20వ ఏట నుంచి ఐపీఎల్ 3 నెలలు.. మరో 20 మ్యాచ్ లు.. సాధ్యమేనా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇకమీదట మరింత కాలం సాగనుందా..? ఇప్పటికే 2 నెలల 3 రోజులు జరుగుతున్న లీగ్ ఇకపై మూడు నెలలు కానుందా? అసలు ఇది సాధ్యమేనా?
By: Tupaki Desk | 29 April 2025 9:10 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇకమీదట మరింత కాలం సాగనుందా..? ఇప్పటికే 2 నెలల 3 రోజులు జరుగుతున్న లీగ్ ఇకపై మూడు నెలలు కానుందా? అసలు ఇది సాధ్యమేనా?
ఇప్పటికే ఐపీఎల్ పై భారత దేశంలోనే కాక విదేశాల్లోనూ ఎన్నో విమర్శలు ఉన్నాయి. తమ దేశ క్రికెట్ కు ఐపీఎల్ పెద్ద ముప్పుగా మారిందని, ఐపీఎల్ కు ప్రాధాన్యం ఇస్తున్న తమ క్రికెటర్లు దేశాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి.
ప్రస్తుతం 10 జట్లతో 2 నెలలకు పైగా సాగుతోంది ఐపీఎల్. 2022 నుంచి రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్ (జీటీ), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) లీగ్ లోకి వచ్చాయి. దీంతో మ్యాచ్ ల సంఖ్య పెరిగింది. ఫైనల్ తో సహా 74 మ్యాచ్ లు జరుగుతున్నాయి.
2008లో మొదలైన ఐపీఎల్ 20 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా 2028 నుంచి మరో 20 మ్యాచ్ లు జరుగుతాయట. అంటే మొత్తం 94 మ్యాచ్ లు. జట్లు మాత్రం పెరగవు. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపాడు.
2027 వరకు ప్రస్తుత ఐపీఎల్ మీడియా హక్కుల కాల పరిమితి ఉంది. ఆ తర్వాత కొత్త మీడియా పార్ట్ నర్ రానున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ ల పెంపుపై ఐసీసీతోనూ చర్చించామని ధుమాల్ అంటున్నాడు. అయితే, ఫ్రాంచైజీ, టి20, ద్వైపాక్షిక, ఐసీసీ ఈవెంట్లపై అభిమానుల స్పందన పరిశీలిస్తున్నట్లు కూడా తెలిపాడు.
ఐపీఎల్ ను మరో 20 మ్యాచ్ లకు పెంచాలి అంటే ప్రతి జట్టు సొంతగడ్డపై ఒకటి, ప్రత్యర్థి గడ్డపై మరొక మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
20 మ్యాచ్ లు కొత్తగా చేరిస్తే 20 రోజులు పడుతుంది. లేదా 10 నుంచి 15 రోజులు. ఈ లెక్కన ఐపీఎల్ ను మూడు నెలలు నిర్వహించాల్సి ఉంటుందేమో?
ఈ ఏడాది మార్చి 22న మొదలైన ఐపీఎల్ మే 25 వరకు సాగనుంది. 94 మ్యాచ్ లు అంటే మార్చి నుంచి మే వరకు మూడు నెలలు పోతుంది. దీనికి అవకాశం ఉంటుందా? విదేశీ బోర్డులు తమ ఆటగాళ్లను అన్ని రోజులు ఆడేందుకు అంగీకరిస్తాయా? అంటే ఏమో చెప్పలేం.. డబ్బు ముందు అన్నీ దిగదుడుపే.