ఏడో స్థానంలో బ్యాటింగ్.. 27 కోట్లకు సున్నా పరుగులా? రిషబ్ పంత్ ఆటతీరుపై తీవ్ర నిరాశ!
ఐపీఎల్‌లో ఏకంగా 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన రిషబ్ పంత్, తన ధర స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు.
By: Tupaki Desk | 23 April 2025 11:35 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా.. పంత్ భయ్యాగా అభిమానులు ముద్దుగా పిలుచుకునే రిషబ్ పంత్.. ప్రస్తుత సీజన్‌లో తన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఒకప్పుడు విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా, ఎలాంటి బౌలింగ్‌నైనా చీల్చి చెండాడగల సత్తా ఉన్న ఆటగాడిగా పేరుపొందిన పంత్.. ఈ సీజన్‌లో పూర్తిగా తేలిపోతున్నాడు. అతని ఆటతీరు రోజురోజుకు దిగజారిపోవడం అభిమానులను, క్రికెట్ విశ్లేషకులను కలవర పెడుతోంది.
- ఖరీదైన ఆటగాడు.. దారుణమైన ప్రదర్శన
ఐపీఎల్‌లో ఏకంగా 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన రిషబ్ పంత్, తన ధర స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. గత సీజన్‌లో కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన పంత్.. ఈసారి బ్యాట్స్‌మెన్‌గా కనీస ప్రభావం చూపలేకపోతున్నాడు. అసలు రిషబ్ పంత్‌కు ఏమైంది? ఎందుకు ఇలా ఆడుతున్నాడు? నిరుడు కెప్టెన్‌గా అద్భుతంగా ఆడిన పంత్, ఈ సీజన్‌లో ఇలాంటి దారుణమైన ఫామ్‌తో ఎందుకు సతమతమవుతున్నాడు? సంజీవ్ గోయంకతో ఏమైనా సమస్యలు ఉన్నాయా? వంటి ప్రశ్నలు అభిమానుల మదిలో మెదులుతున్నాయి.
-ఏడో స్థానంలో వచ్చి సున్నా.. ఆందోళనకరమైన బ్యాటింగ్ ఆర్డర్
తాజాగా లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ ప్రదర్శన అతని అభిమానులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టి లక్నోను కట్టడి చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి వన్‌డౌన్‌లో లేదా కనీసం నాలుగో స్థానంలోనైనా బ్యాటింగ్‌కు రావాల్సిన పంత్.. అబ్దుల్ సమద్ (4), మిల్లర్ (5), ఆయుష్ బదోని (6) వంటి ఆటగాళ్లను తన కంటే ముందు పంపించి, ఏకంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. డగౌట్‌లో ప్యాడ్లు కట్టుకొని సిద్ధంగా ఉన్నప్పటికీ, జట్టుకు అత్యవసరమైన సమయంలో అతను ముందుకు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చివరకు ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఖాతా తెరవకుండానే, సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. జట్టు కెప్టెన్‌గా, అత్యంత ఖరీదైన ఆటగాడిగా జట్టును ముందుండి నడిపించాల్సిన పంత్.. ఇలా వెనుకబడి బ్యాటింగ్‌కు వచ్చి సున్నా పరుగులకే అవుట్ అవడం తీవ్ర నిరాశను కలిగించింది.
-ఆత్మవిశ్వాసం పూర్తిగా లోపించిందా?
రిషబ్ పంత్ ఆటతీరును, అతని బాడీ లాంగ్వేజ్‌ను చూస్తుంటే అతనిలో ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గిపోయిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎలాంటి ఒత్తిడిలోనైనా భారీ షాట్లు ఆడగల పంత్.. ప్రస్తుతం కనీసం క్రీజులో నిలబడటానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన అత్యంత ఖరీదైన ఆటగాడు ఇలా ఆడటం జట్టు యాజమాన్యాన్ని, అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
-జహీర్ ఖాన్ తో గొడవకు దిగిన పంత్.. మైదానంలో ఫైర్
ఇక 7వ స్థానంలో బ్యాటింగ్ కు తనను పంపండంపై మెంటర్ జహీర్ ఖాన్ తో మైదానంలోనే పంత్ గొడవకు దిగడం వీడియోల్లో కనిపించింది. జహీర్ తో గొడవకు దిగి పక్కకు వెళ్లి పిచ్ ను తంతూ తన ఆగ్రహాన్ని పంత్ వెళ్లగక్కాడు. మైదానంలోనూ ఫీల్డర్లు, బౌలర్లపై అరుస్తూ కోపంతో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్ లో తన పాత టీం ఢిల్లీతో కావడం.. ఓనర్ గోయెంకా ప్రెషర్ తో ఇలా పంత్ డిఫెన్స్ లో పడిపోయాడా? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మొత్తంగా, రిషబ్ పంత్ ప్రస్తుత ఫామ్ అతని క్రికెట్ కెరీర్‌కు ఒక పరీక్షా సమయం అని చెప్పాలి. త్వరలోనే పంత్ తన పూర్వ వైభవాన్ని అందుకుని, భారీ షాట్లతో అభిమానులను అలరిస్తాడని ఆశిద్దాం.