Begin typing your search above and press return to search.

రిషభ్ పంత్.. 2 సెంచరీలు.. అనేక రికార్డులు.. ఒక ఐసీసీ డీమెరిట్

అయితే, ఇన్ని రికార్డులు సాధించిన పంత్ మ్యాచ్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనను ఎదుర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 6:08 PM IST
రిషభ్ పంత్.. 2 సెంచరీలు.. అనేక రికార్డులు.. ఒక ఐసీసీ డీమెరిట్
X

ఇంగ్లండ్ తో లీడ్స్ లో జరుగుతున్న తొలి టెస్టు డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. పిచ్ పరిస్థితుల కారణంగా ఎంత ప్రయత్నించినా భారత బౌలర్లకు వికెట్లు దక్కడం లేదు. బుమ్రా వంటి బౌలర్ 144 కిలోమీటర్ల వేగంతో బంతులేసినా వికెట్ దక్కడం లేదు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ తరఫున అత్యద్భుతం అనదగ్గ మరో ఆటగాడు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. టీమ్ ఇండియా వికెట్ కీపర్ విదేశాల్లో సెంచరీ చేయడమే చాలా ఎక్కువ. అలాంటిది తొలి టెస్టులో పంత్ రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు కొట్టి అరుదైన రికార్డులు మూటగట్టుకున్నాడు.

ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు కొట్టిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాటర్ పంత్. ప్రపంచంలో జింబాబ్వే వికెట్ కీపర్ బ్యాటర్ ఆండీ ఫ్లవర్ తర్వాత రెండో వికెట్ కీపర్. పంత్.. తొలి ఇన్నింగ్స్ లో 134, రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఆండీ ఫ్లవర్ 2001లో దక్షిణాఫ్రికాపై నెలకొల్పిన రికార్డును పంత్ దాదాపు పాతికేళ్ల తర్వాత సమం చేశాడు.

ఇక భారత బ్యాటర్లలో దిగ్గజాలు గావస్కర్ ఒకే టెస్టులో రెండు సెంచరీలు మూడుసార్లు చేశాడు. రాహుల్ ద్రవిడ్ రెండుసార్లు ఈ ఘనతను సాధించాడు. విజయ్ హజారే (1948), రోహిత్ శర్మ (2019), అజింక్య రహానే (2015), కోహ్లి (2014) ఒకే టెస్టులో ’డబుల్’ సెంచరీలు కొట్టారు. మొత్తమ్మీద పంత్.. ఏడో టీమ్ ఇండియా బ్యాటర్ గా నిలిచాడు.

అయితే, ఇన్ని రికార్డులు సాధించిన పంత్ మ్యాచ్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనను ఎదుర్కొన్నాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8ను ఉల్లంఘించినందుకు అతడికి ఒక డీ మెరిట్ పాయింట్ ఇచ్చారు. అంపైర్ నిర్ణయంతో ఏకీభవించనందుకు ఈ డి మెరిట్ ఇచ్చారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా 61వ ఓవర్ లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ బౌలింగ్ లో బంతి ఆకారంపై అంపైర్ పాల్ రీఫెల్ కు నివేదించాడు పంత్. అయితే, అంపైర్ బాల్ గేజ్ తో కొలిచి బాగానే ఉందని చెప్పి పంత్ కు బంతిని తిరిగిచ్చాడు. కానీ, పంత్ ఆగ్రహంగా బంతిని విసిరేశాడు. చివరకు పంత్ తన తప్పు ఒప్పుకోవడంతో ఐసీసీ రిఫరీ రిచీ రిచర్డ్ సన్ ఆంక్షలకు ఒప్పుకొన్నాడని ఐసీసీ తెలిపింది.

పంత్ ఐసీసీ లెవల్ 1 కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు తక్కువ శిక్ష (మందలింపు)తో సరిపెట్టారు. ఒక్క డిమెరిట్ పాయింట్ విధించారు. 24 నెలల కాలంలో నాలుగు డిమెరిట్ పాయింట్లు అయితే సస్పెన్షన్ విధిస్తారు. అందుకని బహుపరాక్ పంత్ అని అనాల్సిందే.