రోహిత్, కోహ్లి స్థానాల్లో భారీ అంచనాలతో వెళ్లి..‘0’లు చుట్టారు
ఒకరు దేశవాళీలు, ఐపీఎల్‌లో అదరగొట్టి ఏకంగా టీమ్ ఇండియా టెస్టు బెర్తు కొట్టేశారు. మరొకరు ఏకంగా 8 ఏళ్ల తర్వాత మళ్లీ టీమ్ ఇండియా గడపతొక్కారు.
By: Tupaki Desk | 22 Jun 2025 9:34 AM ISTఒకరు దేశవాళీలు, ఐపీఎల్‌లో అదరగొట్టి ఏకంగా టీమ్ ఇండియా టెస్టు బెర్తు కొట్టేశారు. మరొకరు ఏకంగా 8 ఏళ్ల తర్వాత మళ్లీ టీమ్ ఇండియా గడపతొక్కారు. ఇద్దరూ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి టెస్టులో చోటు దక్కించుకున్నారు. కానీ, ఇద్దరూ అనూహ్యంగా నిరాశపరిచారు. ఆ ఇద్దరే టీమ్ ఇండియా బ్యాటర‍్లు సాయు సుదర్శన్, కరుణ్ నాయర్. ఇంగ్లండ్ తో తొలి టెస్టు తొలి రోజు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఔటైన అనంతరం వచ్చిన సాయి సుదర్శన్ కేవలం నాలుగు బంతులే ఆడాడు. ప్రత్యర్థి కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఆన్ సైడ్ వెళ్తున్న బంతిని వెంటాడి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. టెస్టుల్లో ఇలా ఔట్ కావడం మరీ పేలవం. అయితే, సాయి క్రీజులోకి దిగుతూనే బాగా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించాడు. దీనికితోడు ఓ బంతిని ప్యాడ్లకు తగిలించుకున్నాడు. అదే ఒత్తిడిలో లెగ్ సైడ్ బంతిని వేటాడి వికెట్ ఇచ్చాడు. సాయి సుదర్శన్ ను ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇక టెస్టుల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా 8 ఏళ్ల కిందటనే రికార్డును అందుకున్న కరుణ్ నాయర్.. ఆ తర్వాత టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. మళ్లీ ఎన్నో తిప్పలు పడి జట‍్టులోకి వచ్చాడు. ఈ కష్టాల్లో రెండేళ్ల కిందట కేరళలో బోటు తిరగబడిన ప్రమాదం కూడా ఉంది. మిస్టర్ క్రికెట్ ఒక్క చాన్స్ అంటూ వేడుకున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు ఏకంగా విరాట్ కోహ్లి వంటి దిగ్గజం స్థానంలో బరిలో దిగే దశకు వచ్చాడు.అయితే, ఇంగ్లండ్‌తో తొలి టెస్టు రెండో రోజు కరుణ్ విఫలమయ్యాడు. సుదర్శన్ లాగానే నాలుగే బంతులు ఆడి ఔటయ్యాడు. అయితే,ఇందులో కొంత బ్యాడ్ లక్ కూడా ఉంది. ఆఫ్ స్టంప్‌కు దూరంగా పడిన బంతిని డ్రైవ్ ఆడబోయిన కరుణ్.. ఇంగ్లండ్ ఫీల్డర్ ఓలీ పోప్ పట్టిన అద్భుత క్యాచ్‌కు డకౌట్‌గా వెనుదిరిగాడు.
కాగా, సాయి, కరుణ్ స్థానాలకు ఇప్పుడే ప్రమాదం ఏమీ లేదు. వారికి ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆడే చాన్స్ కూడా రావొచ్చు. ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన వీరిద్దరికీ
తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కొచ్చు. కాకపోతే, ఒత్తిడిని ఎదుర్కొనడం ఎలానో సాయి తెలుసుకోవాలి. కరుణ్ చాలా సీనియర్. అతడు పుంజుకునే వీలుంది. కాకపోతే.. ఒకరి అరంగేట్రం, మరొకరి పునరాగమన సున్నాతో మొదలుకావడమే అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమ్ ఇండియా చివరి 7 వికెట్లను 41 పరుగులకే కోల్పోయింది. కరుణ్, సాయి చెరో 30 కొట్టినా జట్టు స్కోరు 550 దగ్గరకు వెళ్లేది. ఇక టీమ్ ఇండియా 471 పరుగుల తొలి ఇన్నింగ్స్‌కు సమాధానంగా ఇంగ‍్లండ్ శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది.