రో-కో కాదు.. టీమ్ ఇండియాలో కొత్త శకం.. దాని పేరు 'జై-శు'
శుక్రవారం తొలి టెస్టు.. టాస్ ఓడి బ్యాటింగ్.. రోహిత్-కోహ్లి లేరు.. కాస్త భయంగా మొదలైంది మన ఇన్నింగ్స్.. కానీ, 90 ఓవర్ల తర్వా చూస్తే ఇక తిరుగులేదని అనిపించే స్థాయికి వెళ్లింది.
By: Tupaki Desk | 21 Jun 2025 8:00 PM ISTఎలాంటి పరిస్థితుల్లోనైనా దాడి చేయగల కెప్టెన్ రోహిత్ శర్మ, అత్యంత ఒత్తిడిలోనూ చెక్కుచెదరకుండా ఆడే విరాట్ కోహ్లి.. ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్ మెన్ రిటైర్మెంట్ తో టీమ్ ఇండియా పరిస్థితి ఏమిటి?.. మరీ ముఖ్యంగా విదేశీ టెస్టు సిరీస్ లలో ఎలా ఆడగలదు..? అనే భయం అభిమానుల్లో నెలకొంది. నిన్నటివరకు ఇదే భావనలో ఉన్నవారంతా.. నేడు ఒక్కసారిగా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతకూ ఇంతలోనే ఏం జరిగింది...?
టీమ్ ఇండియాతో రోహిత్-కోహ్లిది 15 ఏళ్లకు పైగా బంధం. రో-కో అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ ఇద్దరూ ఒకేసారి టెస్టుల నుంచి రిటైర్ కావడం అంటే పూడ్చలేని లోటే. పైగా ఇంగ్లండ్ వంటి పెద్ద జట్టుతో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ కు వీరిద్దరూ లేకపోవడం మానసికంగానూ వెనుకంజ వేసేలా చేస్తుంది. కానీ, లీడ్స్ లో మొదలైన తొలి టెస్టు తొలి రోజు ఆట చూశాక ఇక మన దేశ క్రికెట్ కు ఢోకాలేదని తేలిపోయింది.
శుక్రవారం తొలి టెస్టు.. టాస్ ఓడి బ్యాటింగ్.. రోహిత్-కోహ్లి లేరు.. కాస్త భయంగా మొదలైంది మన ఇన్నింగ్స్.. కానీ, 90 ఓవర్ల తర్వా చూస్తే ఇక తిరుగులేదని అనిపించే స్థాయికి వెళ్లింది. దీనికి కారణం ఓపెనర్ యశస్వి జైశ్వాల్, కెప్టెన్ శుబ్ మన్ గిల్. ఇంగ్లండ్ గడ్డపై ఆడుతున్న తొలి టెస్టులోనే జైశ్వాల్ అదరగొట్టాడు. చేతి వేలు నొప్పి ఇబ్బంది పెడుతున్నా ఓపికగా ఆడి సెంచరీ కొట్టాడు. దూకుడుకు దూకుడు, నిలకడకు నిలకడ రెండూ చూపాడు. గాడితప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తూ ముచ్చటగా ఆడాడు.
ఇక కెప్టెన్ గా ఈ మ్యాచ్ తోనే బాధ్యతలు స్వీకరించిన గిల్.. తన అసాధారణ ప్రతిభను చూపాడు. చక్కటి టైమింగ్, అంతకుమించిన టెక్నిక్.. దానికి మించిన చెక్కుచెదరని డిఫెన్స్ తో గిల్ ఆసాంతం అడ్డుగోడలా నిలిచాడు.
రోహిత్ శర్మ లేని లోటును ఓపెనర్ జైశ్వాల్.. టెస్టుల్లో కోహ్లి స్థానం నంబరు 4లో వచ్చిన కెప్టెన్ గిల్ ఇద్దరూ సెంచరీలు బాదడంతో టీమ్ ఇండియా తొలి రోజే 359 పరుగులు చేసింది. అందుకే.. అభిమానులు ఇప్పుడు భారత క్రికెట్ లో జై(జైశ్వాల్)-శు(శుబ్ మన్) శకం ప్రారంభం అయిందని చెబుతున్నారు.