సిరాజ్ మహా నారాజ్.. తొలి సిరీస్ లోనే కెప్టెన్ పై గుర్రు
ముఖ్యంగా చివరి-ఐదో టెస్టులో సిరాజ్ పోరాటం అద్భుతం అనే చెప్పాలి. ఇప్పుడు బుమ్రాను మించిన పేసర్ గా సిరాజ్ ను అందరూ చూస్తున్నారు.
By: Tupaki Desk | 9 Aug 2025 8:00 PM ISTమొహమ్మద్ సిరాజ్... ఇంగ్లండ్ పర్యటన తర్వాత అతడి స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది... ఆరేళ్ల నుంచి టెస్టు జట్టులో ఉంటున్నా.. అంతకు కొన్నేళ్ల ముందే టి20, వన్డే జట్టులోకి వచ్చినా... టెస్టుల్లో విదేశాల్లో మంచి ప్రదర్శనలు చేసినా సిరాజ్ మొన్నటివరకు రెండో ప్రధాన బౌలర్ గానే చూశారు. అయితే, సహచర మేటి పేసర్ బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో ఇంగ్లండ్ లో సిరాజ్ అలుపెరగని పోరాటం అందరికీ ఆకట్టుకుంది. ఐదుకు ఐదు టెస్టులు.. ఏకధాటిగా ఓవర్లు.. మొత్తం మీద 23 వికెట్లతో సిరీస్ టాపర్ గా నిలిచాడు సిరాజ్. ముఖ్యంగా చివరి-ఐదో టెస్టులో సిరాజ్ పోరాటం అద్భుతం అనే చెప్పాలి. ఇప్పుడు బుమ్రాను మించిన పేసర్ గా సిరాజ్ ను అందరూ చూస్తున్నారు.
ఒద్దిక ఎక్కువే.. కానీ, ఆగ్రహమూ అధికమే..
ఆటో డ్రైవర్ కుమారుడైన సిరాజ్ కు తన మూలాలు తెలుసు. అందుకే, ఎంత ఎదిగినా ఒద్దికగా ఉంటాడు. తన వయసు వారైనా సహచరులను భాయ్ అనే పిలుస్తాడు. అయితే, మైదానంలో మాత్రం వందకు వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికే ఇష్టపడతాడు. అంతెందుకు..? ఇటీవలి ఐదో టెస్టులో ఇంగ్లండ్ చివరి వికెట్ గా ఉన్న వోక్స్ ను అత్యంత తేలికగా రనౌట్ చేసే అవకాశాన్ని వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ జారవిడిచాడు. ఫీల్డింగ్ లో ఆలస్యంగా కదలడంతో మరో రనౌట్ మిస్ అయింది. ఆ సమయంలో సిరాజ్ తీవ్ర ఆగ్రహంగా కనిపించాడు.
మొదటి సిరీస్ లోనే తానేంటో చూపాడు..
టీమ్ ఇండియాలోకి 2017లో టి20లకు, 2019లో వన్డేలకు ఎంపికయ్యాడు సిరాజ్. 2020-21 ఆస్ట్రేలియా టూర్ అతడికి మొదటి టెస్టు సిరీస్. అయితే, అప్పుడు రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. దీంతో వైస్ కెప్టెన్ అజింక్య రహానే సారథ్యం వహించాడు. ఆ సిరీస్ లో సిరాజ్ మంచి ప్రదర్శన కనబరిచి తన ఎంపిక సరైనదే అని చాటాడు.
కెప్టెన్ పైనే కోపం
2020-21 ఆస్ట్రేలియా సిరీస్ లో సిరాజ్ అప్పటి కెప్టెన్ అజింక్య రహానే పైనే కోప్పడ్డాడంట. రహానే తనకు బంతిని ఆలస్యంగా ఇవ్వడం సిరాజ్ కు ఆగ్రహం తెప్పించిందట. ఈ విషయాన్ని రహానేనే స్వయంగా చెప్పాడు. ఇప్పటికీ అదే కోపం తనలో కనిపిస్తూ ఉంటుందని, అది తనలోని ఉత్తమ ప్రదర్శనను వెలుగులోకి తెచ్చేందుకే అని రహానే వివరించాడు. సిరాజ్ ను ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ అండర్సన్ తో పోల్చిన రహానే.. అతడిలాగానే సిరాజ్ కూడా తొలి బంతి నుంచే దూకుడు కనబరుస్తాడని తెలిపాడు. ఇంగ్లండ్ లో బుమ్రా లేకున్నా ఆ లోటు తెలియకుండా తన బాధ్యతను నెరవేర్చాడని కొనియాడాడు.