Begin typing your search above and press return to search.

7/5/3... రిషభ్‌ పంత్‌.. స్టుపిడ్‌ కాదు టీమ్‌ ఇండియా ఎక్స్‌ ఫ్యాక్టర్‌

పరిస్థితి అలా ఉండగా.. ఇంగ్లండ్‌ పర్యటనకు పంత్‌ను వైస్‌ కెప్టెన్‌ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విమర్శలకు కూడా తావిచ్చింది

By:  Tupaki Desk   |   21 Jun 2025 7:21 PM IST
7/5/3... రిషభ్‌ పంత్‌.. స్టుపిడ్‌ కాదు టీమ్‌ ఇండియా ఎక్స్‌ ఫ్యాక్టర్‌
X

టి20ల్లో భాగంకాదు.. పైగా ఐపీఎల్‌లో తీవ్రంగా విఫలమయ్యాడు.. వన్డేల్లోనూ దాదాపు పక్కనపెట్టారు.. టెస్టులకు మాత్రం ఎందుకు..? ప్రస్తుత పరిస్థితుల్లో జట్టులో చోటే కష్టమైన ఆటగాడికి వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు కూడా ఇచ్చారు...! ఇవీ.. టీమ్‌ ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ విషయంలో వచ్చిన విమర్శలు. గత ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో పంత్‌ అడ్డదిడ్డం షాట్లు టెస్టు మ్యాచ్‌నే చేజార్చాయి. దీంతో బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘‘స్టుపిడ్‌.. స్టుపిడ్‌.. స్టుపిడ్‌’’ అంటూ కామెంట్రీ రూమ్‌ నుంచి మండిపడ్డారు. గావస్కర్‌ ఆగ్రహంలో అర్దం ఉన్నా.. పంత్‌ ఆటతీరే అంత. అయితే, ఈ సిరీస్‌ తర్వాత పంత్‌ను చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసినా మ్యాచ్‌ చాన్‌‍్స ఇవ్వలేదు. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా ఉన్న అతడు జట్టును ప్లేఆఫ్స్‌ చేర్చలేకపోయాడు. చివరి మ్యాచ్‌లో సెంచరీ మినహా బ్యాట్స్‌మన్‌గానూ రాణించలేదు.

పరిస్థితి అలా ఉండగా.. ఇంగ్లండ్‌ పర్యటనకు పంత్‌ను వైస్‌ కెప్టెన్‌ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. విమర్శలకు కూడా తావిచ్చింది. కాగా, వాటన్నిటికీ చెక్‌ పెడుతూ పంత్‌ సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్‌.. (134; 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీ చేశాడు. తొలి రోజు 65 పరుగులు చేసిన పంత్ శనివారం 146 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విశేషం ఏమంటే.. 99 పరుగుల వద్ద ఉండగా ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ షోయబ్ బషీర్ వేసిన బంతిని (99.1) సిక్స్ కొట్టి టెస్టుల్లో తన ఏడో సెంచరీ అందుకున్నాడు పంత్‌. దీంతో మాజీ కెప్టెన్‌ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో అత్యధిక (7) సెంచరీలు చేసిన భారత కీపర్‌గా నిలిచాడు. 27 ఏళ్ల పంత్ టెస్టుల్లో ఏడు సెంచరీలు చేయగా.. ఐదు విదేశాల్లో చేసినవే. మూడు ఇంగ‍్లండ్‌లో చేసినవే కావడం విశేషం.

సెంచరీ తర్వాత తనదైన శైలిలో పంత్‌ ‘‘సోమర్‌సాల్ట్‌’’ విన్యాసాన్ని ప్రదర్శించాడు. దీనినే తెలుగులో పిల్లేరు గంతులు అంటారు. కాగా, పంత్‌ మొత్తం 178 బంతులాడి 134 పరుగులు చేశాడు. జోష్‌ టంగ్‌ బౌలింగ్‌లో పంత్‌ ఔటయ్యాక వికెట్లు చకచకా పడిపోయాయి. దీంతో టీమ్‌ ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ (101), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (147) తొలి రోజు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.

కొసమెరుపుః లీడ్స్‌ల్‌ టీమ్‌ ఇండియా తరఫున ముగ్గురు సెంచరీలు చేయడం ఇది రెండోసారి. 2002 టూర్‌లో నాటి కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ (128), వైస్‌ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (148), సచిన్‌ టెండూల్కర్‌ (193) సెంచరీలు కొట్టారు. ఇప్పుడు కూడా కెప్టెన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌ పంత్‌ సెంచరీలు చేయడం విశేషం.