రోహిత్ శర్మ షేప్ ఔట్.. వన్డే కెప్టెన్ గానే కాదు.. ఆటగాడినూ ఔట్
రోహిత్ శర్మ పర్ఫెక్ట్ వన్డే క్రికెటర్. ఈ ఫార్మాట్ లో ఎవరికీ సాధ్యం కాని విధంగా మూడు డబుల్ సెంచరీలు చేయడం అంటే మామూలు మాటలు కాదు.
By: Tupaki Desk | 11 Aug 2025 2:00 AM ISTఅంతర్జాతీయ టి20ల నుంచి 14 నెలల కిందటే రిటైర్.. టెస్టు కెప్టెన్ గా మూడు నెలల కిందట రిటైర్.. ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే...! కానీ, కెప్టెన్ గా కాదు కదా..? కనీసం ఆటగాడిగానూ జట్టులో చోటు దక్కించుకునే పరిస్థితిలో లేడు టీమ్ ఇండియా సారథి రోహిత్ శర్మ. కారణం.. ఫామ్ మాత్రమే కాదు.. ఫిట్ నెస్.
వన్డేల మొనగాడు
రోహిత్ శర్మ పర్ఫెక్ట్ వన్డే క్రికెటర్. ఈ ఫార్మాట్ లో ఎవరికీ సాధ్యం కాని విధంగా మూడు డబుల్ సెంచరీలు చేయడం అంటే మామూలు మాటలు కాదు. రోహిత్ అత్యధిక స్కోరు 264. ఓ సాధారణ జట్టు మొత్తం ఓవర్లు ఆడి చేసే స్కోరిది. వన్డే క్రికెట్లో పది వేలకు పైగా పరుగులు సాధించిన అతికొద్ది మంది క్రికెటర్లలో రోహిత్ ఒకడు. టీమ్ ఇండియాను వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేర్చడమే కాదు.. చాంపియన్స్ ట్రోఫీ విజేతగానూ నిలిపాడు.
ఇక మెన్ ఇన్ బ్లూలో చూడలేమా..?
రోహిత్ కు ఇంగ్లండ్ పర్యటనకు ముందే టీమ్ ఇండియా సెలక్టర్లు టెస్టు జట్టులో చోటు లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో అతడు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కూడా ఇదే మాట చెప్పగా అతడూ రిటైర్ అయ్యాడు. ఈ ఇద్దరు చాంపియన్ ప్లేయర్లు మాత్రం వన్డేల్లో కొనసాగే ఉద్దేశంలో ఉన్నారు. కోహ్లి తాజాగా లండన్ లో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. వన్డే కెప్టెన్ కూడా అయిన రోహిత్ ఇటీవల ఇంగ్లండ్ వెళ్లాడు. అక్కడ టీమ్ ఇండియా టెస్టు మ్యాచ్ లు చూశాడు. తాజాగా ముంబైకి తిరిగివచ్చాడు.
అది రోహితేనా?
ముంబై ఎయిర్ పోర్ట్ లో రోహిత్ శర్మ తన కూతురును తీసుకుని బయటకు వస్తున్న ఫొటోలు వైరల్ గా మారాయి. కారణం.. అతడు శరీరంపై పూర్తిగా అదుపు తప్పడమే. రోహిత్ కు పొట్ట ఉందనేది ఎప్పటినుంచో ఉన్న విమర్శ. అతడికి మ్యాచ్ ఫిట్ నెస్ లేదని విమర్శకులు ఆరోపించేవారు. వీటిని నిజం చేసేలా ఫిట్ నెస్ మొత్తం తప్పినట్లు కనిపించాడు రోహిత్. ఐపీఎల్ లో ఎలిమినేటర్ తర్వాత రెండు నెలల నుంచి రోహిత్ పోటీ క్రికెట్ ఆడడం లేదు. దీంతోపాటు ఫిట్ నెస్ పైనా శ్రద్ధ పెట్టినట్లు లేడు. అందుకే విపరీతంగా బరువు పెరిగినట్లు కనిపిస్తున్నాడు.
ఆస్ట్రేలియా సిరీస్ కు కష్టమే?
టీమ్ ఇండియా అక్టోబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. మూడు వన్డే మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇప్పటికి సాంకేంతికంగా వన్డే కెప్టెన్ రోహిత్. కానీ, ఆస్ట్రేలియా టూర్ కు అతడిని జట్టులోకి ఎంపిక చేయడమే కష్టం అనిపిస్తోంది. ఇక వన్డే ప్రపంచ కప్ (2027)నకు రోహిత్ ను కొనసాగించడం మరింత కష్టం. అప్పటికి 40 ఏళ్లు వచ్చే రోహిత్ కు వయసు కూడా ప్రతిబంధకంగా మారుతుంది.
రోహిత్, కోహ్లీలు దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే టోర్నీలో ఆడాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం. ఈ టోర్నీ డిసెంబరులో జరగనుంది.