కర్మ ఫలితం.. ఇండియాకు ఆడాల్సినోడు.. యూపీ లీగ్ నుంచీ వేటు
మూడు నెలల కిందట అత్యంత ఖరీదైన లీగ్ ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టు ఆటగాడు.. ఇప్పుడు జైలుకెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఇదంతా కర్మ ఫలితం అనుకోవాలి.
By: Tupaki Desk | 11 Aug 2025 10:15 PM ISTఎక్కడి టీమ్ ఇండియా... ఎక్కడి ఉత్తర ప్రదేశ్ (యూపీ) లీగ్...? ఏమైనా పోలిక ఉందా అసలు.. ప్రపంచంలోనే మేటి జట్టుకు ఆడాల్సిన వాడు ఇప్పుడు లోకల్ గల్లీ లీగ్ స్థాయి టోర్నమెంట్ కు కూడా దూరమయ్యాడు. మూడు నెలల కిందట అత్యంత ఖరీదైన లీగ్ ఐపీఎల్ విజేతగా నిలిచిన జట్టు ఆటగాడు.. ఇప్పుడు జైలుకెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఇదంతా కర్మ ఫలితం అనుకోవాలి.
బాలికనా.. యువతినా?
యశ్ దయాల్.. దేశవాళీ క్రికెట్ లో పరిచయం అక్కర్లేని పేరు. మంచి ప్రతిభ ఉన్న పేసర్. పైగా ఎడమచేతివాటం. ఐపీఎల్, దేశవాళీల్లో చక్కటి ప్రదర్శనతో జాతీయ జట్టుకు ఎంపికయ్యేలా కనిపించాడు. కానీ, బాలిక/యువతిని లైంగికంగా వేధించిన ఆరోపణలతో ఇప్పుడు తీవ్ర చిక్కుల్లో పడ్డాడు. యూపీకి చెందిన యశ్ దయాల్ ను ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డు యూపీ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనకుండా సస్పెన్షన్ వేటు వేసింది. లీగ్ లో దయాల్ గోరఖ్ పూర్ లయన్స్ కు ఆడుతున్నాడు. రూ.7 లక్షలకు అతడిని ఈ ఫ్రాంచైజీ కొనుక్కుంది.
27 ఏళ్ల ఈ ఎడమచేతివాటం పేసర్ పై ఈ ఏడాది జూలై 6న ఘజియాబాద్ జిల్లా ఇందిరాపురం పోలీస్ స్టేషన్ లో బాలిక/యువతిని వేధించినందుకు కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక అవసరాలు తీర్చుకున్న అతడు మోసం చేసే ఉద్దేశంలో ఉన్నట్లు యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అతడు స్టే తెచ్చుకున్నాడు.
ఐదేళ్ల పరిచయం..
బాలిక/యువతితో యశ్ దయాల్ కు ఐదేళ్ల కిందట పరిచయమమైంది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాయిదా వేయడం మొదలుపెట్టాడు. మరొక మహిళతోనూ అతడికి సంబంధం ఉన్నట్లు గ్రహించిన బాధితురాలు కేసు పెట్టింది. కాగా, గోరఖ్ పూర్ యూపీ సీఎం యోగి సొంత నియోజకవర్గం. అసలే యూపీలో మహిళలను వేధించిన వారిని యోగి ప్రభుత్వం తాట తీస్తోంది. అలాంటిది గోరఖ్ పూర్ ఫ్రాంచైజీ ఆటగాడిపైనే లైంగిక ఆరోపణలు రావడంతో యూపీ లీగ్ యాజమాన్యం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇతర ఆటగాళ్ల గాయాల కారణంగా.. యశ్ దయాల్ ను ఇటీవల ఇంగ్లండ్ లో పర్యటించిన టీమ్ ఇండియాకు ఎంపిక చేయాలని ఓ దశలో భావించారు. చివరకు ఉన్న ఆటగాళ్లతోనే సరిపెట్టారు. దయాల్ పై ఆరోపణలు నిరూపితం కావాల్సి ఉంది. అప్పటివరకు అతడు నిందితుడు మాత్రమే.