4 నెలలు.. 7 మ్యాచ్ లు.. 534 రన్స్.. మహిళా క్రికెట్ శక్తికి ‘ప్రతీక’
నాలుగు నెలల్లో ఓ మహిళా క్రికెటర్ సాధించిన స్కోర్లివి.. ప్రతి మ్యాచ్ లోనూ ఎంతో నిలకడగా ఆడుతూ వస్తోన్న ఆమె భారత క్రికెటర్ అంటే ఆశ్చర్యపోవాల్సిందే.
By: Tupaki Desk | 29 April 2025 9:14 AM IST76, 18, 89, 67, 154, 50 నాటౌట్.. ఇవి పురుషుల క్రికెట్లో గొప్ప బ్యాట్స్ మన్ పరుగులు కావు..
7 మ్యాచ్ లు 534 పరుగులు.. ఇవి మేటి క్రికెటర్ రికార్డులు కావు..
నాలుగు నెలల్లో ఓ మహిళా క్రికెటర్ సాధించిన స్కోర్లివి.. ప్రతి మ్యాచ్ లోనూ ఎంతో నిలకడగా ఆడుతూ వస్తోన్న ఆమె భారత క్రికెటర్ అంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ప్రతీక రావల్.. భారత మహిళా క్రికెట్ లో ఇప్పుడో సంచలనం. డిసెంబరు 22న అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ప్రతీక ఏడు మ్యాచ్ లు ఆడి తనదైన ముద్ర వేసింది.
నిలకడలో మిథాలీ రాజ్ లా, దూకుడులో హర్మన్ ప్రీత్ కౌర్ లా రాణిస్తూ వస్తున్న ప్రతీక స్వస్థలం ఢిల్లీ. సహజంగానే ఢిల్లీ బ్యాటర్లలో ఉండే దూకుడు ఈమె సొంతం.
ఓపెనర్ అయిన ప్రతీక తొలి మ్యాచ్ లోనే వెస్టిండీస్ పై 69 బంతుల్లో 40 పరుగులు చేసింది. తర్వాతి ఆరు మ్యాచ్ లలో ఆమె స్కోర్లు.. 76, 18, 89, 67, 154, 50 నాటౌట్. సగటు 82.33.
కొంతకాలంగా భారత మహిళా క్రికెట్ బ్యాటింగ్ లో నిలకడ కొరవడింది. ప్రతీక రూపంలో ఇప్పుడు సరైన బ్యాటర్ దొరికింది. మంధానతో కలిసి ఈమె చక్కటి ఇన్నింగ్స్ ఆడుతోంది. టెక్నిక్, దూకుడు, టైమింగ్, ఓపిక అన్నీ ఉన్న ప్రతీక.. బౌలింగ్ లోనూ ఓ చేయి వేస్తుంది.
ఆఫ్ స్పిన్నర్ అయిన ప్రతీక.. ఫీల్డింగ్ లోనూ చురుకే. ఇప్పటివరకు వన్డేలే ఆడిన ప్రతీకను త్వరలో టి20లకూ సెలక్ట్ చేయొచ్చు.
ఇక మొన్నటి మహిళల ప్రీమియర్ లీగ్ వేలం నాటికి ప్రతీక పేరు పెద్దగా తెలియదు. వచ్చేసారి లీగ్ లోకి ఈమె ఎంట్రీ ఖాయం.
ప్రతీక దూకుడు మరో ఓపెనర్ షెఫాలీ వర్మకు చేటు చేస్తోంది. దూకుడుగా ఆడే షెఫాలీని ఫామ్ కోల్పోవడంతో వన్డేల నుంచి తప్పించారు. ప్రతీకను తీసుకున్నారు. ఇకమీదట షెఫాలీ మళ్లీ జట్టులోకి రావాలంటే ప్రతీకను మించి ప్రతిభ కనబరచాల్సిందే.