ఐపీఎల్ లో ’చంపక్..’ ఆటగాళ్ల మధ్యలో ’చమక్’
వాస్తవానికి ఈ ఏడాది మార్చి 22న ఐపీఎల్ షురూ అయితే.. రోబో డాగ్ వచ్చింది మాత్రం ఈ నెల 13న. తాజాగా దానికి నామకరణం కూడా చేశారు.
By: Tupaki Desk | 22 April 2025 5:36 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే కేవలం ధనాధన్ స్కోర్లు.. ఫటాఫట్ వికెట్లే కాదు.. కొత్త కొత్త ప్రయోగాలు.. చీర్ గర్స్.. డ్రోన్ కెమెరాలు.. ఇంపాక్ట్ ప్లేయర్లు.. ఇవన్నీ ఇప్పటికే చూశాం.. మరి ఈ సీజన్ లో ఏమిటి ప్రత్యేకత అంటారా?
ప్రస్తుతం మ్యాచ్ టాస్ వేయడానికి అఫీషియల్స్ గ్రౌండ్ లోకి వస్తుండగా వారితో ఓ స్పెషల్ కనిపిస్తుంటుంది గమనించారా? అయితే అది మనిషి కాదు మర మనిషి కూడా కాదు. మరేమిటి అంటారా? మర శునకం.
ఎన్నో ప్రత్యేకతలతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆకట్టుకుంటోంది. అందులో మరింత అట్రాక్సన్ రోబో డాగ్. వాస్తవానికి ఈ ఏడాది మార్చి 22న ఐపీఎల్ షురూ అయితే.. రోబో డాగ్ వచ్చింది మాత్రం ఈ నెల 13న. తాజాగా దానికి నామకరణం కూడా చేశారు.
ఆ పేరేమిటంటే..?
రోబో డాగ్ కు ఒకప్పడు భారత్ లో విశేష ఆదరణ పొందిన పిల్లల పక్ష పత్రిక చంపక్ పేరును ఖాయం చేశారు. ఐపీఎల్ ఎక్స్ ఖాతా ద్వారా ఈ పేరును వెల్లడించారు. అయితే, ఇదేమీ తేలిగ్గా చేయలేదు.
మీరే పేరు పెట్టండి అంటూ ప్రేక్షకులను ఐపీఎల్ నిర్వాహకులు కోరారు. బడ్డీ, జఫ్ఫా, చంపక్, చుల్ బుల్ అనే పేర్లను ఇచ్చారు. అయితే, చంపక్ కు 76 శాతం మంది ఓటేశారు. బడ్డీకి 10 శాతం, జఫ్ఫాకు 7 శాతం, చుల్ బుల్ కు 7శాతం ఓట్లు పడ్డాయి.
అదే మరి ధోనీ స్పెషల్
ఇక చంపక్ గురించి చెప్పాలంటే.. దాని విన్యాసాలు మామూలుగా ఉండవు. మనం గెంతితే గెంతుతుంది.. ప్లేయర్ల మధ్యలోకి వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తుంది. వాళ్లతో ఆడుతుంది కూడా. మైదానంలో దీని సందడి చూసిన ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చంపక్ పేరును ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ముంబూ ఇండియన్స్ (ఎంఐ) మధ్య మ్యాచ్ కు ముందు ప్రకటించారు.
పవర్ ఫుల్ ఫీచర్లున్న చంపక్.. నడవగలదు, దూకగలదు, కూర్చోగలదు కూడా. దీని ముందు భాగంలోని కెమెరాతో ప్రేక్షకులకు వినూత్న వీక్షణ అనుభవాన్ని అందిస్తుంటుంది.
కొసమెరుపు: ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా చంపక్ ఆటగాళ్లను ఓ ఆటాడుకుంటోంది. అయితే.. సీఎస్కే కెప్టెన్ ధోనీతో మాత్రం దాని ఆటలు చెల్లలేదు. ఎందుకంటే ధోనీ.. వస్తూనే దానిని తిప్పేసి పడుకోబెట్టాడు. దీంతో చంపక్ కదల్లేకపోయింది.