కొత్త ’బంతి’ కోసం ’పంతం’.. టీమ్ ఇండియా క్రికెటర్ పై రిఫరీ ఆంక్షలు?
టీమ్ ఇండియా క్రికెటర్లు క్రమశిక్షణ తప్పడం అరుదు... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కాస్త పంతానికి పోయినా.. అది లీగ్ క్రికెట్, పైగా మనదే కాబట్టి ఏమీ కాదు.
By: Tupaki Desk | 23 Jun 2025 3:42 PM ISTటీమ్ ఇండియా క్రికెటర్లు క్రమశిక్షణ తప్పడం అరుదు... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కాస్త పంతానికి పోయినా.. అది లీగ్ క్రికెట్, పైగా మనదే కాబట్టి ఏమీ కాదు. అంతర్జాతీయ మ్యాచ్ లలో మాత్రం మనవాళ్లు కాస్త పద్ధతిగానే ఉంటారు. అయితే, ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో మాత్రం మన క్రికెటర్లు అసహనానికి గురవతున్నారు. పిచ్ నుంచి సహకారం లేక వికెట్ దక్కకపోవడంతో పేస్ బౌలర్లు విసుగెత్తుతున్నారు. ఈ క్రమంలో ప్రవర్తనలో అదుపు తప్పుతున్నారు.
ఇంగ్లండ్ తో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో అద్భుత సెంచరీ కొట్టిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ కూడా మ్యాచ్ లో తీవ్ర అసహనానికి గురయ్యాడు. అంపైర్ తో కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఇది టీవీలో మ్యాచ్ చూస్తున్న అందరికీ అర్థమైపోయింది. ఇంతకూ ఏం జరిగిందంటే..?
హెడింగ్లీలో జరుగుతున్న తొలి టెస్టులో ఆదివారం బంతి పాతబడినా ఎంతకూ మార్చకపోవడంపై భారత ఆటగాళ్లు అసహనానికి గురయ్యారు. ఇక పంత్.. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ వేసిన 61వ ఓవర్ లో బంతి ఆకారంపై అంపైర్ పాల్ రీఫెల్ ను సంప్రదించాడు. అప్పటికే ఇంగ్లండ్ బ్యాటర్ బ్రూక్ బౌండరీ బాదడంతో.. బంతిని చూసి మార్చాల్సిందిగా అంపైర్ ను కోరాడు. అయితే, అంపైర్ బాల్ షేప్ ను బాల్ గేజ్ ద్వారా పరిశీలించి.. బాగానే ఉందని మార్చాల్సిన పని లేదని చెప్పి పంత్ చేతికి ఇచ్చాడు. దీనిపై పంత్ ఆగ్రహంతో బంతిని బౌలర్ కేసి విసిరేశాడు. ఈ సీన్ చూసినవారికి పంత్ అంపైర్ ను తీసిపారేసినట్లు కనిపించింది.
అందుకే అతడిపై ఐసీసీ చర్యలు తీసుకునే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అని తేలితే.. చర్యలు తప్పవు. ఆన్ ఫీల్డ్ లో అంపైర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం, మ్యాచ్ లో ఆటగాడు, సహాయ సిబ్బంది, అంపైర్, రిఫరీ మీదకు బంతి, నీటి సీసా, లేదా ఏ వస్తువునైనా విసిరేయడం నేరం. అందుకే పంత్ పై చర్యలు ఉంటాయని చెబుతున్నారు. చూద్దాం.. మరి మందలింపుతో సరిపెడతారా... మ్యాచ్ ఫీజులో కోత పెడతారా? లేక మ్యాచ్ నిషేధం విధిస్తారా.