ఉగ్రదాడి.. నేటి ఐపీఎల్ మ్యాచ్ పై బీసీసీఐ కీలక నిర్ణయం!
జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 April 2025 4:24 PM ISTజమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ దాడిని దేశంలోని సినీనటులు, క్రికెటర్లు, నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు అంతా ముక్త కంఠంతో ఖండించారు. ఈ సందర్భంగా.. ఎక్స్ వేదికగా పొస్టులు పెట్టారు. మరోపక్క నేడు జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ విషయంలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అవును... ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా ఉప్పల్ మైదానం వేదికగా నేడు.. సన్ రైజర్స్ హైదరాబాద్ - ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ విషయంలో బీసీసీఐ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా... పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపనుంది.
ఇందులో భాగంగా... సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో పాటు అంపైర్లు నల్ల బ్యాడ్జ్ లను ధరించనున్నారు. ఇదే సమయంలో ఒక నిమిషం పాటు ప్రేక్షకులతో పాటు అందరూ మౌనం పాటించనున్నారు. ఇదే సమయంలో ఈ మ్యాచ్ లో చీర్ లీడర్స్ కు అనుమతి లేదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి!
కాగా... 2019లో పుల్వామా దాడి ఘటన నేపథ్యంలోనూ అప్పటి 12వ సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బీసీసీఐ నిర్వహించలేదు. నాడు ఆ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహణకు అయ్యే డబ్బును.. బాధిత కుటుంబాల సంక్షేమానికి కేటాయించిన సంగతి తెలిసిందే. మరోపక్క తాజా ఘటనపై సోషల్ మీడియా వేదికగా టీమిండియా క్రికెటర్లు బాధితులకు మద్దతుగా నిలిచారు.