సోమర్‌సాల్ట్ కాదు..డెలీ అలీ..పంత్ సెలబ్రేషన్.. గావస్కర్‌కు షాక్
వాస్తవానికి రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ తర్వాత పంత్ సోమర్‌సాల్ట్ చేస్తాడని ఊహించారు.
By: Tupaki Desk | 24 Jun 2025 8:57 AM ISTచాంపియన్స్ ట్రోఫీలో తుదిజట్టులో చోటుదక్కని... ఐపీఎల్‌లో పేలవంగా ఆడిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్.. ఇంగ్లండ్ టూర్ తొలి టెస్టులోనే దుమ్మురేపాడు.. రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేశాడు. తద్వారా జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్‌గా రికార్డులకు ఎక్కాడు. అయితే, ఐపీఎల్‌లో సెంచరీ అనంతరం పంత్ సోమర్‌సాల్ట్ (తెలుగులో పిల్లేరు గంతులు) విన్యాసం చేశాడు. దానినే తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ తర్వాత కూడా ప్రదర్శించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాక మాత్రం రిపీట్ చేయలేదు. వేరే రీతిలో స్పందించాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేం సెలబ్రేషన్ అనే చర్చ జరుగుతోంది.
వాస్తవానికి రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ తర్వాత పంత్ సోమర్‌సాల్ట్ చేస్తాడని ఊహించారు. కానీ, అతడు చేతి గ్లవ్ తీసి.. హెల్మెట్ తీసి.. చూపుడు వేలు, బొటన వేలిని కలిపి సున్నాలా.. అందులోంచి చూశాడు. అయితే, ఇదేమీ సాధారణ సెలబ్రేషన్ కాదు.. స్పోర్ట్స్‌లో చాలా ఫేమస్. దీనిని డెలీ అలీ సెలబ్రేషన్ అంటారు. ఎవరీ డెలీ అలీ అంటే.. ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్. ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ టోటెన్‌హమ్ హాట్‌స్పర్‌కు ఆడుతున్న సమయంలో.. 2018లో డెలీ అలీ గోల్ కొట్టి ఇప్పుడు పంత్ తరహాలో సెలబ్రేషన్ చేశాడు. నాడు న్యూక్యాజిల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ విధంగా చేశాక దానికి ఆయన పేరే పెట్టారు. ఇలా చేయడం అంటే ‘‘ఓకే’’ అని అర్థం అట. నాడు పెద్ద సంచలనంగా మారిన ఈ సెలబ్రేషన్‌తో చాలామంది వేలిని మడిచి కళ్ల ముందు పెట్టుకుని చూడడానికి ట్రెండ్‌లా చేశారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. తర్వాత పెద్దగా వెలుగులోకి రాలేదు. తాజాగా పంత్.. ‘డెలీ అలీ’ని బయటకు తీశాడు. అతడు ఎందుకు ఇలా చేశాడనేది తెలియాల్సి ఉంది.
పంత్ తనవద్ద మూడు రకాల సెలబ్రేషన్స్ ఉన్నాయని చెబుతాడు. సెంచరీ చేశాక సోమర్ సాల్ట్, డెలీ అలీని ప్రదర్శించాడు. మరి.. ఆ మూడోది ఏమిటో...? రెండో టెస్టులో సెంచరీ చేశాక చూపిస్తాడేమో?
ఇక గత ఆస్ట్రేలియా పర్యటనలో పేలవ షాట్‌తో ఔటైన పంత్‌ను బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్రంగా తిట్టాడు. స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్ అని మండిపడ్డాడు. అదే గావస్కర్ ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పంత్ సెంచరీ చేశాక సూపర్ సూపర్ అని కొనియాడాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేయడంతో గావస్కర్ మైదానం దగ్గరికి వచ్చాడు. పంత్‌ను సోమర్‌సాల్ట్ విన్యాసం ప్రదర్శించాలని కోరాడు. కానీ, అతడు.. ఇప్పుడు కాదు.. ఆ తర్వాత అంటూ సున్నితంగా తిరస్కరించాడు. డెలీ అలీ విన్యాసం చేశాడు.