ ఫామ్‌ ను మించిన సూపర్‌ ఫామ్‌ అని చెప్పాలి. ఇంకో మూడు టెస్టులు మిగిలి ఉండగా.. కనీసం ఐదు ఇన్నింగ్స్ లు ఆడతారని భావించినా.. ఈ సిరీస్‌ ముగిసే సరికి గిల్ వెయ్యి పరుగులు సాధించడం ఖాయం అనిపిస్తోంది ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే.

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన గిల్ 161 వద్ద ఔటయ్యాడు. అదే జరిగి ఉంటే చరిత్రలో నిలిచేవాడేమో?

తాజా ప్రదర్శనతో.. ఒకే టెస్టులో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్ మన్ గా గిల్ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 269, రెండో ఇన్నింగ్స్ లో 161 కలిపి 430 పరుగులు చేశాడు. 1971లో వెస్టిండీస్ పై సునీల్ గావస్కర్ రెండు ఇన్నింగ్స్ లో 344 పరుగులు చేశాడు.

ఒక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్ మన్ గిల్. 1990లో ప్రఖ్యాత లార్డ్స్ లో ఇంగ్లండ్ కెప్టెన్ గ్రాహం గూచ్ 456 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. మరొక్క 27 పరుగులు చేసి ఉంటే గిల్.. గూచ్ రికార్డును బద్దలు కొట్టేవాడే.

కొసమెరుపు: 1990లో గూచ్ 456 పరుగులు చేసింది భారత్ పైనే. సునీల్ గావస్కర్ (ఎస్జీ).. శుబ్ మన్ గిల్ (ఎస్జీ) ఇద్దరి పేర్ల షార్ట్ కట్ ఒకటే.